Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పిఆర్‌సిపై సిఎం చర్చలు

kcr

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిపై ముఖ్యమంత్రి అధికారికం గా ప్రకటన చేయనున్నందున నూతన పిఆర్‌సి చైర్మన్‌తో ప్రగతిభవన్‌లో గురువారం చర్చలు జరిగాయి. పిఆర్‌సి తన తుది నివేదికను ఆగస్టు 15వ తేదీకి సమర్పించనున్నందున తాత్కాలిక భృతిగా ఏ మేరకు ఇవ్వడానికి ఆస్కారం ఉంది, కొత్త పిఆర్‌సి పని ఏ మేరకు సాగుతూ ఉంది తదితరాలపై చైర్మన్ బిస్వాల్‌తో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినందున ఈసారి తప్పకుండా దానికంటే ఎక్కువే ఉంటుందని, కనీసంగా 47 శాతం ఉండవచ్చని సమాచారం. అయితే 25 శాతం డిఎ (కరువుభత్యం) ఉన్నందువల్ల వేతన పెంపు 22 శాతం ఉండవచ్చని అంచనా. మొత్తం కలిపి కనీసంగా 47 శాతం ఉండవచ్చన్న అంచనాతో తాత్కాలిక భృతిని 25 లేదా 30 శాతం ఇవ్వడం పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచా రం. ఇప్పటికింకా పూర్తి స్థాయిలో పిఆర్‌సి కొలువుతీరనందున, పనిని ప్రారంభించకపోవడంతో అంచనా మేరకు కూడా తాత్కాలిక భృతి గురించిగానీ, పూర్తిస్థాయిలో ఇచ్చే తుది ఫిట్‌మెంట్ గురించిగానీ వ్యాఖ్యానించడం సహేతుకం కాదని బిస్వాల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సైతం పిఆర్‌సి అభిప్రాయంతో సంబంధం లేకుండానే తాత్కాలిక భృతి గురించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆర్థికశాఖ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు జూన్ 2న తాత్కాలిక భృతిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. జూన్ 2వ తేదీ తర్వాత పిఆర్‌సి సభ్యుడైన ఉమామహేశ్వరరావు సైతం బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో పని ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి సిఎం తాత్కాలిక భృతిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Comments

comments