Home ఎడిటోరియల్ అందరికీ ఆరోగ్యరక్ష ఏదీ?

అందరికీ ఆరోగ్యరక్ష ఏదీ?

Catoon-image

భారతదేశంలో ఆరోగ్య ప్రణాళిక 1938లో ఆరంభమైంది. బ్రిటీష్ ప్రభుత్వం ఐపిఎస్ అధికారి, కొచ్చిన్ రాజాస్థానంలో దివాన్ అయిన సర్ జోసఫ్ భోరే అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసింది. భోరే కమిటీగా దాన్ని పిలిచారు. దేశంలో ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్య సంస్థల గూర్చి వాస్తవ పరిస్థితి సర్వే చేయటానికి ఆ కమిటీ ఏర్పాటైంది. 1946 లో ఆ కమిటీ నివేదిక సమర్పించింది. “రోగాల నిరోధక కృషి పునాదిగా ఆరోగ్య కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలి. దేశ ఆరోగ్య వ్యవస్థను నిర్మించాలంటే రోగులకు చికిత్స చేసే కార్యక్రమంతోపాటుగా ఈ కార్యకలాపాలు చేబట్టాలి” అని కమిటీ చెప్పింది. డబ్బు చెల్లించే శక్తిలేదన్న కారణంతో ఏ వ్యక్తికీ వైద్య సంరక్షణ అవకాశాన్ని నిరాకరించరాదన్న సూత్రం దానికి ప్రాతిపదిక; ఆరోగ్య కార్యక్రమం వ్యాధి నిరోధక కృషికి ప్రత్యేక వక్కాణింపు ఇవ్వాలి; ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువలో ఉంచాలి; వైద్య సర్వీసులు ఎటువంటి వివక్షలేకుండా అందరికీ ఉచితంగా అందాలి, డాక్టర్ సామాజిక ఫిజిషియన్‌గా ఉండాలి. ఆరోగ్యం, అభివృద్ధి పరస్పర ఆధారితాలని కూడా పేర్కొన్న కమిటీ, నీటి సరఫరా, పారిశుద్ధం, పోషకాహారం, ఉపాధి వంటి ఇతర రంగాలను మెరుగుపరచాలని, అది ఆరోగ్య స్థితిని మెరుగుపరుస్తుందని చెప్పింది.

యాలె యూనివర్శిటీకి చెందిన సిఇఎ విన్‌స్లో ప్రజారోగ్యాన్ని( పబ్లిక్ హెల్త్) ఇలా నిర్వచించారు: “అది వ్యాధులు నిరోధించే, జీవితాన్ని పొడిగించే, శారీరక మానసిక ఆరోగ్యాన్ని, సామర్థాన్ని పెంపొందించే సైన్స్, కళ. పర్యావరణ పరిశుభ్రత కొరకు, అంటువ్యాధుల నివారణ కొరకు, వ్యక్తిగత పరిశుభ్రత సూత్రాల గూర్చి చైతన్య పరచటం కొరకు సమాజ సంఘటిత కృషి ద్వారా దాన్ని అభివృద్ధి పరచాలి. వైద్య పరీక్షల ద్వారా వ్యాధులను వెనువెంటనే గుర్తించేందుకు, వ్యాధుల నిరోధక చికిత్సలు అందించేందుకు మెడికల్, నర్సింగ్ సర్వీసులను ఉపయోగించాలి. సర్వీసు యంత్రాంగాన్ని అభివృద్ధి చేయటం ద్వారా సముదాయంలోని ప్రతి వ్యక్తికీ ఆరోగ్యాన్ని కాపాడుకునే జీవనప్రమాణాన్ని కలుగజేయాలి”. స్వాతంత్య్రానంతరం కొద్ది దశాబ్దాలపాటు ప్రజారోగ్యం దిశ ఈ సూత్రాలపై ఉండింది. అది ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆకాలంలో ప్రాథమిక ఆరోగ్య సేవలకు అధిక ప్రాధాన్యతతో ప్రజారోగ్యం ప్రధానంగా ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చేయబడింది.

1978లో ఆల్మా అటా డిక్లరేషన్ ( భారత ప్రభుత్వం కూడా సంతకందారు) ప్రజారోగ్య రంగంలో 20వ శతాబ్దానికి కీలకమైన మైలురాయిగా ఆవిర్భవించింది. అది ఆరోగ్యాన్ని అభివృద్ధి ప్రధాన విధిగా సూత్రీకరించింది. జీవితం, జీవనోపాధితోపాటు ఆహారం, ఆరోగ్యం, విద్య, గృహవసతి, పారిశుద్ధం, రక్షిత మంచినీరు, విద్యుచ్ఛక్తి, రవాణా సహా ప్రాథమిక సేవలకు రక్షణలను అందులో చేర్చింది. స్వయంసమృద్ధి, ప్రజల ఆర్థిక స్థోమతకు తగిన రీతిలో సేవల అందుబాటు సూత్రాలు ఆధారంగా సముదాయాల పురోగతి, ఆరోగ్యం పరస్పర ఆధారితంగా అది నొక్కి చెప్పింది. ప్రజల చెల్లింపు సామర్థంతో నిమిత్తం లేకుండా ఆరోగ్య సేవలు అందించాలన్నది ఆల్మా అటా డిక్లరేషన్ ప్రపంచానికిచ్చిన మార్గనిర్దేశన. రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల తోడ్పాటుతో ప్రజల ఆరోగ్య భద్రతను చూసే వ్యవస్థ మనకు వస్తుందని అది ఆశలు కలిగించింది. అయితే అది సంభవంకాలేదు. దాదాపుగా ఈ సమయంలోనే మొత్తం విధానాల్లో మలుపు ఆరంభమైంది.

