Home కుమ్రం భీం ఆసిఫాబాద్ 25లోపు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి

25లోపు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి

Complete 25-day checks delivery program

మన తెలంగాణ/ఆసిఫాబాద్ : రైతు బంధు చెక్కులు, పట్టా పాసుపుస్తకాల పంపిణి ఈనెల 25లోపు పూర్తిచేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు చెక్కులు, పట్టా పాసుపుస్తకాల కార్యక్రమంలో ఈనెల 25లోపు పూర్తిచేయాలని, ఈనెల 10 నుండి ప్రారంభమైన రైతుబంధు కార్యక్రమంలో చెక్కులు తీసుకోని రైతుల ఇంటి వద్దకు వెళ్లి వారి చెక్కులు, నూతన పట్టాపాసుపుస్తకాలను రైతులకు నేరుగా అందించాలన్నారు. అలాగే గత 10 రోజులుగా చేపడుతున్న చెక్కుల పంపిణి కార్యక్రమం గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది రైతులు చెక్కులు పట్టా పాసుపుస్తకాలు తీసుకున్నారని అధికారులను అడిగారు. అందుబాటులో లేని రైతులకు నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి చెక్కులను అందజేయాలన్నారు. జిల్లాలో 15 మండలాల్లో 412 గ్రామాలలో 93,787 చెక్కులకు 66,854 చెక్కులు పంపిణి చేశామని, ఇంకా 26,645 చెక్కులు పంపిణి చేయాల్సి ఉందన్నారు. పట్టా దారు పాసుపుస్తకాలు 84,579 పుస్తకాలకు 58,103 పట్టా పాసుపుస్తకాలు పంపిణి చేశామని  ఇంకా 28,103 పట్టా పాసుపుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. మిగిలినవి సోమవారం నుండి ప్రతీ గ్రామంలో రైతు ఇంటి వద్దకే వెళ్లి వీటిని పూర్తిచేయాలన్నారు. అలాగే ఈనెల 21న సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగం ఉండదని , దీనిని ప్రజలు గమనించి ప్రజా ఫిర్యాదుల విభాగానికి జిల్లా నుండి ప్రజలు రాకూడదన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్, డీఆర్‌ఓ సురేష్, ఆర్డివో రమేష్‌బాబు, లీడ్‌బ్యాంకు మేనేజర్ చెంచు రామయ్య, జిల్లాలోని తహసీల్దార్‌లు, వ్యవసాయాధికారులు, తదితరులు పాల్గొన్నారు.