Search
Sunday 23 September 2018
  • :
  • :

ఢీల్లీకి గులాములవుదామా… ఆత్మగౌరవంతో జీవిద్దామా?

CM KCR speech in pragathi nivedana sabha

త్వరలో రాజకీయ నిర్ణయం, ఎన్నికల మేనిఫెస్టో
కొంగరకలాన్‌లో అశేష జనవాహినినుద్దేశించి సిఎం కెసిఆర్ 

ఎన్నికలపై మీడియాలో కథనాలొస్తున్నాయి
నిర్ణయం తీసుకునే అధికారం నాకు ఇచ్చారు
ప్రజలకు ఏది మంచిదైతే ఆ రాజకీయ నిర్ణయం త్వరలో తీసుకుంటా
కెకె అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తాం
మన బిడ్డల కోసం కొత్త జోనల్ సాధించుకొచ్చా
ఢిల్లీకి గులాములు కావొద్దు
తమిళనాడులోలా మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుందాం
గత మేనిఫెస్టోలో హామీ ఇవ్వని 76 అంశాలను అమలు చేశాం
వారం రోజుల్లో అన్ని గ్రామాలకూ భగీరథ నీరు : ముఖ్యమంత్రి

మన తెలంగాణ/ హైదరాబాద్ : “కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాములుగా ఉందామని అంటున్నాయి. తెలంగాణకు సంబంధించిన నిర్ణయాధికారం తెలంగాణలో ఉండాలా? లేక ఢిల్లీలో ఉండాలా? తెలంగాణ ప్రజలు, కవులు, రచయితలు దయచేసి ఆలోచన చేయాలి. స్వరాష్ట్రం వచ్చినంక కూడా ఇంకా ఢిల్లీ పాలకుల కిందనే ఉండా ల్నా?” అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీకి బానిసలం కావద్దని, వాళ్లకు గులాంలం అసలే కావద్దని, అది భవిష్యత్తుతరాలకు మంచిది కాదని అన్నారు. నిర్ణయాధికారం మన చేతిలోనే ఉండాలని నొక్కిచెప్పిన ముఖ్యమంత్రి నిర్ణయా లు కూడా మన దగ్గరే జరగాలని అన్నారు.“నిరుద్యోగుల గురించి ఆలోచిద్దాం. మంచి చేసే ప్రయ త్నం చేద్దాం. పింఛన్లను పెంచుకుందాం. కొత్త పథకాలను ఇప్పుడు ప్రకటించడం ధర్మం కాదు. ముఖ్యమంత్రి హోదాలో నేను ఇప్పుడు చెప్పడం అనైతికం. త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తాం. పార్టీ సెక్రెటరీ జనరల్ కేశవరావు ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. మాట ఇస్తే అమలు చేయాలి. ఇప్పుడు చెప్పి తర్వాత మాట మరవడం మంచిది కాదు.

నాలుగున్నరేళ్ళలోనే అద్భుతమైన ప్రగతిని సాధించాం. భవిష్యత్తు బ్రహ్మాండంగా తయారుకావాలె. రాజకీయంగా తెలంగాణకు, టిఆర్‌ఎస్‌కు, ప్రజల భవిష్యత్తుకు ఏది మంచి అయితే ఆ నిర్ణయం తీసుకునే బాధ్యతను అప్పజెప్పారు. సమీప భవిష్యత్తులో నిర్ణ యం తీసుకుందాం. ఈ నాలుగున్నరేళ్ళ ప్రగతిని చూసి ఆశీర్వదించండి” అని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారు. కొంగరకలాన్‌లో ఆదివా రం సాయంత్రం జరిగిన ‘ప్రగతి నివేదన’ సభలో సుమారు 50 నిమిషాల పాటు చేసిన ప్రసంగం లో కెసిఆర్ పై విధమైన వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నరేళ్ళలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని నివేదించారు. స్వరాష్టం ఏర్పడిన తర్వాత కూడా ఢిల్లీలో నిర్ణయాలు జరగడం మంచిది కాదని, రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు రాష్ట్రంలోనే జరగాలని, ఢిల్లీకి గులాంలుగా, బానిసలుగా ఉండరాదని అన్నారు. కొన్ని పార్టీలు ఆ విధంగా ఆలోచిస్తున్నాయని, అధికారం, నిర్ణయా లు ఇక్కడే ఉండాలన్నారు. 50 ఏళ్ల నాటి నుంచి తమిళ సోదరులు ఏ ఇతర పార్టీలు లేకుండా ఆత్మగౌరవంతో ఎలా పరిపాలించుకుంటున్నారో తెలంగాణ అంతా ఒక్కటిగా ఉండి నిర్ణయాధికారం మన చేతిలోనే ఉంచుకోవాలన్నారు.

