Home దునియా గాంధీ పజిల్!

గాంధీ పజిల్!

Gandhi-Cartoon

‘ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక’ మన గాంధీగారు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనపడతారు. ఒకరికి మహాత్ముడిలా.. ఒకరికి మహా చెత్తగా ఆయన అగపడతారు. ఎవరి కళ్లద్దాలు వారివి అనుకోవడం మినహా మనం చేయగలిగింది ఏముంది? ఎటొచ్చీ సర్వాన్నీ (మంచితో సహా) తుడిచి పెట్టే ఓట్లాటగాళ్లు పేట్రేగుతున్న నేపథ్యంలోనే ఇలా ఆయన్ని తలచుకోవడం.

గాంధీజీ సెక్యులర్ అనుకొని ఆయన్ని తిట్టేవాళ్లు కొందరైతే, ఆయన సెక్యులరిజం ‘నాట్ అప్ టుద మార్క్’ అని తిట్టేవాళ్లు మరికొందరు. అంబేద్కర్‌ని ఆయన ఒక్కసారి కూడా ఎత్తుకోలేదని కొందరంటే ‘సుభాష్ చంద్రబోస్‌ని మహా ఎత్తుకొన్నట్టూ’ అని అడగవచ్చేవారు కొందరూ. ఆయన చేసినదాన్ని, చేయనిదాన్నీ కూడా వీళ్లు జల కడిగేస్తున్నారు. మధ్యలో ఆయన్ని చంపారన్న ఆరోపణ మోస్తున్నవాళ్లు నేరుగా సబర్మతి ఆశ్రమంలో బైఠాయించి చరకా ఒడుకుతూ గోరక్షకుల చావుబాజాని ఈసడిస్తున్నారు.

ఇక ఆయన్ని చంపినట్లు అనుమానం ఉన్నవాళ్ల తీరు చూస్తే మహా విచిత్రంగా ఉంటుంది. గాంధీ హత్యజరిగిన విషయమే తెలీదే అంటారు. ఆయన్ని మేమే చంపాం అని టెర్రరిస్టుల్లా ప్రకటించేసి, ఆ హంతకుణ్ని తమ నాయకుణ్ని చేసుకోవచ్చు కదా అని అసలే నాయకుల కొరతతో బాధపడుతున్న ఆ బాపతు జనాన్ని అడిగే వారేరీ? ఇక దేముడి పార్టీవాళ్లు అయన్ని ఒప్పుకోరు అసలు. ఆవుని చంపించినవాడు ఎలా హిందువు అవుతాడు అన్నది వీళ్ల ఎదురు ప్రశ్న. యూథనేషియా అనే మెర్సీకిల్లింగ్ సూత్రావేశంతో చంపించాడంటే వినరు. ‘ఆవు మాంసం తిన్నట్టు అనుమానం ఎవరిమీద వస్తే వారిని కొట్టాలి.. వీలైతే చంపాలి.. అప్పుడే వాడు మనవాడు’ అని మత వాదులు అంటారు. హరిజన పదాన్ని సృష్టించాడని ఆయనను తిట్టిన తిట్టు తిట్ట కుండా తిడతారు దళిత మేధావులు. ‘హరి అనే హిందూ దేముడి జనాలు’ అన్న అర్థం తీసి హిందూ భక్తుడు కాబట్టి ఆయన సెక్యులరిజం బూటకం అన్నట్లు మాట్లాడుతారు. అసలు సెక్యులరిజం, నాస్తిక వాదం వేర్వేరు కావా అనే సందేహం వచ్చేలా వీరి వాదన ఉంటుంది.

‘కల కానిదీ.. విలువైనదీ.. బ్రతుకు’ అని చిన్నప్పుడు మా సందు మొగలో ఒకసారి ఓ మైకు ఘోషించింది. ఎదురుగా మరో మైకు ‘ జిందగీ.. ఏక్ సఫర్ హై సుహానా’ అని అరుస్తోంది. ఇంతకీ జీవితం అంటే కలో .. కల కాదో తేల్చుకోలేక అక్కడే ఉండిపోయాను. అంతలో సైకిల్ గుద్దేసి, అక్కడి నించి ఆసుపత్రికీ, దానినుంచి ఇంటికీ వచ్చిపడ్డాను. గాంధీ సెక్యులరిజం ఎఫెక్టు కూడా అలాంటిదే. తేల్చుకోలేం. ఆలోచిస్తూ ఏ యాక్సిడెంట్లోనో ఇరుక్కుంటాం. ఎడం చెంప మీద ఎవడైనా కొడితే కుడి చెంప చూపించమన్నాడు కదా గాంధీగారు. వీడు చెంపమీద కాదు కొట్టింది. నా డొక్కలో..’ అంటూ ఆ కొట్టినవాణ్ని కుళ్ల బొడిచాడు ఓ గాంధీ భక్తుడు ఓ సారి! ‘. . పాపం అలా అర్థం అయాడు గాంధీ వాడికి’ అనుకున్నాం.

– పురాణం జూనియర్, 89778 89588