Home తాజా వార్తలు వలస పెత్తనం వద్దు…

వలస పెత్తనం వద్దు…

 CM KCR Speech At Kodangal Praja Ashirvada Sabha

ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవానికి పరీక్ష
 పాలమూరు జిల్లాకు శత్రువులు ఇక్కడి వారే
 దొంగ సర్వేలను నమ్మొద్దు
 బాబుకు తెలంగాణ పౌరుషాన్ని చూపించాలి
మంచికైనా, చెడుకైనా మనోడే ఉండాలి : కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ :
ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవానికి పరీక్ష అని, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబుకు మన పౌరుషాన్ని చూపించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. మక్తల్, వికారాబాద్, కొడంగల్, గద్వాల్, అలంపూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కెసిఆర్ తన ప్రసంగాల్లో మనకు శత్రువులు ఎక్కడో లేరని ఈ ఉమ్మడి జిల్లాలోనే ఉన్నారని, ప్రజలు వారి విషయంలో అప్రమత్తంగా ఉండి ఓడించాలన్నారు. తెలంగాణకు తన స్వంత అస్థిత్వం, ప్రత్యేక రాష్ట్రంగా పాలన సాగించుకునే పరిస్థితి ఉన్నందున ఇంకెంతమాత్రం వలస పెత్తనం, ఆధిపత్యం అవసరం లేదని వ్యాఖ్యానించారు. సద్దితిన్న రేవును ఎన్నడూ మరిచిపోవద్దని, నిరంతరం దానిని తలచుకోవాలన్నారు. ప్రాజెక్టులకు అడ్డంపడిన చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేయాలనుకున్నారని, పట్టుదల ఉన్న ప్రభుత్వం వాటిని అధిగమించిందని, ఇప్పుడు ఆ చంద్రబాబు నిలబెట్టిన మనిషిని మనం గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు నీళ్లు ఆగిపోతాయని, ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేందుకు నాగం జనార్థన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి కోర్టుల్లో కేసులు వేశారని, అయితే ప్రాజెక్టును ఆపొద్దని కోర్టు తీర్పునిచ్చిందని,దీంతో నాగం చెంప ఛెళ్ళుమనిందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేస్తే మొత్తం 20 లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. గట్టు లిఫ్ట్ ఇరిగేషన్‌ను పూర్తి చేయకపోతే మళ్లీ 5 సంవత్సరాల తరువాత ఓట్లు అడగమన్నారు. తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టబోతున్నారని, 98 నుంచి 108సీట్లు గెలవబోతున్నదని, దీన్ని చూసి జీర్ణించుకోలేని ఆంధ్ర పార్టీలు ఇప్పుడు ఒక సర్వేను విడుదల చేస్తున్నాయని, ఇలాంటి దొంగ సర్వేలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బైరెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చా…
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గతంలో ఆర్‌డీఎస్‌ను బాంబులతో పేల్చుతానని ప్రగల్భాలు పలికితే దానికి కౌంటర్‌గా తాను సుంకేశు ల బ్యారేజ్‌ను వెయ్యి బాంబులతో పేల్చుతానని తాను దానికి కౌంటర్‌గా సమాధానం ఇస్తే మహబూబ్‌నగర్ ప్రజలకు తన పై నమ్మకం కుదిరిందన్నారు. ఆనాడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు నమోదు చేయలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్, టిడిపిలు ఓట్లు అడుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తుంగభద్ర జలాలకు సంబంధించి మనకు రావాల్సిన నీళ్ల వాటాను మనకు రావాల్సిందన్నారు.గత ప్రభుత్వ హయాంలో ఆర్‌డీఎస్‌ను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. ఆర్‌డిఎస్ కాల్వలో నీరు పారినట్టుగానే టిఆర్‌ఎస్‌కు కూడా ప్రజలు ఓట్లు వేయాలన్నారు. మంచికైనా, చెడుకైనా మనోడు ఉండాలన్నారు. బీమా, కల్వకుర్తి, నెట్టంపాడులతో 8.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామన్నారు. మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటున్నామని ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు
మన దేశంలో ప్రధానమంత్రి కూడా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, అది దేశ ప్రజల దురదృష్టమని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ సభలో మాట్లాడుతూ తెలంగాణలో కరెంట్ లేదని అన్నారని, మన రాష్ట్రంలో కరెంట్ లేదా? అంటూ ప్రజలను అడిగారు. చిల్లర మాటలు, అబద్ధాలతో 70 ఏళ్లుగా దేశ రాజకీయ వ్యవస్థ నలిగిపోయిందని, దేశంలోని ప్రజల ఆశలు తీరడం లేదని, రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని కెసిఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కళ్ల ముందే ఉన్నాయన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.
