Home దునియా రవి గాంచిన జమ్మి

రవి గాంచిన జమ్మి

జీవితం మూడునాళ్ల ముచ్చట ఇది అందరు చెప్పేమాటే. బతకడం మామూలే..ఆదర్శంగా బతికేందుకు యత్నించాలి ఇది కొందరు చెప్పేమాట. పుట్టామా? పోయామా..! అని కాకుండా మన జన్మకు సార్థకత ఉండేలా చూసుకోవాలంటున్నాడు యువ హాస్యనటుడు రచ్చ రవి. తెరపై నటిస్తే వారి కుటుంబం గడుస్తుంది. అదే ప్రకృతి సేవలో జీవిస్తే వారి జన్మ చరితార్థమౌతుంది. నన్ను నమ్ముకున్న వాళ్లకు కడుపునింపడం విధి. నేను నమ్ముకున్న వాళ్లకోసం ఏదైనా చేయడమే పరమావధి. అందుకే కోట్లాది మంది ఆరాధ్య వృక్షమైన జమ్మిచెట్టును ఊరూరా నాటాలని సంకల్పించానంటాడు రవి. శమీ వృక్షాలను అడిగినవారందరికీ పంచడంతోపాటు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాడు. పరమ పవిత్రమైన జమ్మిచెట్లను ఊరూరా నాటాలన్నదే లక్షంగా పెట్టుకున్నాడు. ఐదు లక్షల చెట్లను నాటి మన రాష్ట్ర చెట్టు పవిత్రతను దేశ వ్యాప్తంగా తెలియజేయాలంటున్న రవితో దునియా  మాటా ముచ్చట…

racha Ravi

కూతురి ప్రశ్నతో అంకురార్పణ.. చిన్నప్పటి నుంచి ప్రకృతిని ఆరాధించడం నాకెంతో ఇష్టం. ఇదే నా కూతురికి వచ్చినట్లుంది. ఏ చెట్టు నుంచి ఏఏ ఫలాలు వస్తాయని అడిగేది. ఒకసారి మన రాష్ట్ర చెట్టు జమ్మి గురించి ప్రశ్నలు సంధించింది. కేవలం దసరా నాడు మాత్రమే జమ్మిని దర్శించుకుంటామన్నది ఒక్కటే నాకు తెలుసు. అయితే మా అమ్మాయి అడిగిన ప్రశ్నలకు జమ్మి పవిత్రత గురించి తెలుసుకోవాలనిపించింది, వెంటనే నాకు పరిచయం ఉన్నవారి దగ్గర జమ్మి గురించి ప్రస్తావించాను. జమ్మి చెట్టు పవిత్రత, మహత్యం, చరిత్ర తెలుసుకున్నాక ఆశ్చర్యమేసింది. ఇంతటి మహత్తరమైన జమ్మి చెట్లు ప్రతి ఊరిలో లేవని తెలిసింది. వెంటనే రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో జమ్మి చెట్లు నాటాలని, నాటించాలని సంకల్పించాను. ఈ విషయాన్ని చినజియర్ స్వామికి తెలియజేశాను. జమ్మి చెట్టు పవిత్రతోపాటు సైన్స్ పరంగా వాటి లాభాలను తెలిపారు. నా వెన్నుతట్టి జమ్మిచెట్లను ఊరూరా నాటాలని ఆశీస్సులు అందించారు.

అమ్మా,నాన్నతో మొదలు .. గత శ్రీరామ నవమి రోజున ముందుగా నా జన్మస్థలం, జన్మనిచ్చిన తల్లితండ్రులతో వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి నుంచి జమ్మి మొక్కలను నాటడం మొదలుపెట్టాను. జనగామ, వేములవాడ, దేవరుప్పుల, సిరిసిల్ల, భువనగిరి, నల్గొండ జిల్లాలోని ప్రముఖ ఆలయాలతో పాటు అనేక గ్రామాలలోని దేవాలయాల్లో మొక్కలు నాటాను. అడిగిన వారికి అడిగినన్ని చెట్లు పంపిణీ చేస్తూ వారితోనూ నాటిస్తున్నాను. ఇప్పటి వరకు 400 గుళ్లలో జమ్మిచెట్లు నాటాను. అస్సాం రాష్ట్రంలో తెలుగువారి పిలుపు మేరకు అక్కడ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో మొక్కలను నాటాను. ఈ కార్యక్రమాన్ని చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపి కవిత తదితర ప్రముఖలు అభినందించారు.

