Home అంతర్జాతీయ వార్తలు ఉగ్రంపై మహోగ్రం

ఉగ్రంపై మహోగ్రం

పాక్‌లోని లష్కర్, జైషేలను పేరు పెట్టి ఒక్క కంఠంతో ఖండించిన ్రబ్రిక్స్ నేతలు 

ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిచ్చే దేశాలే
వాటి దుశ్చర్యలకు బాధ్యత వహించాలి
టెర్రరిజంపై సమష్టి పోరు
అఫ్ఘాన్ పరిణామాలపై ఆందోళన
కిమ్ బాంబు పరీక్షకు ఖండన

Bricsజియామెన్: చైనాలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశ సంయుక్త తీర్మానం తొలిసారిగా పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల పేర్లను పేర్కొంటూ, వాటి చర్యలను ఉపేక్షించేది లేదని స్ప ష్టం చేసింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థల ఉగ్రవాద చర్యలను తీర్మానం ఖండించింది. ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చినా, నిర్వహించినా లేదా స్థావరాలకు వీలు కల్పించినా ఆయా దేశాలే సదరు హింసాత్మక చర్యలకు జవాబుదారీ వహించా ల్సి వస్తున్నదని పేర్కొన్నది. దీనితో పాకిస్థాన్ నెత్తిమీద బ్రిక్స్ రాయి పడ్డట్లయింది. భారతదేశానికి ఇది గొప్ప దౌత్య విజయంగా విశ్లేషిస్తున్నారు. తదనంతర పరిణామాలలో నేతలంతా కలిసి లష్కరే, జైషే వంటి సంస్థల ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రవాద మహమ్మారిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని బ్రిక్స్ వేదికగా నేతలంతా ప్రతిన వహించారు. దీనితో చైనాలో జరిగిన బ్రిక్స్ వేదికగా నిర్థిష్ట రీతిలో ఉగ్రవాద నిర్మూలనపై స్పందన వెలువడినట్లయింది. జియామెన్ ప్రకటన పేరిట 43 పేజీల తీర్మానాన్ని వెలువరించారు. ఐదు దేశాల బ్రిక్స్ తొమ్మిదవ వార్షికోత్సవ సదస్సు చైనాలోని జియమెన్ నగరంలో రెండు రోజు లు జరిగి సోమవారంతో ముగిసింది.
అఫ్ఘాన్‌లో హింసాత్మక చర్యలకు అడ్డుకట్ట: ఆసియా లో శాంతికి విఘాతంగా మారుతున్న ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలపై బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అక్కడ జరుగుతోన్న ఉగ్రవాద చర్యలను అరికట్టాల్సి ఉందని, రక్తపాతం నివారణ జరగాల్సి ఉందని సభ్య దేశాలు పిలుపు నిచ్చాయి. ప్రధాని మోడీ, చైనా అధ్యక్షులు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షులు పుతిన్, బ్రెజిల్ అధినేత మైఖెల్ టెమర్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు జాకబ్ జుమా ఉగ్రవాద మూలాలున్న దేశాల వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఆయా దేశాలు ఉగ్రవాద శక్తులను అదుపులో పెట్టాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. ఆసియాలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. తాలిబన్లు, ఐసిఎస్, అల్‌ఖైదా ఇప్పుడు కొత్తగా టర్కిస్థాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్, ఉజ్బెకిస్థాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్, హక్కానీ నెట్‌వర్క్‌లు సాగిస్తున్న హింసాకాండపై సభ్యదేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే ప్రత్యేకించి పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే, తెహ్రీకీ తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి), హిజ్చు ఉత్ తహ్రీర్‌ల పేర్లను ప్రకటనలో ప్రస్తావించారు. వీటికి కళ్లెం వేయాల్సి ఉందని తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఎటు నుంచి వ్యాప్తి చెందుతున్నా వాటి మూలాలున్న దేశాలే అందుకు బాధ్యత వహించాల్సి వస్తుందని బ్రిక్స్ హెచ్చరించింది. ‘ఉగ్రవాద ఆశ్రయం, నిర్వహణ, మద్దతు వంటి చర్యలకు దిగే పక్షాలు కచ్చితంగా ఉగ్రవాదానికి జవాబుదారి అవుతాయి’ అని నిర్థిష్టంగా