Home వరంగల్ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుదాం

ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుదాం

 Collector Amrapali says make a plastic free city

మన తెలంగాణ/వరంగల్ అర్భన్ ప్రతినిధి: స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ను నిరోధించి తడి చెత్తను, పొడి చెత్తను విభజించి ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దటానికి ప్రతి పౌరుడు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కాటా అమ్రపాలి అన్నారు.  మంగళవారం పబ్లిక్ గార్డెన్ నేరెళ్ళ వేణుమాధవ్ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల నేటి తరానికే కాకుండా రాబోయే భావితరాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని అందులకు గాను ప్రతి పౌరుడు స్వచ్చందంగా ప్లాస్టిక్‌ను నిషేదించాలని ముఖ్యంగా వివాహ వేడుకల్లో, విందు వినోదాల్లో, మార్కెట్‌లలో ప్లాస్టిక్‌ను నిరోధించే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు  చేసుకోవాలని ఆమె సూచించారు. నగరంలో ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త వేరు వేరు చెత్త బుట్టలను అందించడం జరిగిందని ప్రతి మహిళ అందులో భాద్యతాయుతంగా తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి సహకరించడం ద్వారా జిల్లాలో ఏర్పాటు చేసిన రీసైకిలింగ్‌కు దోహదపడాలని ఆమె కోరారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన ప్రైవేటు వాహనదారులకు నెలసరి రూ.60 చెల్లించడం ద్వారా సిబ్బందికి జీవన ఉపాధితో పాటు పర్యావరణ పరిరక్షణకు మరింద దోహద పడవచ్చునని ఆమె తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, ప్రభుత్వ సమావేశాలలో కూడా ప్లాస్టిక్‌ను నిరోధించే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. తప్పనిసరిగా ప్లాస్టిక్ వినియోగాన్ని చేయవలసి వస్తే అట్టి వాటిని తప్పనిసరిగా నిర్ధేశించిన డస్ట్‌బిన్‌లలో వేయాలని, హోటల్లో, ఫంక్షన్ హాల్, మార్కెటింగ్ మున్నగు ప్రదేశాల్లో విరివిగా ప్లాస్టిక్‌ను వినియోగించడంతో పాటు వ్యర్ధ పదార్థాలను రోడ్లపై వేయడం జరుగుతుందని స్వచ్చందంగా వారు నిర్ధేశిత ప్రదేశాల్లో వేయాలని ఆమె సూచించారు.

నగరంలో 23 డ్రై సెంటర్లను ఏర్పాటు చేసి తడి చెత్త, పొడి చెత్తను రీ సైక్లింగ్ చేయడం జరుగుతుందని అదేవిధంగా మానవ వ్యర్థ పదార్థాలను కూడా రీ సైక్లింగ్ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. స్థానిక వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ను వినియోగించడం ప్రజలు స్వచ్చందంగా నిషేదించడానికి దోహదపడాలని ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజలు కూడా సహకరించడం ద్వారా లక్షాన్ని చేరుకోవచ్చని ఆయన అన్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాల నుండి పర్యావరణాన్ని కాపాడుకొనుటకు ప్రభుత్వం విధించే జరిమానాలు దోహద పడవని స్వచ్చందంగా ప్రజలు సహకారంతో ప్లాస్టిక్ రహిత నగరంగా దోహదపడాలని ఆయన అన్నారు. నేటి నుండి పదిరోజలు పాటు జిల్లాలో ప్లాస్టిక్ వినియోగం పై ఏర్పడే దుష్ఫలితాల గురించి ప్రజలకు అవగాహణ అయ్యే విధంగా ప్రచారం చేయడం జరుగుతుందని ప్రతి వినియోగదారుడు బాధ్యతాయుతంగా గోని సంచులను తీసుకొని మార్కెట్‌కు వెళ్ళాలని ఆయన సూచించారు. ప్లాస్టిక్ వినియోగం ద్వారా నేటి తరానికి కాకుండా రాబోయే 20 సంవత్సరాల్లో కూడా దాని ప్రభావం పడుతుందని ముందు తరానికి కాలుష్య రహిత వాతారణాన్ని అందించడానికి విధిగా ప్రతి ఇంట మొక్క నాటాలని అదేవిధంగా ప్లాస్టిక్‌ను నిరోధించడం జరిగిందని ఆయన తెలిపారు. నగర కమీషనర్ గౌతం మాట్లాడుతూ మానవ జీవ కోటి ఆధారమైన వాతావరణాన్ని కలుషితం లేకుండా ఉండేందుకు తప్పనిసరిగా ప్లాస్టిక్ వస్లువులను నిరోధించడంతో పాటు కాలుష్యాన్ని నివారించే దిశలో వారానికి ఒక రోజు పొగలేని వాహనాన్ని వినియోగించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ జరిమానా విధించడం వల్ల తాత్కాలిక ప్లాస్టిక్‌ను నిరోధించవచ్చునని ప్రజలు స్వచ్చందంగా ప్లాస్టిక్‌ను నిరోధించడం ద్వారా కాలుష్యాన్ని అరికట్ట వచ్చునని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి నర్సింగరావు, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, మాధవి తదితరులు పాల్గొన్నారు.