ఇంటర్ కావాలనే ఫెయిలయ్యాను.. మాది వరంగల్ జిల్లా. అమ్మానాన్న దొడ్డిపాటి శేఖర్, అహల్యలు. నాన్న వరంగల్ మున్సిపాలిటీలో పనిచేసేవాడు. నేను ఇంటికి పెద్ద కొడుకును కావడంతో నన్ను పెద్ద చదువులు చదివించాలని ఆయన కష్టపడేవాడు. నాకు సినిమాలపై ఉన్న మోజును ఆయనకు చెప్పలేను. ఇంటర్ పూర్తి అయ్యాక నన్ను మెడిసన్ చదివించాలని మా నాన్న నిర్ణయం. ఎలాగైనా ఇంటర్ ఫెయిల్ కావాలని ఆలోచించాను. ఈక్రమంలో పరీక్షల్లో ఒక్క అక్షరం కూడా రాయలేదు. దీంతో ఇంటర్ రెండు సంవత్సరాలు ఫెయిల్ అయ్యాక హైదరాబాద్ చేరుకున్నాను. ఆపై నేను చేసిన ప్రయత్నాలన్నీ ఫలించడంతో ఈ స్థాయికి చేరుకున్నాను.

ఎఫ్‌ఎం టు 70 ఎంఎం .. ఎఫ్‌ఎం రేడియోలో జాకీగా మొదలుపెట్టిన జీవితం నేడు 70ఎంఎం స్కీన్ వరకు వచ్చింది. కొన్నేళ్లపాటు దుబాయ్‌లో రేడియో జాకీగా పనిచేశాను. జీతం బాగానే వస్తున్నప్పటికీ అదే ఉద్యోగాన్ని ఇండియాలో చేయాలనుకున్నాను.  జీతం కొంత తగ్గినా సరే పుట్టిన దేశంలో పనిచేయాలని అనుకున్న వెంటనే తిరిగి ఇండియా వచ్చేశాను. ఇక్కడ ఆ ఉద్యోగం దొరకకపోవడంతో మార్కెటింగ్ విభాగంలో కొంతకాలం పనిచేయాల్సి వచ్చింది. కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగం చేయక తప్పలేదు. ఈ నేపథ్యంలో జబర్దస్త్‌లో చమ్మక్ చంద్ర టీంలో నటించేందుకు వెలువడిన ప్రకటన చూశాను. అడిషన్స్‌కు హాజరయ్యాను. ఆ షోలో ఎంపికయ్యాను. కాల క్రమంలో టీం సభ్యుడి నుంచి అంచెలంచెలుగా టీంలీడర్ వరకు ఎదిగాను.

జబర్దస్త్ ఎందుకు వదిలిపెట్టానంటే.. జబర్దస్త్ కామెడీ షోలో అందరూ మంచివాళ్లే. కొన్ని సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల మానుకోవాల్సి వచ్చింది. రచ్చ రవిగా గుర్తింపు నిచ్చిన జబర్దస్త్‌ను ఎన్నటికీ మరువలేను. జబర్దస్ వేదికగా ఎంతోమంది హాస్యనటులు చిత్ర పరిశ్రమకు దొరికారు. ఒకరకంగా నా తల్లి జన్మనిస్తే, జబర్దస్త్ నా లక్షాలను నెరవేర్చుకునేందుకు మరో జన్మనిచ్చింది.

చెన్నూరి నాగ శ్రీధరశర్మ, మన తెలంగాణ ప్రతినిధి