Home రాష్ట్ర వార్తలు ప్రధానికి సిఎం సమర్పించిన ఇష్టపది

ప్రధానికి సిఎం సమర్పించిన ఇష్టపది

తెలంగాణ ప్రాణప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు  కేంద్రం నుంచి రూ.20వేల కోట్లు  సాయం సహా ప్రధానికి  పది కీలకమైన డిమాండ్లతో విజ్ఞప్తులు అందజేసిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు 

  • కాళేశ్వరానికి రూ.20వేల కోట్లు సాయం చేయండి
  • జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపండి 
  • ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయండి
  • సచివాలయానికి బైసన్ పోలో గ్రౌండ్స్‌లోని స్థలం ఇవ్వండి
  • రైల్వే ప్రాజెక్టుల వేగం పెంచండి
  • ఐటిఐఆర్‌కు నిధులివ్వండి
  • కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటిని నెలకొల్పండి
  • జిల్లాకొక నవోదయ ఏర్పాటు చేయండి
  • వెనకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేయండి 
  • ఐఐఎంను కేటాయించండి

CM-With-Modi

హైదరాబాద్/న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రానికి ప్రాణప్రదాయనిగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నామని, ఇప్పటికే వివిధ మంత్రిత్వశాఖల నుంచి త్వరితగతిన అనుమతులు మంజూరయ్యాయని, వివిధ ఆర్థిక సంస్థల నుంచి రూ. 22 వేల కోట్ల రుణాన్ని కూడా పొందామని, 20 జిల్లాలకు సాగు, మంచినీరు అందించే ఈ ప్రాజెక్టుకు కేంద్రం తరఫున రూ.20వేల కోట్ల మేరకు సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విజ్ఞాపనపత్రాలను సమర్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, కొత్త సచివాలయ నిర్మాణానికి అవసరమైన బైసన్‌పోలో గ్రౌండ్స్ స్థలాన్ని కేటాయించడం, కరీంనగర్‌లో కొత్తగా ట్రిపుల్ ఐటి, రాష్ట్రానికి ఐఐఎం మంజూరు, ఐటిఐఆర్ ప్రాజెక్టుకు నిధుల మం జూరు, ప్రతీ జిల్లా కేంద్రంలో ఒక జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు, ఇటీవల రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, ప్రస్తుతం అమలవుతున్న రైల్వే ప్రాజెక్టు పనుల్లో వేగాన్ని పెంచడం, వెనకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి ఇచ్చే రూ. 450 కోట్ల విడుదల తదితర అంశాలకు సంబంధించి విడివిడిగా వినతిపత్రాలను అందజేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సిఎం కెసిఆర్ సుమారు గంటపాటు సమావేశమై పది అంశాలను లోతుగా చర్చించారు. అన్ని విజ్ఞప్తులకూ ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనింది. సిఎంతో పాటు ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కాళేశ్వరానికి ఆర్థిక సాయం : తెలంగాణ రాష్ట్రానికి ప్రాణప్రదాయనిగా ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.80 వేల కోట్లతో నిర్మిస్తూ ఉన్నదని, వివిధ ఆర్థిక సంస్థల నుంచి రూ. 22 వేల కోట్ల మేర రుణం పొందిందని, రాష్ట్ర ప్రభు త్వం రూ. 25 వేల కోట్లను కేటాయించిందని, కేంద్రం కూడా రూ. 20 వేల కోట్లను సాయంగా ఇవ్వాలని ప్రధానికి సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు వలన 20 జిల్లాల్లో సుమారు 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందడంతో పాటు అనేక గ్రామాలకు త్రాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించవచ్చని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు కేటాయించిన రూ. 25 వేల కోట్లకు అదనంగా ఆర్థిక సంస్థల నుంచి రూ. 22 వేల కోట్లను రుణంగా తీసుకుందని, ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా రూ. 20 వేల కోట్లను సాయంగా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
