Home ఎడిటోరియల్ కశ్మీర్‌లో అనూహ్య మలుపు!

కశ్మీర్‌లో అనూహ్య మలుపు!

Coalition govt formed by People Democratic Party with BJP

సైద్ధాంతిక వైరుధ్యం ఉన్న పార్టీలు స్థిరమైన ప్రభుత్వాన్నివ్వలేవు. జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెప్పిన మాటలివి. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ ఆయన ఈ మాటలు చెప్పారు. గత ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ ఓటర్ల తీర్పు ఏ పార్టీకి అధికారం ఇవ్వలేదు. సంకీర్ణ ప్రభుత్వం పూర్తి కాలం నిలబడ లేకపోయింది.

దాదాపు ఐదునెలలుగా జమ్ము కశ్మీరులో అయోమయం కొనసాగుతూనే ఉంది. జూన్ నుంచి రాష్ట్రం గవర్నర్ పాలనలో ఉంది. బిజెపితో కలిసి పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం జూన్‌లో కూలిపోయింది. ప్రభుత్వం నుంచి బిజెపి తప్పుకోవడంతో ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. అప్పటి నుంచి గవర్నర్ పాలన నడుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనకు వచ్చాయి. అసెంబ్లీలో ఈ పార్టీలకు 56 మంది సభ్యుల బలం ఉంది. మరోవైపు బిజెపి, పీపుల్స్ కాన్ఫరెన్స్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే మాట కూడా వినిపించింది. తమకు మెజారిటీ ఉందని ఈ పార్టీలు చెప్పాయి. కాని, గవర్నర్ ఈ అవకాశాలన్నింటిని పక్కన పెట్టి అసలు అసెంబ్లీనే రద్దు చేశారు.

జమ్ము కశ్మీరులో ఏ ప్రభుత్వం ఉండాలన్న నిర్ణయం ఢిల్లీ తీసుకుంటుందని మరోసారి ఈ పరిణామాలు రుజువు చేసాయంటున్నారు పరిశీలకులు. బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించి విఫలమైనప్పుడు రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగింది. అంటే కేంద్ర ప్రభుత్వ పాలన, మరోవిధంగా చెప్పాలంటే బిజెపి పాలనే. ఇప్పుడు మాత్రం గవర్నర్ అసెంబ్లీనే రద్దు చేశారు. తనది నిష్పక్షపాతంగా తీసుకున్న నిర్ణయమని గవర్నర్ చెప్పినప్పటికీ ఆయన అసెంబ్లీని రద్దు చేస్తూ చెప్పిన మాటలు బిజెపి నేతలు ట్విట్టరులో మాట్లాడిన మాటలు ఒకేలా ఉన్నాయి. పార్టీ మార్పిళ్ళు జరగవచ్చన్న భయాలు, హార్స్ ట్రేడింగ్, బేరసారాలు, స్థిరమైన ప్రభుత్వం అసాధ్యం, తాజాగా ఎన్నికలు జరగాలి… ఇవన్నీ బిజెపి నేతల ట్విట్టర్ మాటలే.

కాని జమ్ము కశ్మీరులో ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు కాస్త ఆశ్చర్యం కలిగించేవే. విభిన్న ధృవాలవంటి పార్టీలు ఒక్కటయ్యాయి. ఇది అవకాశవాద రాజకీయంగా భావించినా ఈ పరిణామం అనూహ్యమైనది. 2014లోను సైద్ధాంతికంగా విభిన్నమైన పార్టీలే కలిసి సంకీర్ణం ఏర్పాటు చేశాయి. సాఫ్ట్ సెపరేటిస్ట్ అంటే మిత వేర్పాటువాద పార్టీ అయిన పిడిపి, హిందూత్వ రాజకీయాలు నడిపే బిజెపి కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. నాలుగేళ్ళలోనే రాజకీయ ఒత్తిళ్ళకు ప్రభుత్వం కూలిపోయింది. మరోవైపు కశ్మీరులో బిజెపి పాదం మోపడానికి చేస్తున్న ప్రయత్నాలతో జమ్ము కశ్మీరులో ఇప్పటి వరకు నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి మధ్య మాత్రమే నడిచే ఎన్నికల రాజకీయాలు కొత్త దశలోకి ప్రవేశించాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి కశ్మీరులో ఆగర్భశత్రువుల వంటి పార్టీలు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకోడానికి సిద్ధపడుతున్నాయి.

2014 ఎన్నికల తర్వాత పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బిజెపి కాని, నేషనల్ కాన్ఫరెన్స్ కాని సహాయం చేయవలసిన పరిస్థితి. కాని మహబూబా ముఫ్తీ నేషనల్ కాన్ఫరెన్స్‌కు బదులు బిజెపిని ఎన్నుకున్నారు. ఈ రెండు పార్టీల మధ్య వైరం ఎంత తీవ్రమైనదో చెప్పడానికి ఆ ఒక్క ఉదాహరణ చాలు. 1999లో ఫీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్‌తో విరోధమే కొనసాగింది. కశ్మీరులో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రాబల్యాన్ని పిడిపి చాలా వరకు దెబ్బకొట్టింది. అబ్దుల్లా కుటుంబానికి పోటీగా ముఫ్తీ కుటుంబం కశ్మీరు రాజకీయాల్లో ఎదిగింది. 2002 అసెంబ్లీ ఎన్నికల తర్వాతి నుంచి జమ్ము కశ్మీరులో సంకీర్ణ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా కాంగ్రెస్ ఈ సంకీర్ణాల్లో ఉండేది. కాంగ్రెస్ ఎక్కువగా జమ్ము నుంచి స్థానాలు గెలుచుకునేది. కాంగ్రెస్‌తో కలిసిన నేషనల్ కాన్ఫరెన్స్ లేదా పిడిపిలు ప్రభుత్వం ఏర్పాటు చేసేవి.

నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి ఈ రెండు పార్టీలు కూడా కేంద్రంలోను ప్రభుత్వంలో పాలుపంచుకున్నాయి. నేషనల్ డెమొక్రటిక్ అలయెన్సులో నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఉంది. కాని 2003లో మద్దతు ఉపసంహరించుకుంది. 2002లో కశ్మీరులో బిజెపి వల్లనే రాజకీయ నష్టం భరించవలసి వచ్చిందని ఆరోపించింది. పిడిపి కూడా కేంద్రంలో యుపిఎ ప్రభుత్వానికి మద్దతిచ్చింది. కాని 2008లో కాంగ్రెస్ జమ్ము కశ్మీరులో అబ్దుల్లాకు మద్దతిచ్చిన తర్వాత యుపిఎ నుంచి పిడిపి తప్పుకుంది. కశ్మీరు లోయలో ప్రతి పార్టీకి దాని కంచుకోట ఉంది. కశ్మీరులోని ఉత్తర ప్రాంతాలు, మధ్య కశ్మీరులో నేషనల్ కాన్ఫరెన్స్ చాలా బలమైన పార్టీ. పిడిపి దక్షిణ కశ్మీరులో బలమైన పార్టీ. ఈ రెండు పార్టీల మధ్య విరోధం ఎంత బలమైనదంటే, ఈ పార్టీల అగ్రనాయకత్వం పొత్తు కోసం ప్రయత్నిస్తుంటే స్థానిక నేతలు ఈ పొత్తును తీవ్రంగా వ్యతిరేకించారు.

దశాబ్దన్నర కాలంగా సాగుతున్న ఈ పార్టీ రాజకీయాలు 2014 ఎన్నికల తర్వాత మారిపోయాయి. బిజెపి మద్దతుతో పిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బిజెపిని జమ్ము దాటి లోయలోకి రానీయమని పిడిపి హామీ ఇచ్చింది. కాని 2016లో కశ్మీరులో తలెత్తిన నిరసనలు, ఆందోళనలు దాదాపు వందమందిని పొట్టనపెట్టుకున్నాయి. పిడిపి బలంగా ఉన్న దక్షిణ కశ్మీరులో ఉగ్రవాదులు బలపడడం ప్రారంభమయ్యింది. ఎన్నికల్లో పోలింగ్ శాతం రికార్డు స్థాయికి పడిపోయింది. బుద్గాం వంటి ప్రశాంతమైన జిల్లాల్లోను పోలింగ్ శాతం తగ్గిపోయింది.

నిజానికి కశ్మీరులో ఈ రెండు పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నాయా? నేషనల్ కాన్ఫరెన్స్ కశ్మీరుకు స్వయంప్రతిపత్తి కోసం పోరాడుతున్న పార్టీగా గుర్తింపు పొందింది. పిడిపి స్వయంపాలన కోసం పోరాడే పార్టీగా ఉనికిలోకి వచ్చింది. జాతీయ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాలు నడిపిన ఈ రెండు పార్టీలు చాలా జాగ్రత్తగా సెంట్రిస్ట్ ధోరణిని అవలంబిస్తున్నాయి. రెండు పార్టీలు కశ్మీరు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని చెబుతున్నాయి. పాకిస్తాన్ తో చర్చలు జరగాలని రెండు పార్టీలు కోరుతున్నాయి. పాకిస్తాన్ తో చర్చల ద్వారా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించాలని రెండు పార్టీలు కోరుతున్నప్పటికీ ఢిల్లీని ఒప్పించలేకపోయాయి. నిజానికి పిడిపి పార్టీని ఢిల్లీ సృష్టించిందని చాలా మంది భావిస్తారు. కశ్మీరులో ఓట్లను చీల్చడానికి తయారు చేసిన పార్టీగా కూడా చాలా మంది ఆరోపిస్తారు. కశ్మీరులో ఒకే ప్రాంతీయ పార్టీ ఉండడం, జాతీయపార్టీని సవాలు చేసే స్థాయికి ఎదగడాన్ని అడ్డుకునే దురుద్దేశంతో పిడిపిని తీసుకొచ్చారన్న ఆరోపణలున్నాయి. కశ్మీరు ఓటర్లు ఈ రెండు పార్టీల మధ్య తేడా చూపడం లేదు. దొందు దొందే అన్న అభిప్రాయం బలంగా ఉంది.

కాబట్టి ఈ రెండు పార్టీలు సైద్ధాంతికంగా విభిన్నమైనవి కావు. ఒకే గూటి పక్షుల వంటివి. గవర్నర్ చెప్పినట్లు ఈ రెండు పార్టీల మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలేవీ లేవు. ప్రస్తుతమున్న పరిస్థితిని చక్కదిద్దడానికి రెండు పార్టీలు కలవడం అవసరమని, అయితే తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పొత్తు ఉండదని అబ్దుల్లా అన్నారు. కాని ఈ తాత్కాలిక పొత్తు కూడా కశ్మీరు రాజకీయాల్లో ఊహించలేని పరిణామం. ఈ పరిణామం భవిష్యత్తులో కశ్మీర్ రాజకీయాలను మరిన్ని మార్పులకు కారణమవుతుందా? వేచి చూడవలసిందే.

                                                                                                                                              – ఇస్పితా చక్రవర్తి (స్క్రోల్ )

Coalition govt formed by People Democratic Party with BJP

Telangana Latest News