Home కుమ్రం భీం ఆసిఫాబాద్ మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కలెక్టర్

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కలెక్టర్

talkమన తెలంగాణ/ఆసిఫాబాద్ : జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం ప్రాజెక్టు సమీపంలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ పనులను గురువారం కలెక్టర్ చంపాలాల్ జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నిర్మాణ పనుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగతా 10 శాతం పనులను డిసెంబర్ నెలలోపు పూర్తిచేస్తామని, సంబంధిత అధికారులు కలెక్టర్‌కు తెలియజేశారు. మొదటి స్టేజ్ కింద రూ.115 కోట్లు మంజూరయ్యాయని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌వారు పనులు చేస్తున్నారని, ఇన్‌టెక్‌వెల్ పనులు 98శాతం పూర్తయ్యాయని, ఎల్‌అండ్‌టి సంస్థ వారు చేపడుతున్న పైప్‌లైన్ నిర్మాణ పనులకు 2600 పైపులకు 2100 పైపులు పూర్తిచేశామని, మిగతా పైపు నిర్మాణ పనులను డిసెంబర్‌లోగా పూర్తిచేస్తామని కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులను ఈ సంవత్సరం డిసెంబర్‌లోపు పూర్తిచేసి ప్రతీ ఇంటికి మంచినీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వీరి వెంట జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్‌డబ్లూఎస్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.