శాసనసభ రద్దుపై: భవిష్యత్ బ్రహ్మాండంగా తయారు కావాలని, అద్భుతమైన తెలంగాణ రూ పుదిద్దుకోవాలని, రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్ళలో స్వీయ ఆదాయ వనరులపై భయపడ్డామని, ఇప్పుడు ఆ బాధ లేదని కెసిఆర్ వ్యాఖ్యానించా రు. “ఇప్పుడిచ్చే పింఛన్‌లను కొంత పెంచుదాం. నిరుద్యోగ సోదరులను ఆదుకుంటాం. ఇంకా అన్నింటికీ కొన్ని పెంచుకుంటాం. ప్రగతి నివేదనలో రాజకీయం గురించి కెసిఆర్ ఏమన్నా చెప్తడా&అని అందరూ అనుకున్నా రు. శాసనసభను రద్దు చేస్తారా అనే వార్తలూ వచ్చాయి. రాజకీయంగా రాష్ట్రానికి తెలంగాణ ప్రజల భవిష్యత్‌కు ఏది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకోవాలని మంత్రులు, ఎంఎల్‌ఎలు ఇతర ప్రజాప్రతినిధులు నాకు బాధ్యత అప్పజెప్పారు. రాబోయే రోజుల్లో భవిష్యత్‌లో మీరు చూడబోతారు. కొత్త పథకాలు ప్రకటిస్తారని కొన్ని పత్రికలు రాశాయి. అధికారంలో ఉన్నాం కాబట్టి మాట అంటే అమలు జరగాలి” అని అన్నారు.

95% రిజర్వేషన్ సాధ్యమయ్యేదా…
ఇది టిఆర్‌ఎస్‌కు యువతపట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఉన్న నిబద్ధత” అని అన్నారు. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణను కళ్ల చూడాలని, మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ భాసిల్లాలని, ఐటితో ఉపాధి పెరగాలని, సంక్షేమాన్ని పెంచుకోవాలని, ఫించన్‌లు పెరగాలని అన్నారు. “గొప్పగా బాగుపడాలనుకున్నాం. అలాగే బాగుపడుతున్నాం. అధికారుల స్థైర్యం దెబ్బతినొద్దు. కొన్ని మూకలు, ప్రతీప శక్తులు తమ స్వార్థం కోసం ప్రాజెక్టుల మీద కేసులు వేస్తున్నారు. కొంతమంది రాజకీయ లక్షం కెసిఆర్‌ను గద్దె దించడమంటున్నారు. దిక్కుమాలిన లక్షం. ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలి. గద్దె దించే లక్షమేంది? ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ఉంటా యి. అలవి కాని మాటలు చెబుతారు అవి వింటే మోసపోతాం. నాలుగేళ్ళ ప్రగతిని మీ ముందు పెట్టాం. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం మంచో కాదో ఇక్కడే నిర్ణయాలు చేస్తున్నారు. కొన్ని పార్టీలు ఢిల్లీ చక్రవర్తులకు సామంతులకుగా ఉన్నాయి. కళాకారులు, కవులు, మేధావులు ఆలోచించాలి. నిర్ణయాధికారం మన దగ్గర ఉండాల్నా? ఢిల్లీలో ఉండాల్నా? అసెంబ్లీ టికెట్టు కూడా ఢిల్లీ నుంచి తెచ్చుకోవాలి. అక్కడ చెంచాగిరీ చేయాలి. గులాంగిరీ చేయాలి. బానిసలుగా ఉండొద్దు. మాట తప్పితే, మడమ తిప్పితే రాళ్లతో కొట్టిచంపామన్నాను. అధికారం ఇస్తే ఎలా బాగుపడవచ్చో చూపించాను. ఉద్యోగాలు పెంచడం, ఆకుపచ్చ తెలంగాణను సాధిస్తాం. మళ్లీ అధికారం ఇవ్వాలి. మీ ఆశీర్వాదం కావాలి. రాజకీయ నిర్ణయాలు త్వరలోనే ఉంటాయి. అప్పుడు అన్నీ చెబుతాను” అని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

