Home హైదరాబాద్ ఆర్మీ అధికారుల నోటీసులతో కాలనీవాసుల బెంబేలు

ఆర్మీ అధికారుల నోటీసులతో కాలనీవాసుల బెంబేలు

Colony residents with notice of army officers

కుత్బుల్లాపూర్ పరిధిలో పలు కాలనీలకు తెలంగాణ సబ్ ఏరియా నుంచి నోటీసులు జారీ
కష్టపడి స్థ్దలం కొనుక్కోని ఇళ్లు కట్టుకున్నామని బాధితుల ఆవేదన
చోద్యం చూస్తున్న రాజకీయ పార్టీల నేతలు

మన తెలంగాణ / షాపూర్‌నగర్:  కూలీనాలీ చేసి స్థ్దలం కొనుక్కోని ఇళ్లు కట్టుకుంటే ఆర్మీ అధికారులు నోటీసులతో కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారని కుత్బుల్లాపూర్‌లోని శ్రీరాంనగర్, బాపునగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ సర్కిల్ జిహెచ్‌ఎంసి పరిధి సర్వేనెం 105, 104లలోని శ్రీరాంనగర్, బా పూనగర్ కాలనీలలో గత 30 ఏళ్లుగా స్థ్దలం కొనుక్కోని ఇళ్లు నిర్మించుకున్న ప్రజలకు కాలసీవాసుల బెంబేలు ఇటీవల కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రా సబ్‌ఏరియా నుంచి ఆర్మీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జిఆర్‌ఎల్ సర్వే ప్రకారం తమ పరిధిలోని కొంత ప్రాంతంలో నిర్మాణాలు జరిగాయని ఆరోపిస్తున్న ఆర్మీ సిబ్బంది తరుచూ ఇంటి ముందుకు వచ్చి నోటీసులు జారీ చేస్తూ వచ్చారు. దీంతో బెంబేలెత్తిపోతున్న కాలనీవాసులు వారికి సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించినా ఏది చె ప్పాలన్నా తమ ఉన్నతాధికారులకు వచ్చి చెప్పాలంటూ హుకూం జారీ చేస్తున్నారు. అంతే కాకుండా ఎవరూ ఈ ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టాలన్నా తమ అనుమతులు ఎఒసి నుంచి ఎన్‌ఒసి కాపీ పొందాలని ఆర్మీ సిబ్బంది సూచిస్తున్నారు.
ఇళ్ల ముందుకు ఆర్మీ అధికారులు రావడంతో బెంబేలెత్తిపోతున్న స్థానికులు అయోమయానికి గురవుతున్నామని వాపోతున్నారు. 104 సర్వేనెంబర్‌కు ఆర్మీ అధికారులకు సంబంధం లేదని బాపూనగర్ కాలనీ 30 ఏళ్లక్రితం బాపూ జోషి అనే వ్యక్తి వ్యవసాయ భూమిని ప్లాట్లు చేసి ప్రభుత్వం నిబంధనల ప్రకారం అనుమతులు పొంది అమ్మకాలు చేపట్టారని కాలనీ వాసులు తెలిపారు. ప్లాట్లలో స్థ్దలం కొనుగోలు చేసిన ప్రజలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి ఫీజులు చెల్లించి ఇళ్లు, స్థలాలకు రిజిస్ట్రేషన్లు సైతం చేసుకొని నివాసం ఉంటున్నామన్నారు. 30 ఏళ్లుగా లేని సమస్య కొత్తగా సృష్టించి ఆర్మీ అధికారులు నోటీసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. జీహెచ్‌ఎంసికి ట్యాక్స్‌లు, విద్యుత్ విభాగానికి కరెంట్ బిల్లులు, జలమండలికి నల్లా బిల్లులు చెల్లిస్తున్నామని ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. శనివారం ఆర్మీ అధికారుల నోటీసులకు సమాధానం ఇచ్చిన పలువురు కాలనీ వాసులు తాము కొనుగోలు చేసిన స్థలం ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు, కరెంట్ బిల్లులు, నల్లాబిల్లులు, బ్యాంకులు తమ ఇళ్లకు మంజూరు చేసిన లోను కాపీలు, జీహెచ్‌ఎంసి అనుమతులు ఇచ్చిన పత్రాలు, ఎమ్మార్వో అందజేసిన రెసిడెన్సీ సర్టిఫికెట్లను పొందుపర్చి సికింద్రాబాద్‌లోని ఆంధ్రా ,తెలంగాణ సబ్ ఏరియా కార్యాలయంలో సమర్పించారు.
ఆర్మీ స్థ్దలం కాదంటున్న ప్రభుత్వ కార్యాలయాల అధికారులు… ఆర్మీ అధికారులు ఆరోపిస్తున్నట్లు ఈ కాలనీల్లో ఆర్మి స్థ్దలం ఉన్నట్లైతే ప్రభుత్వ విభాగాలు జీహెచ్‌ఎంసి , రెవెన్యూ, సబ్‌రిజిస్త్రార్ కార్యాలయాలు ఎలా అనుమతులు ఇస్తాయి ఇది కచ్చితంగా ఆర్మీ స్థ్దలం కాదు అవగాహన లేకుండా వారు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు ప్రభుత్వ అధికారులు వాపోతున్నారు. ప్రజలు ప్రభుత్వ అనుమతులు పొంది నిర్మించుకున్న ఇళ్లకు ఆర్మీ ఆటంకాలు సృష్టించడం తగదని ప్రజల కోరుతున్నారు. వెంటనే ఆర్మీ ఉన్నతాధికారులు ఈ సమస్యపై స్పందించి కాలనీ ప్రజలు సమర్పించిన పత్రాలను పరిశీలించి సమస్య లేకుండా చూడాలని బాధిత ప్రజలు కోరుతున్నారు.