చంద్రబాబు 24 గంటల విద్యుత్‌ను ఎందుకు సరఫరా చేయడం లేదు
హైదరాబాద్ నేనే కట్టాను…హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానని చెప్పుకునే చంద్రబాబు 24 గంటల విద్యుత్‌ను ఎందుకు సరఫరా చేయలేరపోయారని ఆయన ప్రశ్నించారు. 1974 సంవత్సరంలో బచావత్ జూరాల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని కెసిఆర్ పేర్కొన్నారు. 1974లో జూరాల కట్టినప్పటి నుంచి దానిని నింపలేదన్నారు. 2001లో టిఆర్‌ఎస్ జెండా ఎగురగానే జూరాల ప్రాజెక్టును నీటితో నింపాలని తాను పాదయాత్రలో గర్జిస్తే చంద్రబాబు వెంటనే కర్ణాటకు భూముల పరిహారం డబ్బులను చెల్లించి, వెంటనే జూరాలను నీటితో నింపారని ఆయన పేర్కొన్నారు. ఇదంతా వాస్తవం కాదా కాంగ్రెస్ వాళ్లు ఎందుకు అడగలేదని ఆయన ఆరోపించారు. జూరాల నెత్తిమీద ఉన్న మంచినీటి కష్టాలను శాశ్వతంగా పరిష్కరించడానికి మిషన్ భగీరథను తీసుకొచ్చామన్నారు. గట్టు త్తిపోతల పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కాంగ్రెస్‌లో అందరూ మేధావులేనని మరీ 24 గంటల ఎందుకు కరెంట్‌ను సరఫరా చేయలేక పోయారని ఆయన ప్రశ్నించారు. భూ రికార్డులను ప్రక్షాళన చేశామన్నారు. మహబూబ్‌నగర్‌ను దత్తత తీసుకున్న చంద్రబాబు ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పెత్తనం తెలంగాణకు అవసరమా అని ఆయన ప్రజలను అడిగారు. చంద్రబాబు కూకట్‌పల్లి, ఖమ్మం, కోదాడ ప్రజలను డబ్బుతో ప్రభావితం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్నారు.
కిరణ్‌కుమార్ రెడ్డి భయబ్రాంతులకు గురిచేశారు
తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం అంధకారం అవుతుందని చెప్పిన అప్పటి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వస్తే రాష్ట్రంలో కరెంట్ ఉండదని ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడని ఇప్పుడు 24 గంటల విద్యుత్‌ను తాము సరఫరా చేస్తున్నామన్నారు. విద్యుత్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ కష్టపడుతుండటం వల్లనే 24 గంటల కరెంట్ సాధ్యమవుతుందని, గప్పాలు కొడితే కరెంట్ రాదని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ప్రవాహ్ యాప్ ద్వారా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిరంతరం పర్యవేక్షిస్తూ కాపలా కాస్తుండటం వల్లనే నాణ్యమైన విద్యుత్ ను అందచేస్తున్నామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉందన్నారు. దేశంలో 19 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉందని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఉందా..? కళ్యాణలక్ష్మి ఉందా..? రూ. వెయ్యి పెన్షన్ ఉందా..? అని ప్రశ్నించారు. వికలాంగులకు రూ.1,500 పెన్షన్, రైతుబంధు పథకం ఎక్కడైనా ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సమస్యలు అధిగమించి దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. తాను కూడా రైతుబిడ్డేనని గత ప్రభుత్వాల హయాంలో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ప్రజల అభీష్టం గెలవాలి
ప్రజాస్వామ్యంలో నిజమైన పరిణతి ఉంటే ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు, నాయకులు కాదని ప్రజలు గెలవాలని, ప్రజల అభీష్టం గెలవాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతు న్నాయని, ప్రజలు మంచిని ఆలోచించి వివేచనతో ఓట్లు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా రెండింటి మధ్యనే పోటీ ఉందని అని ఆయన పేర్కొన్నారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టిడిపిల కూటమి ఒకవైపు, 15 ఏళ్లు పోరాటం చేసి, నాలుగేళ్లు పాలించిన టిఆర్‌ఎస్ మరోవైపు ఉందని అన్నారు. టిఆర్‌ఎస్, టిడిపి, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు కొత్త కాదని ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 58 ఏళ్లు కరెంట్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉందో ఆలోచించాలని ఆయన కోరారు. చరిత్ర మీ కళ్ల ముందు ఉంది, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. అభివృద్ధి అంతా ప్రజల కళ్ల ముందే ఉందన్నారు.
