Home కుమ్రం భీం ఆసిఫాబాద్ కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన మల్లేష్‌కు ఘనస్వాగతం

కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన మల్లేష్‌కు ఘనస్వాగతం

జిల్లాకే గర్వకారణమంటున్న ప్రజలు, ప్రముఖులు
ఎవరెస్ట్ అధిరోహించడమే లక్షమంటున్న మల్లేష్

                 kilemanzaro

ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్ : ఆఫ్రికాలో ఎత్తైన పర్వతాలలో ఒకటైన కిలిమంజారో శిఖరంను అధిరోహించిన మల్లేష్ కుమ్రం భీం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రానికి చేరుకున్న మల్లేష్‌కు పలుపాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారస్థులు ఘనస్వాగతం పలికారు. జిల్లాకు చేరుకున్న మల్లేష్ మొదటగా కుమ్రం భీం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలో పలు వీధుల గుండా పలు పాఠశాలల విద్యార్థులు నృత్యాలు, బాణసంచాలు పేలుస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన సన్మానసభకు కలెక్టర్ చంపాలాల్, ఎమ్మెల్యే కోవలక్ష్మీలు ముఖ్యఅతిథులుగా హాజరై మల్లేష్‌ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కలెక్టర్ చంపాలాల్ మాట్లాడుతూ గిరిజన గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మల్లేష్ ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతాలలో ఒకటైన కిలిమంజారో పర్వత శిఖరంను అధిరోహించడం మన రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణమన్నారు.

చరిత్రలోనే మన ఆదివాసి జిల్లా పేరును  ప్రత్యేకంగా లిఖించబడుతుందన్నారు. ఒకవ్యక్తి తలుచుకుని పనిచేస్తే ఆ పని సాధించే వరకు పనిచేయడానికి మల్లేష్  ఒక ఉదాహరణ అన్నారు. మల్లేష్ ఈ పర్వత శిఖరం ఎక్కడానికి వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చాలా గర్వకారణమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోవలక్ష్మీ మాట్లాడుతూ ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతాలలో ఒకటైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి పర్వతంపై మన జాతీయ జెండాను, కుమ్రం భీం, అంబేద్కర్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ల చిత్రపటాలను శిఖరంపై పెట్టిన ఘనత మన జిల్లా ఆదివాసి బిడ్డఅయిన మల్లేష్‌కే దక్కుతుందన్నారు.

త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎం కెసిఆర్ వద్దకు తీసుకెళ్లి అతన్ని సన్మానిస్తామన్నారు. అనంతరం పర్వత అధిరోహికుడు మల్లేష్ మాట్లాడుతూ పర్వతాన్ని అధిరోహించడానికి ముఖ్యంగా నా తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయులు, మిత్రులు ఎంతగానో ప్రోత్సహించారని, శిఖరంను ఎక్కేటప్పుడు చాలా ఆందోళనకు గురయ్యానని, పర్వతం అధిరోహించడానికి కొన్ని గంటల ముందు వెనుదిరుగుదామనుకున్నా కానీ నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తుకురావడంతో మన రాష్ట్రానికి, జిల్లాకు మంచిపేరు తేవాలన్న ఆ కాంక్షతో ముందుకు వెళ్లి పర్వాతాన్ని అధిరోహించానన్నారు. ఇకము ందు తమ లక్షం ఎవరెస్టు శిఖరం అధిరోహిస్తానన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ శంకర్, ఆర్‌డిఒ రమేష్, జిల్లా డిసిఒ సత్యనారాయణ, ఆదిలాబాద్ డిసిఒ గంగాధర్, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డి, ఇం చార్జి ప్రిన్సిపల్ ఉప్పలయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గందం శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ కనకయాదవరావు, ఆదివాసి సంఘం నాయకులు బుర్స పోచయ్య, స్వేరోస్ నాయకులు ఊశన్న, హేమంత్ షిండె, లక్ష్మ ణ్, చైతన్యకుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.