పేర్కొన్నారు. ఉగ్రవాదులను అరికట్టాల్సిన బాధ్యత ఉగ్రవాద సంస్థలు పనిచేసే దేశాలపై ఉందని , దీనికి సంబంధించి అంతర్జాతీయ సహకారం అత్యవసరం అని పిలపు నిచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు దానిని నివారించలేకపోతే అనివార్యంగా కట్టడి చేయాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై సమిష్టిగా ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ చట్టాలు, దేశాల సమగ్రతల పరిరక్షణ నేపథ్యంలో ఇది కీలకమైన విషయం అని తెలిపారు. ఉగ్రవాద సంస్థల పేర్లను నిర్థిష్టంగా బ్రిక్స్ సదస్సులో తీర్మానం ద్వారా ప్రస్తావించడం ఇదే తొలిసారి అని భారత విదేశాంగ శాఖ తూర్పు ప్రాంత వ్యవహారాల కార్యదర్శి ప్రీతీ సరన్ విలేకరులకు తెలిపారు. తొలిసారిగా పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల పేర్లను చైనా వేదికగా సాగిన బ్రిక్స్ సదస్సులో ప్రస్తావించడం ఉగ్రవాదం బెడదపై పాకిస్థాన్ పట్ల చైనా వైఖరిలో మార్పును ఈ తీర్మానం స్పష్టం చేసింది.
చైనా కొంచెం అటూ కొంచెం ఇటూ
బ్రిక్స్ వేదిక స్థాయిలో చైనా వర్గాలు స్పష్టంగానే పాకిస్థాన్ వైఖరిని ఖండించాయి. అయితే బ్రిక్స్ సదస్సుకు ముందు చైనా విదేశాంగ ప్రతినిధి తమ విలేకరుల సమావేశంలో పాకిస్థాన్ తీసుకుంటున్న ఉగ్రవాద నిరోధక చర్యలపై భారతదేశ ఆందోళనను అర్థం చేసుకోగలమని అయితే బ్రిక్స్ వేదిక నుంచి దీనిపై చర్చించాల్సిన అవసరం లేదని, ఇది అనువైన వేదిక కాదని తెలిపారు. గోవాలో ఇంతకు ముందు జరిగిన బ్రిక్స్ సదస్సులో పాకిస్థాన్ సంబంధిత ఉగ్రవాద సంస్థల పేర్లను తీర్మానంలో జోడించడానికి చైనా ససేమిరా అంది. అప్పట్లో పాకిస్థాన్ కేంద్రీకృత ఉగ్రవాద సంస్థలు యురి సెక్టార్‌లో తీవ్రస్థాయి ఉగ్రవాద దాడులకు పాల్పడ్డా పాకిస్థాన్ వైపు వేలెత్తి చూపడానికి చైనా నిరాకరించింది. ఇప్పుడు కూడా కొంత మేరకు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టకుండా ఉండేందుకు చైనా యత్నించినట్లు వెల్లడైంది. కానీ చివరికి బ్రిక్స్ సదస్సు తీర్మానంలో ఉగ్రవాద సంస్థలను ఎండగడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బ్రిక్స్ తీర్మానం మేరకు ఇక ముందు జైషే మహ్మద్ ఇతర సంస్థలపై చైనా వైఖరి ఏ విధంగా ఉంటుందనేది చర్చనీయాంశం అయింది. ఇప్పటికే జైషే అధినేత మసూద్ అజర్‌ను ఐరాస ప్రపంచ ఉగ్రవాదిగా పేర్కొంది. దీనిపై చైనా స్పందన ఏ విధంగా ఉంటుందనేది వెల్లడి కావల్సి ఉంది. పాకిస్థాన్‌పై ఆంక్షల విషయంలో ఎప్పటికప్పుడు ఐరాస వేదిక ద్వారా చైనా ప్రతిఘటన ఎదురవుతోంది.
ఉగ్రవాద నివారణ సమష్టి సమస్య : భారత్
ఉగ్రవాదం అన్ని దేశాలనూ కలిచివేస్తోందని, ఈ దశలో ప్రపంచ దేశాలన్నీ సంయుక్తంగా దీనిపై స్పందించాల్సి ఉందని భారత ప్రతినిధి సరన్ తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనపై గోడమీది పిల్లి వాటం కుదరదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంలో మంచి చెడుల బేరీజు ఉండదని, దీనిని అంతా ఖండించాల్సిందే అని తెలిపారు. భద్రతా మండలి సంస్కరణల వేగవంతం అంశాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారని సరన్ వెల్లడించారు.
ఉగ్రవాదం నిర్మూలనకు అన్ని దేశాలూ సమగ్ర దృక్పథాన్ని పాటించాలని బ్రిక్స్ వేదిక పిలుపు నిచ్చింది. తీవ్రవాద నిరోధం, ఉగ్రవాదుల కదలికలు, నియామకాల, ఉగ్ర సంస్థలకు నిధుల నిలిపివేత వంటి చర్యలు కీలకం అని తెలిపారు. మనీలాండరింగ్, ఆయుధాల సరఫరా, మాదకద్రవ్యాల ఆటకట్టు, ఉగ్రవాద సంస్థల స్థావరాల ఏరివేత చర్యలకు పిలుపు నిచ్చారు. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమం, కమ్యూనికేషన్ టెక్నాలజీ దుర్వినియోగాన్ని నివారించాల్సి ఉందని తెలిపారు