వారం రోజుల్లో ఇంటింటికీ భగీరధ నీరు
“చాలా గర్వంగా ధైర్యంగా మనవి చేస్తున్నాం. ఈ మాట చెప్పాలంటే ఖలేజా ఉండాలి. దేశంలో ఏ సిఎం చెప్పలే. వచ్చే ఎన్నికల్లో ఇంటింటికీ మంచి నీటి నల్లా ఇవ్వకుంటే ఓట్ల అడగం అని చెప్పిన. చరిత్రలో ఎవరూ చెప్పలే. కెసిఆర్ చెప్పారు. గర్వంగా ప్రకటిస్తున్నా. సభకు వచ్చే ముందు ఇఎన్‌సి మాట్లాడితే 23 వేల గ్రామాలకు ఇప్పటికే నీరు ఇస్తున్నామని చెప్పారు. 1300 గ్రామాలకు మరో వారం రోజుల్లో చేరుతాయన్నారు. దీపావళివరకు, ఎన్నికలకు ఆరు నెలల ముందే, ఎలక్షన్ పోకుంటే ముందే నీళ్లు వస్తాయి. అధ్బుతమైన విజయం. 11 రాష్ట్రాల వారు వచ్చి చూసిపోయారు. మిషన్ భగీరథను పొగుడుతున్నారు” అని కెసిఆర్ సూటిగా తెలిపారు.

కరెంటు ఛార్జీలే తెలంగాణ ఉద్యమానికి ప్రారంభం
“ఈ రోజు ప్రపంచమే నివ్వెర పోయే విధంగా ఇది జనమా ప్రభంజనమా అనుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన గూడేల నుంచి, లంబాడా తండాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి తరలివచ్చారు. సభను చూస్తుంటే 18,19 సంవత్సరాల జ్ఞాపకాల దొంతరలు నా కళ్ల ముందు తిరుగుతున్నాయి. 2000 సంవత్సరం. ఆనాటి సిఎం ఎడాపెడా కరెంట్ ఛార్జీలు పెంచితే దిక్కుతోచని స్థితిలో తెలంగాణ రైతాంగం చిక్కుకుంది. ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. ఏం చేయాలో తోచలేదు. ఆనాడు ఉన్న సిఎంను తెలంగాణ బిడ్డగా ఒక బహిరంగ లేఖ ద్వారా కోరాను. అసలే ఇబ్బందులతో బాధపడుతున్న తెలంగాణ రైతాంగానికి పెంచిన ఛార్జీలు ఉరితాడు లాంటిదని చెప్పాను. ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశాను. మొండిగా అలాగే వెళితే తెలంగాణ కోసం ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించాను. తెలంగాణ అంటే అప్పుడు అలుసు అయిపోయింది. ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతాం. లాఠీచార్జీలు చేస్తాం. కాల్చి పారేస్తాం అనేటట్లు పాలకులు వ్యవహరించారు. ఆనాడు రాష్ట్ర పాలకులు ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని శాసించారు. 20 సంవత్సరాలు ఉంటామని విర్రవీగిపోయారు. నా మాటల్ని ఖతారు చేయలేదు. ఉద్యమం ప్రారంభమైంది కరెంట్ ఛార్జీలు పెంపుపై నేను రాసిన బహిరంగ లేఖతోనే” అని అన్నారు.

