Home రంగారెడ్డి నయా జోష్‌లో.. జనంలోకి

నయా జోష్‌లో.. జనంలోకి

శాఖల వారిగా సమీక్షలతో అవగాహన
క్షేత్రస్థాయి పర్యటనలతో లొసుగులు బయటకు
దూకుడు చర్యలతో జనం సంతోషం
వణుకుతున్న అధికారులు

ప్రజావాణిపై నజర్…

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో హైదరాబాద్‌లో ఉండటంతో ప్రజావాణికి ఫిర్యాదులు నామమాత్రంగానే వచ్చాయి. ప్రస్తుతం వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్లు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండటంతో ఫిర్యాదులు పెరిగే అవకాశాలున్నాయి. వికారాబాద్ కలెక్టర్ దివ్య తాండూర్‌లో సైతం నిర్వహించే ప్రజావాణిలో పాల్గొననున్నారు. భవిష్యత్‌లో నియోజకవర్గ కేంద్రాలలో సైతం ప్రజావాణిలో పాల్గొనే అలోచనలో ఉన్నారు. కలెక్టర్లు స్వయంగా పాల్గొంటే తప్ప మెజారిటీ అధికారులు ప్రజావాణికి డుమ్మా కొడుతున్నారని దీనిపై ముగ్గురు కలెక్టర్లు ఒక్కసారి ఆలోచించాలని ప్రజలు కొరుతున్నారు.

Collectorమన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త జిల్లాలలో కలెక్టర్‌లు నయా జోష్‌తో దూసుకుపోతున్నారు. రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన వికారాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్‌లు సీనియర్ కలెక్టర్‌లకు దీటుగా కార్యచరణ రూపొందించుకొని జనంలోకి దూసుకుపోతు న్న తీరు ప్రజలను అకట్టకుంటుంది. కొత్త జిల్లాలలో పరిపాలన పరమైన ఇబ్బందులను సౌకర్యాలను సమకూర్చుకుంటు మరోవైపు అధికారులతో ప్రతి నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. శాఖల వారిగా సమీక్షలు నిర్వహిస్తు అధికారుల పనితీరు మెరుగు పరుచుకోవాలని సుతిమెత్తగా హెచ్చరిస్తు తీరు మారకపోతే చర్యలు తప్పవని తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందన్‌రావు సైతం గతం కన్న భిన్నంగా ఇటీవల కాలంలో క్షేత్రస్థాయి పర్యటనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో కొత్తగా వచ్చిన మండలాలను చుట్టిముట్టి వచ్చి అవగాహన తెచ్చుకోవడంతో పాటు అధికారులకు వార్నింగ్‌లు గట్టిగానే ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ సైతం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలతో పాటు భూసేకరణపై ప్రత్యేక గురిపెట్టడంతో పాటు జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాలను తనికీలు చేస్తు క్షేత్రస్థాయిలోకి వెళ్లుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలతో అనేక లోసుగులు బయటకు వస్తుండటంతో వారిపై చర్యలకు సిద్ధం అవుతున్నారు.
నయాజోష్‌లో….
కొత్త జిల్లాకు కొత్త కలెక్టర్‌గా వచ్చిన పనితీరులో మాత్రం అందరితో ఆదుర్స్ అనిపిస్తున్నారు వికారాబాద్ కలెక్టర్ దివ్య దేవరాజన్. గతంలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో గ్రామ స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు పూర్తిగా అవగాహన కలిగి ఉండటంతో క్షేత్రస్థాయిలోకి వెళ్లుతున్నారు. సర్కార్ బడులతో పాటు వసతి గృహములలో విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు అయ్యేలా చూస్తు అక్కడే వారితో కలసి భోజనాలు చేస్తున్నారు. తాండూర్ వసతి గృహంలో విద్యార్థులు తప్పిపోవడంపై నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేసి తన విధానంను స్పష్టంగా చూపించారు. ప్రభుత్వ పాఠశాలలో పడిపోతున్న విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి సమీక్షలు చేస్తు పాఠశాలలను తిరిగి విధ్యార్థులతో వారి సమస్యలు అడిగి తెలుసుకుంటు పరిష్కారంకు ఆదేశాలు జారీచేస్తున్నారు. విద్య తర్వాత వైద్యం ప్రాధాన్యత ఇస్తు ఆసుపత్రిలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో కొనసాగిన సమయంలో సమయపాలన లేకుండా స్థానికంగా ఏనాడు ఉండని చాలా మంది అధికారులు నేడు వికారాబాద్ కలెక్టర్ ఎప్పుడు తనిఖీలకు వస్తారో అన్న భయంతో విధులు చాలా వరకు సక్రమంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో మైనింగ్ మాఫియాతో పాటు ఇతర అక్రమాలపై ఇప్పటికే అంతర్గత నివేధికలను తయారు చేస్తున్న కలెక్టర్ త్వరలో వారిపై విరుచుకుపడటానికి సిద్ధం అవుతున్నారన్న ప్రచారం తాండూర్, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలలో పలువురు బయపడుతున్నారు. మేడ్చల్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి రంగారెడ్డి జిల్లాలో జాయింట్ కలెక్టర్‌తో పాటు వివిధ హోదాలలో పనిచేసిన అనుభవంతో పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ కొత్త స్టైల్‌తో ముందుకు పోతున్నారు. కొత్త కలెక్టర్‌లు నయాజోష్‌తో జనం వద్దకు వస్తుండటంతో గ్రామాల వైపు ఏనాడు కన్నెతికూడా చూడని పలు శాఖల అధికారులు ప్రస్తుతం గ్రామాల్లో కనిపిస్తున్నారు. కలెక్టర్‌లు జోష్‌ను కొనసాగించి పనిచేస్తున్న చోట అధికారులు నివాసం ఉండేలా చర్యలు చేపట్టడంతో పాటు సంక్షేమ పథకాలను మరింత క్షేత్రస్థాయిలోకి తీసుకుపోవలసిన అవసరం చాలా వరకు ఉంది.