Home తాజా వార్తలు కమేడియన్‌గా చేయనని చెప్పలేదు

కమేడియన్‌గా చేయనని చెప్పలేదు

సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చిత్రలహరి’. సునీల్ ఓ కీలక పాత్రలో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సివిఎం (మోహన్) నిర్మించిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా సునీల్‌తో ఇంటర్వూ విశేషాలు…
అతనంటే ఇష్టం…
తేజు సినిమాల్లోకి రాకముందు నుండే నాకు పరిచయం. అతనంటే నాకు బాగా ఇష్టం. మంచు విష్ణు, మంచు మనోజ్‌లకు అతను మంచి స్నేహితుడు. నేను సినిమాల్లో చేస్తున్నప్పుడు అతను నన్ను కలుస్తుండేవాడు. అప్పుడు అతనితో… ‘ఎప్పటికైనా నిన్ను హీరోగా పెట్టి ఓ సినిమా చేస్తా’ అని అంటుండేవాడిని. ఇన్నాళ్లకు తేజుతో కలిసి ‘చిత్రలహరి’ సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది.
ధైర్యం చెబుతాడు…
త్రివిక్రమ్ నాకు మంచి స్నేహితుడు. అతనిలో మంచి టీచర్ కూడా ఉన్నాడు. ఎవరైనా బాధల్లో ఉంటే వారికి అతను ధైర్యం చెబుతాడు. చిన్నప్పటి నుంచి త్రివిక్రమ్‌తో మంచి పరిచయం ఉంది.
ఎంతగానో ప్రోత్సహించారు…
నేను కమేడియన్ నుంచి హీరోను అయ్యాను. హీరోగా కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి. అయితే నాకు ఇండస్ట్రీలో అందరితో మంచి అనుబంధం ఉంది. ఫెయిల్యూర్స్ సమయంలో అందరూ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.
సిన్సియర్‌గానే ప్రయత్నించాను…
నేను హీరోగా మారిన తర్వాత ‘మీరు ఎలాంటి హీరో కావాలనుకుంటున్నారు’ అని ఒకరు అడిగారు. ఆయన మళ్లీ యాక్షన్, కామెడీ చేయమని చెప్పారు. నేను సిన్సియర్‌గానే ప్రయత్నించాను. ‘అందాల రాముడు’ సక్సెస్ తర్వాత కమేడియన్‌గానే సినిమాలు చేసుకుందామని అనుకున్నాను. నాకు నచ్చిన క్యారెక్టర్ వచ్చినప్పుడు హీరోగా సినిమాలు చేద్దామని అనుకున్నాను. కానీ నెమ్మదిగా దర్శక నిర్మాతలు కమేడియన్ పాత్రల కోసం నన్ను సంప్రదించడం తగ్గించేశారు. అంతేకానీ నేను ఎప్పుడూ కమేడియన్‌గా చేయనని చెప్పలేదు.
నేర్చుకుంటూ ముందుకు పోవాలి…
మనం ఫెయిల్ అయితే మనల్ని హర్ట్ చేసేవాళ్లే ఎక్కువ. సక్సెస్ అయితే పొగిడేవాళ్లు కూడా ఎక్కువ అవుతారు. మనల్ని మనం పవర్‌ఫుల్ అనుకోకపోతే బ్రతకలేం. ప్రతి విషయం నుండి నేర్చుకుంటూ ముందుకు పోతూ ఉండాలి.
తదుపరి చిత్రాలు…
నెక్ట్స్ బన్నీ, త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాను. మరో రెండు పెద్ద సినిమాలు చర్చల్లో ఉన్నాయి. మరో పెద్ద స్టార్ సినిమాలో కూడా నటించబోతున్నాను.

Comedian Sunil special interview