ఎక్కని కొండ లేదు& మొక్కని బండ లేదు
“9 10 నెలలు విపరీతమైన మేధోమథనం. ఏమి చేయగలం అని తీవ్ర ఆలోచనలు. ఎక్కని కొండలేదు మొక్కని బండ లేదు. అనేక మందిని కలిశాను. లాభం లేదు గత్యంతరం లేదు. తెలంగాణ రావాల్సిందే. పోరాటం చేయాల్సిందేనని స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం. కారుచీకటి నా వెంట. పిడికెడు మంది వ్యక్తులే ఉన్నారు. భగవంతుణ్ణి స్మరించుకుని ధర్మం న్యాయం ఉంటే తెలంగాణ సమాజం విజయం సాధిస్తదని అనుకున్న. హింసలేని, ప్రశాంతమైన ఉద్యమం, రాజకీయ పంథాలోనే తెలంగాణ సాధించాలనే బాట పట్టాం. ఆ ఉద్యమంలో మీరంతా పాత్రధారులే. ఎన్నో యాత్రలు. ప్రభంజనంలాగా జనం. ఎక్కడికి వెళినా జేజేలు. యువత, మహిళలు అందరూ భాగస్వాములయ్యారు. ఒక ఉప్పెనను సృష్టించాం. మొదట్లో వాగ్ధానం చేసిన ఢిల్లీ పెద్దలు అహంకారంతో మళ్లీ నీరుగార్చే ప్రయత్నం చేశారు. గులాబీ జెండా పని అయిపోయిందని ప్రచారం చేశారు. ఇతర పార్టీ వాళ్లు అవమానం చేశారు. అవహేళన చేశారు. ఏనాడూ ధైర్యం చేయలేదు. ఈనాడు కరీంనగర్ ఎంపిగా ఉన్న వినోద్, నేను హుస్నాబాద్ ఎంఎల్‌ఎ దేసిని చిన్నమల్లయ్య ఇంట్లో మాట్లాడుకున్నాం. అర్ధరాత్రి 3 గంటలైంది. అప్పుడు వినోద్ ఏమైతది అని అంటే ఉద్యమం కన్విక్షన్, మొండి ధైర్యం మీద ఆధారపడి ఉంటదని చెప్పిన. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కొనసాగితే, ఒక దిక్కే నిలిచి బరిగీస్తే తెలంగాణ వస్తది అని చెప్పిన” అని అప్పటి జ్ఞాపకాలను వివరించారు.

పిడికెడు మందితో జలదృశ్యం నుంచి
“అందరి దీవేనలతో 2001 ఏప్రిల్ 1నాడు జలదృశ్ంయంలో పిడికెడు మందితో ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాను. ఎత్తిన జెండా దించను.. ఉద్యమ బాటను విడవను. విడిస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పాను. యువత, మహిళలందరూ కలిసి వచ్చి అధ్బుతాలు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న సమయంలో 36 పార్టీలను కలిశాను. సిపిఐ నేత బర్దన్‌ను ఒప్పించాడనికి 38 సార్లు వెళ్లాను. ఆయన నన్ను పిచ్చోడివా అన్నారు. అవును తెలంగాణ పిచ్చోడినే అన్నాను. ఒక్కో పార్టీని ఒప్పించి 36 పార్టీల మద్ధతు కూడగట్టి అనేక పోరాటాలు చేసి కఠోర శ్రమ తరువాత తెలంగాణను తెచ్చుకున్నం. వెంటనే ఎన్నికలకు వెళ్లాలి. విచిత్రమైన పరిస్థితి. ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు. పార్టీ మిత్రులంతా ఇంతా చేసి రాష్ట్రాన్ని ఇతరులకు అప్పగించవద్దు ఒంటరిగా పోవద్దు అన్నారు. ఒంటరి పోరాటం చేస్తే కష్టమన్నరు టిఆర్‌ఎస్ కార్యకర్తలు. శ్రీరామరక్షగా ఉంటదని, లాలూచి పడదని సింగిల్ మెజార్టీ ఇచ్చి తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌ను దీవించారు” అని కెసిఆర్ గుర్తుచేశారు.

