Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

జిల్లా కలెక్టర్లతో సిఎం కెసిఆర్ ప్రత్యేక సదస్సు

KCR

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ… సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రతి కలెక్టర్ వద్ద రూ. 5 కోట్లు ఉంచనున్నట్లు చెప్పారు. ఏడాదిలోపు అన్ని జిల్లాల కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాల నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అనాధ పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే జిల్లాల్లో ఒంటరి మహిళలను గుర్తించి భృతి ఇవ్వాలన్నారు. మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం మరోసారి నిర్వహించాలని చెప్పారు. ఇక లబ్ధిదారుల ఎంపికకు లాటరీ పద్ధతి అనుసరించాలని తెలిపారు. పశువైద్య విద్య పూర్తి చేసిన వారికి వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.

ఆయా జిల్లాల సరిహద్దు రాష్ట్రాల నుంచి గొర్రె పిల్లలు కొనుగోలు చేయాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోను గొర్రె పిల్లలు కొనుగోలు చేయొద్దన్నారు. అసైన్డ్ భూముల వివరాలు పది రోజుల్లో అందజేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు గ్రామసందర్శనల్లో భాగంగా దళిత వాడలు, గిరిజన తండాలను పరిశీలించాలన్నారు. పది రోజుల్లో కారుణ్య నియామకాలు పూర్తి చేయాలన్నారు. దీంతోపాటు ఉద్యోగులైన దంపతులు ఒకే చోట పనిచేసేలా బదిలీలు ఉండాలని చెప్పారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు స్థానిక దర్జీలే కుట్టేలా చర్యలు తీసుకోవాన్నారు.

జనగామ తరహాలోనే మహిళలకు ఆత్మరక్షణ విద్య అన్ని చోట్లా నేర్పాలని, దీనికోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు కోసం అవసరమైన స్థలం గుర్తించాలన్నారు. అన్ని వర్గాల భాగస్వామ్యంతో గ్రామాల్లో క్లీన్ ద విలేజ్ కార్యక్రమం చేపట్టాలి. క్లీన్ ద విలేజ్ కింద పరిశుభ్రమైన గ్రామాలకు కలెక్టర్ అవార్డు పేరిట నగదు ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. దీంతోపాటు దళిత కాలనీలు, గిరిజన తండాలకు కలెక్టర్ అవార్డు ఇవ్వాల్సిందిగా తెలిపారు.

విద్యుత్ తీగలు, నియంత్రికల మరమ్మతులు,పరిశుభ్రత కోసం పవర్ డే నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గుడుంబా నివారణ చర్యలతోపాటు తయారీదారులకు ఉపాధి కల్పించాలన్నారు. కుటుంబంలో ఆసరా పింఛను లబ్ధిదారులతో పాటు బీడీ కార్మికులుంటే వారికీ భృతి కల్పించాలన్నారు. వరంగల్ నగరాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అమ్రపాలిని ఆదేశించారు.

Comments

comments