Home నిజామాబాద్ పింఛన్లు పెంచుతాం

పింఛన్లు పెంచుతాం

CM KCR Speech at TRS public meeting in Nizamabad today

వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికుల పింఛన్లు పెంచుతాం

కడుపు కట్టుకొని ప్రగతి సాధిస్తే విమర్శలా
దేశంలో నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ ఎలా నిలిచింది
సాగు నీటి ప్రాజెక్టులకు ప్రతిపక్షాలు కలిసిరాకపోవడం దారుణం
మహామోసంపై తెలంగాణ మేధావులు స్పందించాలి
ప్రజా ఆశీర్వాదసభలో సిఎం కెసిఆర్  

లెక్కలేని అడ్డంకుల నడుమ భయంకరమైన పరిస్థితులు, సంక్షోభం, వలసలు, కరువు, శిథిలమైన చెరువులు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, చెదిరిన కులవృత్తులు, కరెంటు కష్టాలు.. వీటన్నింటిని అధిగమించిన తెలంగాణ నాలుగున్నర యేళ్ల కాలంలో నంబర్‌వన్ రాష్ట్రంగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం నిజామాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ ప్రసంగిస్తూ నాలుగున్నర యేళ్ల పాలనలో తాము ప్రజాసంక్షేమం కోసం చేసిన కృషిని వివరించారు.

మనతెలంగాణ/ నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్ర ఆర్థిక ప్రగతి 17.17 శాతం ఉండగా గత నాలుగు నెలల్లో 19.83శాతం ఉందని వెల్లడించారు. అదే సమయంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల నుండి ఎదురైన చికాకులు, విమర్శలను ప్రజలముందు ఉంచిన సిఎం తీర్పు మీరే చెప్పాలని, అందుకే మీ మధ్యకు వచ్చానంటూ వివరించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇంత ప్రగతి సాధించడం వెను క ఉన్న కృషిని గమనించాలని కోరారు. కడుపుకట్టుకొని, అవినీతి లేకుండా పాలన సాగించడం వల్లే ఫలితం దక్కిందని వివరించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఇసుకపై రూ. 9.56 కోట్లు రాగా నాలుగేళ్ల కాలంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 1977 కోట్లు రాబట్టిందని వివరించారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వానికి ఆదాయం రాకుండా దోచుకుతిన్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో సంక్షేమ పథకాల జాబితా చెబితే తెల్లారుతుందని, వాటి ఫలితాలు ప్రజలకే ఎక్కువగా తెలుసని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 17వేల కోట్ల రుణమాఫీ చేశామని, రైతుల జీవితాల్లో ఆనందం తెచ్చేందుకు ఎకరానికి రూ. 8వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నట్లు వివరించారు. రైతులకు మేలు జరిగితే తమ అడ్రస్ గల్లంతవుతుందని భయపడ్డ కాంగ్రెస్ నేతలు రెండవ దఫా చెక్కులు రాకుండా కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు.

రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం దేశం లో ఒక్క తెలంగాణనేనని కెసిఆర్ స్పష్టం చేశారు. రైతుల గాచారం బాగా లేక చనిపోతే ఒక గుంట భూమి ఉన్న రైతు కుటుంబానికి కూడా రూ. 5లక్షల ప్రమాద బీమా చెల్లిస్తున్నట్లు వివరించారు. రైతులకు మరింత మేలు చేసేందుకు 5వేల ఎకరాలకు క్లస్టర్‌గా 2,638 క్లస్టర్లకు సహాయ వ్యవసాయ అధికారులను నియమించుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో పేద గర్బిణీలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవాల ద్వారా ఆర్థికంగా, బౌతికంగా నష్టపోతున్న విషయంలో ప్రభుత్వం స్పందించి మెరుగైన సౌకర్యాలతో ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా ప్రసవాలను చేస్తున్నట్లు వెల్లడించారు. కెసిఆర్ కిట్లతో పాటు ఆడబిడ్డ పుడితే రూ. 13వేలు, మగ పిల్లవాడు పుడితే రూ. 12వేలు బాలింతకు ఇస్తూ ఆర్థికంగా అండగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో అనవసర ఆపరేషన్లతో మహిళలు గర్బసంచులను కోల్పోయారని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆసరా లేని వృద్దులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, బీడి కార్మికులకు పెన్షన్లను భారీగా పెంచి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సాయంతో వృద్దులు తనను పెద్దకొడుకులా భావించి దీవిస్తున్నారని కాంగ్రెస్ వారి దీవెనలను జీర్ణించుకోలేక అర్రాస్ పాటల రూ. 2వేల పెన్షన్ ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఏనాడైనా పెన్షన్ పెంచాలని అనిపించిందా అంటూ ప్రశ్నించిన కెసిఆర్ ఓరేయ్ నాయనా నేను పెంచితే అంతకు మించి ఇస్తారా అంటూ ఎద్దేవా చేశారు. తమ మెనిఫెస్టోలో పెన్షన్ ఎంత పెంచేది వెల్లడిస్తామన్నారు.