బాలారిష్టాలతో కొత్త రాష్ట్ర ప్రయాణం
“రాష్ట్రం ఏర్పడే నాటికి కొత్త కుండలో ఈగ జొచ్చినట్లుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. లోటు బడ్జెట్, ఆర్థిక సమస్యలు. ఆరేడు నెలల దాకా తగినంతమంది అధికారులు లేరు. విపత్కరమైన పరిస్థితి ఉండె. మహబూబ్‌నగర్ నుంచి వలసలు. గూడు చెదిరిన పక్షుల్లా ప్రజలు. కులవృత్తులు చెదిరినాయి. పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు. కాలిపోయే మోటర్లు. ఒక్కటొక్కటి చేసుకుంటూ ముందుకు వెళ్లాం. గుండె లోతుల్లోంచి నిజాయితీగా ఆలోచించి ముందు పనులు చేసుకున్నాం. ఒకరోజు ఢిల్లీలో నా ఇంట్లో జయశంకర్ సార్, విద్యాసాగర్, నేను తెలంగాణ వస్తే ఏం చేయాలనేదానిపై చర్చ చేస్తున్నాం. విద్యాసాగర్ పడుకోండి సార్ అని అన్నడు. ఆలసట ఉంటే పడుకోమని చెప్పిన. ఆయన పడుకున్నారు. నేను చెబుతూ ఉంటే జయశంకర్ సార్ రాస్తూ పోతున్నారు. విద్యాసాగర్‌కు మెలుకువ వచ్చి మళ్ళీ 3 గంటలకు లేచి ఇంకా పండలేదా అని అడిగారు” అని అప్పటి తెలంగాణ భవిష్యత్తు గురించి లోతుగా చర్చించుకున్నాం అని తెలిపారు.

సమైక్య పాలనలో విధ్వంసం
“సమైక్య పాలనలో జీవన విధ్వంసం అంతా ఇంతా కాదు. కూలిపోయిన కులవృత్తులు. అనేకసార్లు ఏడ్చాను. సిరిసిల్ల, జగిత్యాలలలో రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని కలెక్టర్ గోడలమీద రాయిస్తుంటే చూసి కుమిలికుమిలి ఏడ్చాం. చాలా బాధపడ్డాం. లబోదిబోమని అక్కడికి వెళ్లాం. రూ. 50 వేలు ఇవ్వాలని అప్పటి సిఎంను రెండు చేతులూ జోడించి అడిగా. ఇవ్వకపోతే బిక్షాటన చేసి జోలపట్టి విరాళాలు సేకరించి బాధిత కుటుంబాలకు రూ. 50 వేలు ఇచ్చాం. టిఆర్‌ఎస్ పక్షాన రూ. 50 వేలు ఇచ్చాం. నేతన్నలారా చనిపోవద్దని కోరాం. ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తరవాత వారి కళ్లలో ఆనందం చూస్తున్నాం. బతుకమ్మ చీరలతో వారికి నెలకు రూ. 15, 20 వేల ఆదాయం వస్తోంది. ఇంకా ఇవ్వాల్సి చాలా ఉంది. ఆనాటి సమైక్య పాలకులు చీప్ లిక్కర్‌ను కమిషన్‌లకు ఆశపడి హైదరాబాద్‌లోని కల్లు బట్టీలను మూసేశారు. తెలంగాణ వచ్చిన తరువాత పునరుద్ధరిస్తామని చెప్పినం. అదే చేసినం. గీతకార్మికలకు తోడుగా నిలిచాం. అనేక కార్యక్రమాలు చేశాం. వృత్తి పనులు బాగుపడాలి. నయా ఆర్థిక వేత్తలు పారిశ్రామికాభృద్ధి గురించి చెప్తుంటరు. ఇప్పటివరకు 70 లక్షల గొర్రెలు పంపిణీ చేశాం. 30 లక్షల పిల్లలు పుట్టాయి. రూ. 1500 కోట్ల ఆదాయం వచ్చింది. ఇలా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. పాలు అమ్మి పితికే వాళ్లకు రూ. 4 లీటరుకు ఇన్సెంటివ్ ఇస్తున్నాం. 2.30 లక్షల మంది పాడి రైతులకు బర్రెలు ఇస్తున్నాం. నాలుగున్నరేళ్ళలో 465 పథకాలు వచ్చాయి” అని వివరించారు.

