Home ఎడిటోరియల్ ఇక ప్రజావిశ్వాసం కొరకు పోటీ

ఇక ప్రజావిశ్వాసం కొరకు పోటీ

Article about Modi china tour

నరేంద్రమోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వీగిపోవటమనేది సాధారణ విషయం. ఎన్‌డిఎకున్న సంఖ్యాబలాన్నిబట్టి ప్రభుత్వం సునాయాస విజయం ముందే నిర్ధారణ అయింది. తీర్మానం ప్రవేశపెట్టిన ఎపికి చెందిన టిడిపి, బలపరిచిన కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ప్రభుత్వ వాగ్దానభంగాలను, వైఫల్యాలను ఎండగట్టటానికి అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాయిగాని ప్రభుత్వాన్ని కూల్చటానికి కాదు. అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్షాలకుగల హక్కునే బిజెపి తరఫు వక్తలు ప్రశ్నించటం హాస్యాస్పదంగా ఉంది. ప్రతిపక్షాలు కుమ్మక్కై మోడీ ప్రభుత్వాన్ని కూల్చేయత్నం చేస్తున్నాయన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపటం వారి ఉద్దేశమై ఉంటుంది. 11 గంటలపాటు చర్చ అనంతరం తీర్మానానికి అనుకూలంగా 126, వ్యతిరేకంగా 325 ఓట్లతో తీర్మానం ఓడిపోయినట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల అమలుపట్ల చిన్నచూపు, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ బిజెపితో అవగాహనతో రాజ్యసభలో ప్రకటించిన ‘ప్రత్యేక తరగతి హోదా’ను నిరాకరించటాన్ని నిరసిస్తూ టిడిపి అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. కాంగ్రెస్, మరికొన్ని పక్షాలు బలపరిచాయి. అయితే టిడిపి సాధించిందేమీ లేదు చంద్రబాబు నాయుడు వైసిపి ఉచ్చులో చిక్కుకుని యూ టర్న్ తీసుకున్నారని ప్రధాని మోడీ ఎదురుదాడి చేశారు. ప్రత్యేక తరగతి హోదా ఇచ్చే సమస్యేలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిపెట్టి దూసుకుపోతుందని కెసిఆర్‌కు కితాబిచ్చారుగాని, టిఆర్‌ఎస్ లేవనెత్తిన ఏ అంశానికీ జవాబివ్వలేదు. కాగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే వాడే మాటకు పాలిష్‌పెట్టి ‘అశాస్త్రీయంగా, అప్రజాస్వామికంగా’ విభజించారని టిడిపి వక్త గల్లా జయదేవ్ అసందర్భ ప్రస్తావనకుపోయి టిఆర్‌ఎస్ ఎంపిల నుంచి తీవ్ర నిరసనకు గురైనారు.
అవిశ్వాస తీర్మానం టిడిపిదైనా, అందరూ ఊహించినట్లే చర్చ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రధాని నరేంద్ర మోడీ మధ్య పోటాపోటీగా పరిణమించింది. రాహుల్ గాంధి రాజకీయంగా పరిణతి చెందినట్లు నిరూపించుకోవటమేగాక, కాంగ్రెస్‌కు ఎవరిపైన ద్వేషం లేదు అందర్నీ ప్రేమిస్తుందనే సందేశాన్ని పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలముందుంచటానికై ప్రధాని మోడీ వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకుని బిజెపికి పాక్‌యిచ్చారు. దీన్ని చిన్నపిల్లల చేష్టగా, పార్లమెంటరీ మర్యాద ఉల్లంఘనగా బిజెపి వారు కొట్టిపారేసినా తమలోని బెరుకును కప్పిపుచ్చుకోలేకపోయారు. ప్రధాని గంటన్నరపాటు గంభీరంగా ప్రసంగించినా షో అంతా రాహుల్ గాంధిపైనే కేంద్రీకరించింది. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోటీ వరకు కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలపట్ల బిజెపిలో కలవరపాటు ద్యోతకమైంది. ప్రతిపక్షాలకు అధికారమిస్తే మళ్లీ అస్థిరత చోటు చేసుకుంటుందని, అభివృద్ధి కొనసాగాలంటే తమకే తిరిగి అధికారమివ్వాలని కోరుతున్నట్లుగా ప్రధాని ప్రసంగం సాగింది. ఎన్‌డిఎ+ బల నిరూపణతో ఐక్యతను, ఆధిక్యతను చాటటానికి అమిత్‌షా చేసిన ప్రయత్నాలకు శివసేన గంటికొట్టింది. అన్నాడిఎంకె ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేసిన ఒడిసా బిజెడి ఆరంభంలోనే వాకౌట్ చేయగా, టిఆర్‌ఎస్ తమ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చేసిన అన్యాయాల గూర్చి ఫిర్యాదు అనంతరం ఓటింగ్‌లో పాల్గొనలేదు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిమంత్రివర్గ సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణలోని 7 మండలాలను ఎపిలో కలపటాన్ని నిరసించిన టిఆర్‌ఎస్ ఉపనాయకుడు వినోద్‌కుమార్ వాటిని మళ్లీ తెలంగాణలో కలుపుతూ చట్టాన్ని సవరించాలని కోరారు. విభజన చట్టంలో హామీల ప్రకారం హైకోర్టు విభజన గూర్చి కేంద్రం స్పందించకపోవటాన్ని, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, రాష్ట్రంలో గిరిజన యూనివర్శిటీ, ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవటాన్ని తప్పుపట్టారు. మిషన్ కాకతీయకు రూ.5 వేలకోట్లు, భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ప్రధాని పట్టించుకోలేదన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మోహరింపులకు బరి గీసింది. ఎవరు ఎటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమవుతోంది. కాబట్టి ప్రసంగాలన్నీ ప్రజల విశ్వాసంపొందే ప్రయత్నంలో భాగంగానే జరిగాయి. కాబట్టి ‘విశ్వాసం’ అనేది ఇప్పుడు ప్రజల చేతిలోకి వస్తోంది. అంతిమ నిర్ణేతలు వారే కదా!