రాష్ట్రంలో నిజాం కాలం నుండి పేరుకుపోయిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా రైతులకు మేలు చేసినట్లు వివరించారు. సాదాబైనామాల భూములను రికార్డుల్లోకి ఎక్కించి రూపాయి ఖర్చు లేకుండా రైతులకు పాస్‌బుక్‌లను అందించినట్లు వెల్లడించారు. నిజామాబాద్‌లో ఎర్రజొన్న రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం లాఠీ చార్జీ చేస్తే తమ ప్రభుత్వం రూ. 10 కోట్లు చెల్లించి ఆదుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో చిన్న ఉద్యోగులకు గౌరవంగా బతికేందుకు వేతనాలు పెంచింది టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని రాబోవు రోజుల్లో వారికి మరింత గౌరవంగా వేతనాన్ని అందిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. గతంలో కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే గోదాములుండగా తెలంగాణ ప్రభుత్వం 23లక్షల మెట్రిక్ టన్నుల సామర్థంతో గోదాములను నిర్మించినట్లు తెలిపారు. వ్యవసాయంలో సాంకేతికత ద్వారా ఉత్పత్తిని పెంచేందుకు రైతులకు సబ్సిడిపై ట్రాక్టర్లను ఇచ్చామని, 75 నుండి వంద శాతం సబ్సిడితో డ్రిప్ ఇచ్చామని రైతులకు ప్రాజెక్టుల కింద నీటి తీరువాను తొలగించామని, మార్కెట్ కమిటిలో బడుగు,బలహీనవర్గాలకు, మహిళలకు రిజర్వేషన్ తెచ్చామని, రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసి రైతులకు మేలు చేస్తున్నట్లు వెల్లడించారు.

రాబోవు రోజుల్లో రైతు సమన్వయ సంఘాలకు గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన కెసిఆర్ తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు చూడడమే లక్షమన్నారు. కాంగ్రెస్ నేతలు వేసిన 196 కేసులను అధిగమించి తెలంగాణ ప్రజలకు వరంగా మారనున్న కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. చిద్రమైన కులవృత్తుల పరిరక్షణ ద్యేయంగా నాయిబ్రహ్మణ, రజక కులాలకు చేయూతనిచ్చినట్లు కెసిఆర్ వెల్లడించారు. గీత కార్మికుల రెంటల్ రద్దు చేయడంతో పాటు మత్యకార్మికులకు సబ్సిడిపై యూనిట్లను అందించినట్లు పేర్కొన్నారు. 50శాతం సబ్సిడిపై చేనేతలకు ముడిసరుకులు అందిస్తున్నామని గొల్లకుర్మలకు జీవాలను అందించి ఆదుకుంటున్నట్లు వెల్లడించారు. పాల ఉత్పత్తి దారులకు బర్రెల పంపిణీతో పాటు లీటర్‌కు రూ. 4 అంది స్తూ సహకరించామని ఎంబిసిల అభ్యున్నతి కోసం రూ. వెయ్యి కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్లు కెసిఆర్ వివరించారు. రాష్ట్రంలో 5వేల కిలో మీటర్ల జాతీయ రహదారులను తెచ్చుకున్నామని చెప్పిన కెసిఆర్ ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 8 మైనార్టీ విద్యాసంస్థలను నెలకొల్పినట్లు తెలిపారు. కంటి వెలుగు ద్వారా ప్రతి పౌరుడికి మెరుగైన ఉచిత కంటి చికిత్సలను అందిస్తూ ఉచితంగా అద్దాలు, మందులను పంపిణీ చేస్తూ అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేపిస్తున్నామన్నారు.

భవిష్యత్తులో ముక్కు, చెవి రుగ్మతల నివారణకు ఈఎన్‌టి బృందాలను గ్రామాలకు పంపుతామని కెసిఆర్ ప్రకటించారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలను కంప్యూటర్‌లో పొందుపర్చి తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చే పట్టుదలతో పనిచేస్తున్నామని వివరించిన ఆయన ఏనాడైనా కాంగ్రెస్ నేతలకు ప్రజల ఆరోగ్యం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఆడపడుచుల కష్టాలను చూడలేక ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించాలని తాను పెట్టుకున్న లక్ష్యాన్ని అధిగమించినట్లు చెప్పిన కెసిఆర్ మాట ప్రకారం భగీరథ పూర్తి చేశాకే మీముందుకు వచ్చానంటూ ధీమా వ్యక్తం చేశారు. భూమిని ఐదు సార్లు చుట్టి వచ్చేంత పొడవుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి పైప్‌లైన్లను వేసి, రక్షిత తాగునీటి పథకాల నిర్మాణాలను పూర్తి చేశామని కెసిఆర్ వివరించారు. ఈ మేరకు లక్ష 50వేల కిలో మీటర్ల పైప్‌లైన్లు వేయగా 12వేల రకాల సమస్యలను అధిగమించి విజయం సాధించామని తెలిపారు.

పైప్‌లైన్‌లు వేసేందుకు రాష్ట్ర, జాతీయ రహదారులు, అడవులు, కాలువలు, వాగు లు, వంకలు, నదులు, రైలు మార్గాలు ఇలా అన్నింటిని దాటుకోని భగీరథ నీరు 1690 గ్రామాలకు చేరిందని ఇక నల్లాలు బిగించి నీటిని అందించడమే మిగిలిందని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మత్తులను పూర్తి చేసుకున్నామని వివరించారు. రాబోవు రోజుల్లో మీ ముందుకు వచ్చే కాంగ్రెస్, టిడిపి, బిజెపిలను నమ్మవద్దని పిలుపునిచ్చిన కెసిఆర్ సుస్థిర పాలన కోసం టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా సభ అధ్యక్షత వహించిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలను ప్రజలకు పరిచయం చేస్తూ వారిని గెలిపించాలని కోరారు.