సమైక్య పాలనలో రైతాంగం దెబ్బతింది
సమైక్య పాలనలో రైతాంగం దెబ్బతిందని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునే ఉద్ధేశ్యంతోనే రైతుబంధు పథకం కింద పంటకు రూ.5 వేలకు పెంచి, ఏడాదికి రూ.10 వేలు ఇస్తామన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందని పేర్కొన్నారు. అలాగే రైతుబీమా ద్వారా ఎకరం, అద్దెకరం భూమి ఉన్న రైతు చనిపోయినా రైతు కుటుంబం రోడ్డు మీద పడకుండా రైతులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించామని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 4 వేల మంది రైతుల కుటుంబాలు రైతు బీమా కింద లబ్ధిపొందారని చెప్పారు. రైతులు సహజంగా మరణించినా ఎలాంటి ఫైరవీలు లేకుండా రైతుబీమాను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.వెయ్యి ఇస్తున్న ఆసరా పెన్షన్లను రూ.2016కు, వికలాంగులకు పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచి నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ముస్లింలు, గిరిజనులు, దళితులు, బిసిల కోసం రెసిడెన్షియల్ పాఠశాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చుపెడుతున్నామని ఆయన వెల్లడించారు. 29 రాష్ట్రాల్లో మైనార్టీల బడ్జెట్ రూ. 4 వేల కోట్లు ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.2 వేల కోట్లను కేటాయించిందన్నారు. దళితులు, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.
ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటు
రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలతో ఫుడ్‌ప్రాసెసింగ్(ఆహార శుద్ధి కేంద్రాలు)యూనిట్‌లను నెలకొల్పుతామని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ కేంద్రాలను ఐకెపి మహిళలే నిర్వహిస్తారని తెలి పారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐకెపి ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం చాలాచోట్ల కల్తీ రాజ్యమేలుతుందని దానిని రూపుమాపడానికే ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను నియోజకవర్గానికి ఒకటి నుంచి మూడు వరకు నెలకొల్పాతామన్నారు. రేషన్ డీలర్లకు వచ్చే కమీషన్‌తో వారి కడుపు నిండడంలేదని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రేషన్ డీలర్ల ద్వారా అమ్ముకునేలా చేస్తామన్నారు. రేషన్ డీలర్లు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో తయారైన కల్తీలేని సరుకులు అమ్ముకునే విధానం తీసుకువస్తామన్నారు.
లంగ, దొంగ సర్వేలను నమ్మవద్దు
లంగ, దొంగ సర్వేలను నమ్మవద్దని కెసిఆర్ సూచించారు. మంగళవారం సాయంత్రం చంద్రబాబు టిఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక డూప్లికేట్ సర్వేను విడుదల చేయనున్నారని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలవాల్సిన ఆవశ్యకత ఉందని సిఎం కెసిఆర్ అన్నారు. ఇప్పటివరకు తాను 118 నియోజకవర్గాలు తిరిగానని, ఎక్కడ చూసినా భారీ ఎత్తున జనం తరలివస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ గెలుస్తున్నట్లు 12 సర్వేలలో తేలిందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్క కెసిఆర్‌ను కొట్టడానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, నరేంద్రమోడీ, చంద్రబాబు,సిపిఐ, సిసిఎం ఇంత మంది వస్తున్నారని, తనను తెలంగాణ ప్రజలే కాపాడాలన్నారు. తెలంగాణ ప్రజలకు పౌరుషం లేకుండా ఉన్నారా అని ఆయన పేర్కొన్నారు. పాలమూరు జిల్లాల్లోని 14 స్థానాలను కచ్చితంగా టిఆర్‌ఎస్ పార్టీ గెలుస్తుందన్నారు.

CM KCR Speech At Kodangal Praja Ashirvada Sabha