Home రాజన్న సిరిసిల్ల కాలినడకన… కలియదిరిగిన కలెక్టర్

కాలినడకన… కలియదిరిగిన కలెక్టర్

Krishna-Bhaskar

– పరుగందుకున్న అధికారులు
– రెండు గ్రామాల్లో ‘ఉపాధి’ పనుల పర్యవేక్షణ
ఎల్లారెడ్డిపేట: ఉదయం ఇంకా ఆఫీసులకు వెళ్లాల్సిన సమయం కూడా కాలేదు. ఇంతలోనే 8.30 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ క్రిష్ణభాస్కర్ ఎల్లారెడ్డి పేట మండలంలోని బండలింగంపల్లి, నారాయణపూర్ గ్రామాలకు చేరుకోనున్నారు అనే వార్తతో ఆగమేఘాల మీద అధికారులు పరుగులు లంఘించుకున్నారు. గురువారం కాలినడకన రెండు గ్రామాల్లో వాగులు, కాలువలు దాటుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. మొదట బండలింగంపల్లి గ్రామానికి వెళ్లిన కలెక్టర్ తన కాన్వాయ్ ద్వారా భూ అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు బయలు దేరారు. కొంత దూరం వెళ్లే సరికి వాగు అడ్డురావడంతో అందులో నుండి తన కాన్వా య్ వెళ్లడానికి ఇబ్బంది ఎదురయింది. దీంతో ఓ అధికారికి చెందిన ద్విచక్రవాహనంపై రైతుల పొలాల వద్దకు చేరుకున్నారు. అక్కడ రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఉపాధి పనుల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉన్న పనులను పర్యవేక్షించేందుకు కలెక్టర్ కాలినడక మొదలెట్టగా ఆయన వెంట అధికారులు ఉరుకులు పరుగులు లంఘించుకున్నారు.

అనంతరం గ్రామంలో చేపట్టే ఉపాధి హామీ పనులకు గునపం చేతబట్టి పనులు ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల వద్దకు వెల్లి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. అలాగే పాఠశాలలోని డిజిటల్ తరగతిని పరిశీలించారు. అటునుంచి నారాయణపూర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను పర్యవేక్షించిన కలెక్టర్ రికార్డుల నిర్వహణపట్ల కొంత అసహనం వ్యక్తం చేశారు. కాగా తమకు కూలీ డబ్బులు ఇంతవరకు అందలేదని నా రాయణపూర్ కూలీలు కలెక్టర్‌తో మొరపెట్టుకోగా, మండ లంలో ఇంకా ఎంత బకాయిలు ఉన్నాయని అధికారులను అడగగా అందుకు రూ.85లక్షల వరకు ఉన్నట్లు తెలిపా రు. త్వరలోనే కూలీలు అందేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్రం మన జిల్లాకు రూ. 50కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి కూలీకి ఉపాధిహామీ పనులు అందేలాచూడాలని కోరారు. అలాగే పనులను నిర్వహించే ప్రదేశంలో ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్ డిఒ పాండురంగా, డిఆర్‌డిఒ పిడి హన్మంతరావు, ఎంపిడి ఒ చిరంజీవి, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, ఎపిఒ కొమురయ్య, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.