Home మంచిర్యాల అన్నదాతలపై ఎరువుల భారం

అన్నదాతలపై ఎరువుల భారం

Farmer-image

మండుతున్న ధరలతో రైతుల ఆందోళన
ఖరీఫ్‌లో విపరీతంగా ధరలు పెంచిన కంపెనీలు
మూడు నెలల్లో రెండు సార్లు పెరిగిన ఎరువుల ధరలు
రైతులపై రూ. 8.25 కోట్ల అదనపు భారం

మన తెలంగాణ/మంచిర్యాల : అసలే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక మరో వైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలను ఎదుర్కొంటున్న రైతులపై ఎరువుల కంపెనీలు మరో మోయలేని భారం మోపాయి. ఎరువుల ధరలు పెంచినట్లు ఇప్పటికే ఆయా కంపెనీలు వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాయి. గత మూ డునెలల కాలంలోనే ఇప్పటి వరకు రెండు సార్లు ఎరువుల ధరలు పెంచడంతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల తయారీకి అవసరమైన ముడి సరుకుల ధరలు పెరిగినందు వల్ల ఎరువుల ధరలను పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించడంతో రైతులపై అదనంగా రెండు జిల్లాల్లో రూ. 8.25 కోట్ల భారం పడింది. మంచిర్యాల, కొమ్రంభీం జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌కుగాను 18,600 క్వింటాళ్ల యురి యా, 09.142 క్వింటాళ్ల డిఏపితో పాటు మరో 14,816 క్వింటాళ్ల కాంప్లెక్స్ ఎరువులు, 6,123 సూపర్ ఎరువులను రైతులు వినియోగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు తయారు చేశారు. రెండు జిల్లాల్లో ప్రధానంగా పత్తి పంటలను తరువాత వరి, మొక్కజొన్న, కంది, పెసర పంటలను సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో 1.86 లక్షల ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు. ఎరువుల ధరలను పెంచడం వల్ల మరింత భారం పడిందని రైతులు వాపోతున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌కు ముందే వర్షాలు కురియడంతో రైతులు ఇప్పటికే పత్తి, వరి పంటలను వేసుకోగా గత 15 రోజులుగా వర్షాలులేకపోవడంతో విత్తనాలు మొలకెత్తక రైతులు నష్టాలకు గురయ్యే అవకాశాలు కనిపిస్తుండగా ఎరువుల ధరలు పెంచుతూ కంపెనీలు చేసుకున్న నిర్ణయం వల్ల రైతులు తల్లడిల్లి పోతున్నారు. ప్రతీ సంవత్సరం పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా రైతులకు మద్దతు ధరలు పెరగక పోవడం వల్ల రైతులు నష్టాలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి తోడు అకాల వర్షాల వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే వరి ధాన్యాలు తడిచిపోయి నష్టాలపాలయ్యారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడిసరుకుగా ఉపయోగించే పాస్మారిక్ అమ్లం ధర పెరుగుతుండడంతో దీనికి అనుగుణంగా కంపెనీల యాజమాన్యాలు ఒక్కసారిగా ధరలను పెంచేశాయి. యురియా తప్పా మిగితా ఎరువులపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో డిఏపి, కాంప్లెక్స్ ఎరువుల ధరలను విపరీతంగా పెంచాయి. గత మార్చి నుంచి జూన్ వరకు మూడు నెలల కాలంలో రెండు సార్లు ఎరువుల ధరలు పెరగడాన్ని రైతులు తట్టుకోలేకపోతున్నారు. గత యాసంగి సీజన్‌లో ఉన్న ఎరువుల ధరల కంటే ఖరీఫ్ సీజన్‌లో మరింతగా ఒక్కో ఎరువు బస్తాను రూ. 150 నుండి రూ. 200 వరకు పెంచడంతో రైతులు ఆర్థికంగా మరింత నష్టపోతున్నారు. కాంప్లెక్స్ ఎరువులు ధరలను బస్తాకు రూ.180 పెంచారు. తెలంగాణ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు ముందే పంటల పెట్టుబడుల కింద ఎకరానికి రూ. 4 వేలు అందించగా సంతోషించిన రైతులు ఒక్క సారిగా ఎరువుల ధరలు పెరడంతో ఆందోళన చెందున్నారు. ఏదిఏమైనా ఎరువుల కంపెనీలు పెంచిన ధరల వల్ల రైతులపై మరింత అధనపు భారం పడింది. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న డిఏపి ఎరువులను అధిక మొత్తంలో సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.