Home రాష్ట్ర వార్తలు బాధితుల వినతులతో పోటెత్తినకలెక్టరేట్

బాధితుల వినతులతో పోటెత్తినకలెక్టరేట్

గ్రీవెన్స్‌కు ఫిర్యాదుల వెల్లువ
కలెక్టర్‌కు సమస్యల వినతులు
క్షేత్రస్థాయిలో తీవ్ర నిర్లక్షం
కలెక్టరేట్‌కు వస్తున్న బాధితులు
KARUNAమన తెలంగాణ/వరంగల్: గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం చేయడంతో బాధితులు జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌కు బాధితులు పోటెత్తారు. కలెక్టరేట్ ఆవరణ పూర్తిగా ఫిర్యాదుదారులతో కిటకిటలాడింది. తమ వినతులు అధికారులకు అందించేందుకు చాంతాండంత లైన్లలో నిలబడి తమ ఫిర్యాదులు అందించడం గమనార్హం. ఇందులో స్థానిక సమస్యల నుంచి మొదలు వ్యక్తిగత సమస్యలున్నాయి. చివరికి కలెక్టర్ కరుణ బయటివెళ్ళేందుకు రాగా ఆమెను చుట్టుముట్టి బాధితులు తమ ఫిర్యాదులు అందజేయడం గమనార్హం. వందల సంఖ్యలో జనం ఈ కార్యక్రమానికి రావడం చర్చనీయాంశంగా మారింది.
పెరుగుతున్న బాధితులు …
ఇటీవల జిల్లాలో ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గ్రీవెన్స్‌సెల్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు. గత వారం నుంచి గ్రీవెన్స్‌ను నిర్వహిస్తున్నారు. గత సోమవారం బాధితులు జిల్లా కేంద్రానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తాజాగా ఈ సోమవారం జిల్లా కలెక్టర్‌కు వచ్చిన బాధితులను చూసి అధికారులు విస్తుపోయారు. కలెక్టరేట్ ప్రాంగణమంతా ఫిర్యాదుదారులతో నిండిపోవడం గమనార్హం. ఎక్కడ చూసినా వారే, చివరికి పెద్దపెద్ద లైన్లు కట్టి తమ వినతులు సమర్పించారు. ఇందులో ప్రధానంగా భూ వివాదాలు, వ్యక్తిగతంగా తమకు జరిగిన అన్యాయం, పెన్షన్‌లు, రేషన్‌కార్డులు, వికలాంగుల పెన్షన్‌లు, పేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని కోరుతూ వినతులున్నాయి. తాజాగా షాదీముబారక్‌లో తమకు అవకాశం కల్పించాలని కోరే వారి సంఖ్య పెరిగింది. పట్టాదారు పాస్‌పుస్తకాలు, రేషన్‌కార్డుల జారీలో తమకు న్యాయం చేయాలంటూ పలువురు విన్నవించేందుకు వచ్చారు.
క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం …
క్షేత్రస్థాయిలో పలు మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యలకు పరిష్కారం లభించడంలేదు. కలెక్టర్‌కు తమ మొర వినిపిస్తే సమస్య సత్వర పరిష్కారమవుతుందనే భావనతో బాధితులు కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు. ఆర్ధిక, సామాజిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి చేపట్టిన గ్రీవెన్స్‌సెల్‌కు రోజురోజుకు ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి సైతం బాధితులు జిల్లా కలెక్టర్‌కు రావడం గమనార్హం. తహసిల్దార్, ఆర్‌డిఓ కార్యాలయాల్లో పలుమార్లు విన్నవించినా తమ సమస్యకు పరిష్కారం చూపెట్టకపోవడంతో కలెక్టర్‌కు విన్నవించేందుకు వస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లా కేంద్రానికి వచ్చేవారి సంఖ్యను తగ్గించాలంటే మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారులు శ్రద్ధ చూపే విధంగా సమన్వయం చేస్తే ఈ ఇబ్బంది తలెత్తదని అంటున్నారు. ఇందులో ఎక్కువ సమస్యలు మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలు కావడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు ఈ విషయంపై శ్రద్ధ వహించాలని కోరుతున్నారు. ఈ దిశగా చర్యలు చేపడితే గ్రీవెన్స్ లక్షం నెరవేరుతుందని భావిస్తున్నారు.