కోటి ఎకరాలకు నీటితో ఆకుపచ్చ తెలంగాణ కనపడాలె
కోటి ఎకరాలకు నీరిస్తామని హామీ ఇచ్చామని, పనులు పూర్తి కావొస్తున్నాయని, కొన్ని సగం పూర్తికాగా మరికొన్ని 80 శాతం మేరకు పనలైనాయని కెసిఆర్ వివరించారు. ఏడాదికి 100 టిఎంసిలు తీసుకొచ్చే మల్కాపూర్ రిజర్వాయర్ రెడీ అయిందని, రాబోయే రెండు సంవత్సరాలలో కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ చూపిస్తామన్నారు. రైతుల్ని పైకి చూస్తుంఠే పటేళ్ళలాగా కనిపిస్తారని, కానీ అప్పులేని రైతులే తెలంగాణలో లేరని, వారి కోసమే రైతుబంధు పథకం పెట్టామని సిఎం తెలిపారు. రైతులకు పెట్టుబడి ఇవ్వడంతో పాటు కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని, ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇవ్వాలని, ఆ పని జరుగుతూ ఉన్నదన్నారు. ఐదారేండ్లు ఇలాగే ఉంటే రైతుల జేబుల్లోనే పైసలు ఉంటాయన్నారు. 80 సంవత్సరాల నుంచి ఎవ్వరూ ముట్టుకోని భూరికార్డులను ముట్టుకుని కొత్త పట్టాలు ఇచ్చామని, వాటి ఆధారంగా రూ. 5500 కోట్లు రైతులకు రైతుబంధు పేరుతో పంపిణీ చేశామని తెలిపారు. ఒక్క పైసా లంచం లేకుండానే ఇచ్చామని తెలిపారు. నవంబర్ నెలలో రెండో విడత పెట్టుబడి ఇస్తామని, తెలంగాణ రైతులు ధనవంతులు అయ్యే వరకు ఆ కార్యక్రమం కొనసాగుతుందని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకు ఈ పథకం అమలైదని అన్నారు. గుంట భూమి ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబం బజారులో పడకుండా రైతులకు బీమా పథకం చేయించామని తెలిపారు. ఇప్పటికే 365 మంది రైతులకు తలా రూ. 5 లక్షల చొప్పున ఇచ్చామని వివరించారు. 10 రోజుల సమయం అనుకున్నాం కాని ఎటువంటి పైరవీలు లేకుండా 4, 5 రోజుల్లోనే వారి నామినీ ఖాతాల్లోకి వెళ్తున్నాయని తెలిపారు.

