Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పర్వతాల్లో కుప్పకూలిన విమానం

ap

 66మంది దుర్మరణం
 ఇరాన్‌లో దుర్ఘటన

టెహ్రాన్ : ఇరాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారంనాడు జాగ్రోస్ పర్వతాల్లో విమానం కుప్పకూలిన ఘటనలో 66మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారు. మిగతా వారంతా ప్రయాణికులే. ఏస్‌మాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం నుంచి ఇస్‌ఫహాన్ ప్రావిన్స్‌లోని యాసుజ్‌కు ఉదయం 8గంటలకు బయలుదేరింది. యాసుజ్‌కు 23కిలో మీటర్ల దూరంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. హుటాహుటిన గాలింపు చర్యలు చేపట్టి, జాగ్రోస్ పర్వతాల్లో విమానం కూలిపోయినట్లు గుర్తించారు. ప్రమాద స్థలికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, వాతావరణం అనుకూలించడం లేదని ఇరాన్ అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. దుర్ఘటనస్థలికి 12బృందాలను ఇప్పటికే పంపించామని, వారు అక్కడికి చేరుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారని వివరించారు. దట్టమైన అడవులతో పాటు పర్వత ప్రాంతమైనందున అక్కడికి అంబులెన్స్‌లు చేరుకునే అవకాశం లేదు. విమానానికి రెండు ఇంజిన్లు ఉన్నాయని, ప్రమాదానికి కారణాలను తెలుసుకోవడానికి శాఖపరమైన విచారణకు ఆదేశించినట్లు ఏస్‌మాన్ విమానయాన సంస్థ వెల్లడించింది. కొంత కాలంగా ఇరాన్ విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతూ వస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ అంతర్జాతీయంగా ఆంక్షలను ఎదుర్కొంటోంది. దీంతో విమానాలకు సంబంధించిన స్పేర్ పార్ట్‌లను దిగుమతి చేసుకోవడం ఇరాన్‌కు కత్తిమీద సాములా మారింది. చేసేదేం లేక ఇక్కడి విమానయాన సంస్థలు దీర్ఘకాలంగా కాలం చెల్లిన విమానాలనే నడుపుతున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలకు ఇవి కూడా కారణాలని ఆ సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే అణు ఒప్పందంలో భాగంగా ఇరాన్ సంస్థలు అమెరికా నుంచి విమాన విడిభాగాలను కొనుగోలు చేసుకునే సౌకర్యాన్ని కల్పించినన్పటికీ అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నది.

Comments

comments