ఆల్మా అటా డిక్లరేషన్ కాగితంపైనే ఉండిపోయింది.
ఈ సమగ్ర లక్షం స్థానంలో ఆరోగ్యం సాంకేతికతపై ఆధారపడిన, వస్తువుగా మార్చేందుకు వీలైనది”గా విధాన మార్పు జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) భావనలోనే ఈ మార్పు సంభవించింది. మెరుగైన ఆరోగ్యం కొరకు వ్యక్తిగత బాధ్యతను వక్కాణిస్తూ 1966లో అది ప్రతిపాదించిన ప్రవర్తనా పూరిత నమూనా నుంచి వచ్చిన మలుపు, ఆరోగ్య రక్షణను జనాభా నియంత్రణ, కొన్ని అంటు వ్యాధులపై చర్యలకు మళ్లించింది. అంతర్జాతీయ గుత్తపెట్టుబడి కార్పొరేట్ల ప్రభావం కింద పనిచేయటం ప్రారంభించిన డబ్లుహెచ్‌ఒ ప్రైవేటీకరణ పెంపుదల, బహుళజాతి కంపెనీలతో భాగస్వామ్యానికి అనుకూలమైన వైఖరి తీసుకుంది. పర్యవసానంగా, అందరికీ అందుబాటులో ఉండే ప్రజారోగ్య విధానాల కొరకు పని చేయాల్సిన ఈ సంస్థ ఆల్మా అటాలో అది నిర్దేశించిన సొంత ఎజండానే నాశనం చేసేందుకు చొరవ తీసుకుంది. ప్రభుత్వ విధానాలపై ప్రపంచ బ్యాంక్ ప్రభావాన్ని మనం 1980 దశకంలో చూశాం. దానివల్ల ఆరోగ్యం లాభాలార్జించే వ్యాపారంగా మారింది.

ఇప్పుడు మన దేశంలో ప్రభుత్వ రంగం వ్యాధి నిరోధక సేవలకు పరిమితం కాగా ప్రైవేటు రంగం లాభాపేక్షతో చికిత్సా రంగంలో పురోగమిస్తున్నది. ఆరోగ్యరంగంలో అతిభారీ కార్పొరేట్ ఆసుపత్రులను మనం చూస్తున్నాం. రోగులను అవి దోచుకుంటున్న తీరుపట్ల ప్రజల తిరుగుబాటు వార్తలు కూడా అప్పుడప్పుడు చూస్తున్నాం. అయినా పేదలపట్ల ఏమాత్రం జాలి, దయలేకుండా అవి కర్కశంగా వ్యవహరిస్తూనే ఉన్నాయి. పేదలకే కాదు మధ్య ఆదాయ గ్రూపులకు కూడా అభివృద్ధి చెందిన వైద్యం గగనమైపోయింది. ఆరోగ్య సేవలు అందించటంలో ప్రభుత్వ రంగ ఆరోగ్య సంస్థలు విఫలమైనాయని, అందువల్లనే కార్పొరేట్‌లు ప్రవేశించాయనే దురభిప్రాయ ప్రచారం జరుగుతోంది. ఆరోగ్యాన్ని కేవలం జబ్బులను నయం చేయటంగానే చూస్తున్నారు. మెరుగైన పారిశుద్ధం, రక్షిత తాగునీటి సరఫరా, గృహ వసతి, ఉద్యోగ భద్రత, పోషకాహారం, ఖర్చుపెట్టగల సామర్థాన్ని పెంచటం వంటి ఆరోగ్య కల్పన అంశాల మెరుగుదల గూర్చి మాట్లాడటం లేదు. ఆరోగ్యానికి సొంత ఖర్చు భరించటం వల్ల ప్రతి ఏటా 6.3 కోట్ల మంది దారిద్య్ర రేఖ దిగువకు వెళుతున్నట్లు ప్రభుత్వం గుర్తించటంలో ఆశ్చర్యం లేదు. అయితే అది చూపుతున్న పరిష్కారం ప్రజలను మరింతగా అప్పులపాల్జేస్తుంది. ఆయుష్మాన్ భారత్ ప్రైవేటు బీమా కంపెనీలకు వ్యాపారం ఇస్తుంది. లాభదాయకంగా లేకపోతే ఈ కంపెనీలు బయటకు వెళ్ల వచ్చనే భయాలున్నాయి.

సమాజంలో ఇప్పటికే అట్టడుగువెళ్లిన తరగతులను ఆరోగ్య సదుపాయాల నుంచి ఇది మినహాయిస్తున్నది. వారు ఆరోగ్యం కోసం అప్పులు చేస్తున్నారు. పరిస్థితిని మరింత దిగజార్చుతూ హస్త సాముద్రికం, గో మూత్రం, తాంత్రికుల వంటి ఛాందస భావాలకు ప్రచారం పెరుగుతున్నది. అందరికీ ఆరోగ్య సంరక్షణ కల్పించే నిమిత్తం ప్రభుత్వం అన్ని స్థాయిల్లో జోక్యం చేసుకునేలా ఆరోగ్య సంరక్షణను సామాజిక బాధ్యత చేస్తూ ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలి. ఆరోగ్య హక్కుకు సంబంధించిన సమస్యలపై ప్రజలను చైతన్యపరచటం ప్రజారోగ్య, సామాజిక కార్యకర్తల విధి.

                                                                                                                                        డాక్టర్ అరుణ్ మిత్రా