వలసలు వాపస్
పాలమూరు, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు పాతికేళ్ళుగా ములుగుతున్నాయని, అక్కడి మంత్రులు ప్రజాప్రతినిధులు తనతో జగడాలు చేసి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పట్టుదలతో పనిచేస్తే కొత్తగా 9 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చిందని సిఎం తెలిపారు. ఇంతకాలం పాలమూరు నుంచి పట్టణాలకు వెళ్ళిన వలసలు ఇప్పుడు తిరిగి మహబూబ్‌నగర్‌కు వెళ్తున్నాయన్నారు. ఆర్థిక ప్రగతిలో ఇండియాలోనే మనం నెంబర్ వన్‌గా ఉన్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 17.83 శాతంగా ఆర్థిక వృధ్ది రేటు నమోదైందని తెలిపారు. బ్రహ్మండంగా ఆదాయం పెరుగుతోందని, హిమాలయాల పర్వతాలకు పోయి చెట్ల రసం తాగిరాలేదని, గత ప్రభుత్వాల్లో సాధ్యం కానిది ఇప్పుడు సాధ్యమవుతోందన్నారు.

ఇసుకపై అబద్ధపు ఆరోపణలు
కొందరు సిగ్గు లేకుండా ఇసుక మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని, పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో పాలకుల అవినీతి వల్ల ప్రభుత్వానికి ఇసుక మీద కేవలం రూ. 9.10 కోట్ల ఆదాయం మాత్రమే వస్తే ఇప్పుడు రూ. 1980 కోట్లు వచ్చిందన్నారు. రాజకీయ అవినీతిని నిర్మూలించి కడుపు, నోరు కట్టుకుని పనిచేస్తే ఇది సాధ్యమైందన్నారు. ఆశించే రీతిలో పనిచేస్తున్నామని, రాష్ట్ర సంపదను పెంచి ప్రజలకు పంచుతామన్నారు.

మైనారిటీలకు భారీ బడ్జెట్
అందరూ బాగుంటేనే నిజమైన వికాసమని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి మైనార్టీల సంక్షేమానికి రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మైనార్టీలు చాలా దుర్భిక్షంలో, పేదరికంలో ఉన్నారని, వారి పట్ల ప్రభుత్వం తీసుకునే శ్రద్ధ మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. మైనారిటీల కోసం 29 రాష్ట్రాలలోని వారికి కేంద్రం పెట్టిన బడ్జెట్ 4 వేల కోట్లు అయితే తెలంగాణ ఒక్కటే రూ. 2 వేల కోట్లు పెట్టిందన్నారు. అభివృద్ధి కళ్ల ముందు ఉందని, మిషన్ కాకతీయ చెరువులు, కరెంట్ ఊళ్లలల్లోనే ఉన్నాయన్నారు. కృష్ణా , గోదావరి మీద ప్రాజెక్టులు కళ్ల ముందే జరుగుతున్నాయన్నారు. ఇవన్నీ కూడా ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతీ పని ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉందన్నారు. డప్పు కొట్టి చెప్పాల్సిన అవసరమే లేదన్నారు. మళ్లీ కెసిఆర్ మళ్ళీ రావాలని ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో ప్రజలు రాతలు రాసుకుంటున్నారని గుర్తుచేశారు. రోడ్లు బాగుపడ్డాయి, చేపలు వచ్చాయి, గొర్రెలు, బర్రెలు వచ్చాయి అని రాసుకుంటున్నారని పేర్కొన్నారు.

ఎటు చూసినా జనమే
భారీ బహిరంగసభకు చాలామంది రాలేకపోయారని, 30, 40 వేల వాహనాలు ఇప్పటికీ ఇక్కడకు చేరలేకపోయాయన్నారు ముఖ్యమంత్రి. ఐదారు లక్షల మంది అక్కడే ఉండిపోయారన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి కష్టపడి పనిచేశారని, 600 ఎకరాలలో సభా ప్రాంగణం చేసినా వాహనాలు రాలేకపోయాయన్నారు.