జోనల్ వ్యవస్థకు ఆమోదం : సమైక్య రాష్ట్రంలో ఆరు జోన్ల వ్యవస్థ ఉండేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు జోన్లు మాత్రమే మిగిలాయని, మిగిలిన నాలుగూ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండిపోయాయని, పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో రెండు జోన్లను ఇటీవల రెండు మల్టీజోన్లుగా, ఏడు జోన్లుగా రూపొందించామని, దీనికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని ప్రధానికి కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగాల నియామకాలకు సంబంధించి పాత జోనల్ విధానమే కొనసాగుతూ ఉందని, 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా వచ్చిన ఆర్టికల్ 371 డి ఇంకా అమలవుతూ ఉన్నదని గుర్తుచేశారు. వివిధ రకాల అవసరాల రీత్యా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత వాటికి అనుగుణంగా ఇప్పుడు జోన్లను కూడా పునర్ వ్యవస్థీకరించినట్లు వివరించారు.
నాలుగేళ్ళయినా హైకోర్టు ఏర్పడలేదు : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరు దశాబ్దాల పాటు కొట్లాడి ఎట్టకేలకు డిమాండ్‌ను సాధించుకున్నామని, కానీ ప్రత్యేక హైకోర్టు లేకపోవడంతో రాష్ట్ర సాధన పరిపూర్ణం కాలేదని వివరించిన సిఎం కెసిఆర్ వెంటనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటయ్యేలా జోక్యం చేసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు పలు రాజ్యాంగబద్ధ సంస్థల విభజన ప్రక్రియ పూర్తయిందని, హైకోర్టు విభజన మాత్రం ఇంకా అసంపూర్ణంగానే ఉండిపోయిందని, రెండు రాష్ట్రాలకూ ఉమ్మడిగా కొనసాగుతోందని వివ రించారు. తెలంగాణ ప్రజలు, న్యాయవాదులు తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టు ఉండాలని బలంగా కోరుకుంటున్నారని, ప్రస్తుతం హైకోర్టులో ఉన్న 29 మంది న్యాయమూర్తుల్లో కేవలం ఆరుగురు మాత్రమే తెలంగాణకు చెందినవారని వివరించారు. ఉమ్మడి హైకోర్టు కాబట్టి న్యాయమూర్తులు 60:40 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినవారు ఉండాల్సి ఉన్నప్పటికీ అమలుకావడంలేదని పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సైతం హైకోర్టు విభజనను పూర్తిచేయనున్నట్లు పార్లమెంటులోనే హామీ ఇచ్చారని గుర్తుచేసిన కెసిఆర్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడేలా చొరవ తీసుకోవాలని కోరారు.
కొత్త సచివాలయానికి బైసన్ పోలో గ్రౌండ్స్ స్థలం : హైదరాబాద్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించుకోడానికి రక్షణ శాఖకు చెందిన బైసన్ పోలో గ్రౌండ్స్ స్థలాన్ని ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ఆ శాఖను కోరామని ప్రధానికి వివరించిన సిఎం కెసిఆర్ వీలైనంత త్వరగా రాష్ట్రానికి బదలాయించాలని కోరారు. ఒక జాతీయ రహదారి (నెం. 44), ఒక రాష్ట్ర రహదారి (నెం.1) విస్తరణకు అనుగుణంగా రక్షణ శాఖ ఆధీనంలోని స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి ఆ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందని, ఆ భూములను కూడా వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిం చినట్లయితే ట్రాఫిక్ సమస్యలను అధిగమించే విధంగా రహదారులను విస్తరించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ మూడు రకాల రక్షణ శాఖ స్థలాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు.
రైల్వే ప్రాజెక్టుల్లో వేగం పెరగాలి : రాష్ట్రంలో పనిచేస్తున్న రైల్వే లైన్లు జాతీయ సగటుకంటే చాలా తక్కువగా ఉన్నాయని, కొత్త రైల్వే లైన్లను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానికి వివరించిన కెసిఆర్ మనోహరాబాద్, కొత్తపల్లి మధ్య రైల్వే లైన్ నిర్మాణాన్ని అధిక ప్రాధాన్యతా అంశంగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టి,ధని, కానీ పనులు ఆ దిశగా లేవని పేర్కొన్నారు. ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అక్కన్నపేట, మెదక్ రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తయిందని, దీని నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని కోరారు. భద్రాచలం, సత్తుపల్లి మధ్య రైల్వే లైన్‌ను నిర్మించాలని, కాజీపేట, విజయవాడల మధ్య మూడవ విద్యుద్దీకరణ లైన్‌ను నిర్మించాలని ప్రధానిని కోరారు. రాఘవాపురం, మందమర్రిల మధ్య మూడవ లైన్ నిర్మాణం, ఆర్మూర్, ఆదిలాబాద్‌ల మధ్య బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, సికిం ద్రాబాద్, జహీరాబాద్‌ల మధ్య రైల్వే లైన్లను డబుల్ లేన్‌గా మార్చడానికి, హుజూరాబాద్ మీదుగా కాజీపేట, కరీంనగర్‌ల మధ్య రైల్వేలైన్‌ను నిర్మించడానికి అవసరమైన సర్వేను చేపట్టాలని కోరారు.
ఐటీఐఆర్‌కు నిధుల మంజూరు : సమైక్య రాష్ట్ర ప్రభుత్వమే 2013లో హైదరాబాద్‌లో ఐటిఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజి యన్)ను మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికను కూడా సమర్పించిందని ప్రధానికి వివరించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లుగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించినట్లు ఇటీవల పత్రికల్లో చదివినట్లు తెలిపారు. ఐదేళ్ళ క్రితం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టును ఉపసం హరించుకోవడం వలన కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బ తింటుందని, అందువల్ల ప్రాజెక్టుకు నిధులిచ్చి చేయూత ఇవ్వాలని కోరారు.
కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటి : కరీంనగర్ జిల్లాకు ఒక ట్రిపుల్ ఐటిని స్థాపించాలని ప్రధానికి కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. కరీనంగర్ పట్టణంలో ట్రిపుల్ ఐటి ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిం చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో సాంకేతిక విద్యావకాశాలను పెంపొం దించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని వివరించారు. ఇప్పటికే హైదరా బాద్‌లో పలు సాంకేతిక విద్యా సంస్థలు ఉన్నాయని, వరంగల్ నగరంలో ‘నిట్’ ఉందని, కరీంనగర్‌లో సైతం ట్రిపుల్ ఐటిని స్థాపించడం వలన జిల్లా కేంద్రాలకు కూడా సాంకేతిక విద్యా సంస్థలను తీసుకెళ్ళి విస్తరించి నట్లవు తుందని ప్రధానికి వివరించారు.
జిల్లాకొక నవోదయ విద్యాలయ : ప్రతీ జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయమే తీసుకుందని గుర్తుచేసిన సిఎం కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేసి 21 కొత్త జిల్లాలను ఏర్పాటుచేసినంధున ప్రతీ జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. ఈ విద్యాలయాలకు అవసరమైన స్థలాన్ని, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రస్తుతం రంగారెడ్డి, కొమురంభీమ్ ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలు ఉన్నాయని, మిగిలిన ఆదిలాబాద్, నిర్మల్, మం చిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, జనగామ, మహ బూబాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహ బూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో లేవని, అందువల్ల ఈ జిల్లాల్లో కూడా కొత్తగా నెలకొల్పాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లేదని, మంజూరు చేయాలని కోరారు.
వెనకబడిన జిల్లాలకు నిధులు : ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రంలోని తొమ్మిది వెనకబడిన జిల్లాలకు రూ. 50 కోట్ల చొప్పున ప్రతీ ఏటా రూ. 450 కోట్లు రాష్ట్రానికి ఆర్థిక సాయం రూపంలో రావాల్సి ఉన్నదని, గత ఆర్థిక సంవత్సరానికి విడుదల కావాల్సిన నిధులు ఇంకా రాలేదని, వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధానితో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి కూడా పాల్గొన్నారు.