మిషన్ కాకతీయకు ఆనాడే ఆలోచన 

“భూగర్భ జాలాలు ఇంకిపోయాయి. రాష్ట్రం వస్తే తక్షణం చెరువులు బాగుచేయాలనే ఉంది. 2006 సంవత్సరంలో జయశంకర్ తెలంగాణ ఆత్మ లాంటి వ్యక్తి ఆనాటి మథనంలో పుట్టిందే మిషన్ కాకతీయ. కొత్త రాష్ట్రం వస్తే కరెంట్ బాధలు పోవాలి. అంతకు ముందు ఉన్న సిఎం కట్టె పట్టుకుని రాష్ట్రం ఏర్పడితే అంధకారమైతదని శాపాలు పెట్టారు. అలాంటి విపత్కరమైరన పరిస్థితిలో చిమ్మ చీకటిలో నుంచి విద్యుత్ కార్మికుల సహకారంలో వెలుగు జిలుగులతో దేదీప్యమానంగా వెలిగే తెలంగాణ ఆవిష్కృతమైంది. దేశంలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రమొక్కటే. రాబోయే రోజుల్లో ఇంకా మిగులు విద్యుత్ రాష్ట్రం మారుస్తాం. రెప్ప పాటు కరెంట్ పోద”ని హామీ ఇస్తున్నాం అని సిఎం వ్యాఖ్యానించారు. 

కల్యాణలక్ష్మికి బీజం ములుగు సంఘటన నుంచి.. 

“ఒకరోజు ఉద్యమంలో వరంగల్ ములుగు ప్రాంతానికి, అజ్మీరా చందులాల్ నేను వెళ్లి వస్తుంటే లంబాడ తండాలో ఒక గుడిసె కాలిపోయింది. ఒకాయన బాగా ఏడుస్తుండు. దగ్గరికెళ్ళి అడిగితే రూ. 50 వేలు కాలిపోయాయయని చెప్పాడు. బిడ్డ పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బులు గుడిసెలో కాలిపోయాయని, ఇక తాను కూడా కాలిపోవాల్సిందేనని ఏడ్చాడు. అప్పుడు కౌగిలించుకుని రూ. లక్ష ఇచ్చి పెళ్లికి కూడా వెళ్లాను. సిద్దిపేటకు ఎంఎల్‌ఎగా ఉన్నపుడు దళిత, పేద అమ్మాయిలకు చందాలు వసూలు చేసి పెళ్లిళ్ళు చేశాం. ఆడపిల్ల అంటే కుంపటి అనుకునే సమయంలో ‘కళ్యాణలక్ష్మి’ పథకాన్ని తీసుక్చొచ్చాం. ఒక్క రూపాయి లంచం లేకుండా ఆడపిల్ల పెళ్ళికి ప్రభుత్వం నుంచి మంజూరవుతున్నాయి” అని కొత్త పథకానికి ఆలోచన ఎక్కడి నుంచి మొదలైందో వివరించారు. 76 అంశాలను గుర్తించి అమలు చేస్తున్నాం.

కమిట్‌మెంట్‌తో తక్షణ ఉపశమన చర్యలే కాకుండా అనేకమైన వృత్తి పనివారికి సహాయం చేసి చాలా పనులు చేశామని సిఎంపేర్కొన్నారు. ప్రతీ పని టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందని సొంత అనుభవంలో ఉందన్నారు. నాయీ బ్రహ్మణ సోదరులు 40, 50 ఏండ్లు ఇస్త్రీ పెట్టెలకు కమర్షియల్ బిల్లు వసూలు చేస్తున్నారని అడిగితే ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తరువాత కమర్షియల్ నుంచి తీసేసి అగ్గువకు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. కెజి టూ పిజిలో భాగంగా అన్ని వర్గాలకు గురుకులాలు ఏర్పాటు చేశామని, ఉత్తమైన మెరుగైన విద్యను కల్పించామని తెలిపారు. ఒక్క రెసిడెన్షియల్ పాఠశాల మాత్రమే కాకుండా కెజి టూ పిజి పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గిరిజిన, లంబాడ, గోండు తండాలు తమకు ప్రత్యేకమైన సంప్రదాయం ఉందని అగిడితే ఎవరూ గుర్తించలేదని, ఇప్పుడు తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలు చేశామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల తరువాత వాళ్లే సర్పంచ్‌లు అవుతారన్నారు.

Comments

comments