Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

కొత్తదనపు కొయ్యబొమ్మలు

Nirmal-koyyabommalu

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిర్మల్ కొయ్యబొమ్మలు సంప్రదాయ పోకడలను పక్కన పెట్టి ఆధునిక కళను సంతరించుకొని కళాభిమానులను మురిపించబోతున్నాయి. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా నిర్మల్ కొయ్యబొమ్మలను తీర్చిదిద్దనున్నారు. దీని కోసం గాను ‘నిఫ్ట్’(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజి) ద్వారా కొయ్యబొమ్మల కళాకారులకు ఆధునిక పోకడలు, వాణిజ్యపరమైన డిమాండ్‌కు తగ్గట్లుగా శిక్షణను అందించనున్నారు. కొయ్యబొమ్మల తయారీని ఇప్పటి వరకు ‘పొనికి’ కర్రతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే లభించే పొనికి కర్ర సహజ సిద్ధంగా కరువవుతోంది. సరైన ప్లాంటేషన్ లేక పొనికి చెట్లు అంతరించిపోతున్నాయి. దీంతో పొనికి కర్రకు ప్రత్యామ్నాయాన్ని ‘నిఫ్ట్’ వెలుగులోకి తెచ్చింది. పొనికి బదులుగా మునగ చెట్టు కలపను కొయ్యబొమ్మల తయారీకి ఉపయోగించవచ్చని నిఫ్ట్ నిర్ధారించింది. మునగ కలపతో అనేక బొమ్మలను ఇతర అకృతులను తయారు చేసే విధంగా నకాషి కళాకారులకు నిఫ్ట్ నిపుణులు దాదాపు నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడి కళాకారులు తమ వద్ద నిల్వ ఉన్న పొనికి కలపతోను మునగ కలపతోను బొమ్మలు తయారు చేస్తున్నారు.

అమెజాన్ అమ్మకాలతో అంతర్జాతీయ మార్కెట్‌లోకి…
ఇటీవల అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన అమెజాన్ ఆన్‌లైన్ వ్యాపార సంస్థ నిర్మల్ కొయ్యబొమ్మల మార్కెటింగ్‌కు ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని గత కొన్ని నెలల నుంచి కొయ్యబొమ్మల అమ్మకాలను కొనసాగిస్తోంది. దీంతో నిర్మల్ బొమ్మల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ప్రస్తుతం ఆన్‌లైన్ అమ్మకాలు కూడా విస్తరిస్తుండంతో కొయ్యబొమ్మలకు డిమాండ్ కూడా పెరిగింది.

ఉపాధిపై ఆశలు…
పొనికి బదులుగా మునగ కలపను కొయ్యబొమ్మల తయారీకి ఉపయోగించడం అలాగే ఆధునికతను సంతరించుకున్న బొమ్మలను తయారు చేయడంలో శిక్షణ పొందడంతో నకాషి కళాకారులకు ఉపాధిపై ఆశలు చిగురుస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి పొనికి కలప అంతరిస్తుండడం, ఆధునికత తగ్గడంతో బొమ్మలకు గిరాకి తగ్గుతూ వస్తోంది. దీంతో దీని ప్రభావం కళాకారుల ఉపాధిపై కూడా పడింది. అయితే నిఫ్ట్ ఆధునిక శిక్షణ కారణంగా దాదాపు 200 మంది నకాషి కళాకారులకు ఉపాధి భరోసా దక్కింది.

జీఎస్టీ భయం…
కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయబోతున్న జీఎస్టీ(గూడ్స్ సర్వీస్ ట్యాక్స్) విధానం కొయ్యబొమ్మల కళాకారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల పన్నుల నుంచి మినహాయింపు నిస్తూ కళాకారులకు అండనిస్తోంది. అయితే జీఎస్టీ విధానం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండడంతో పన్నులు ఎలా అమలవుతాయోనని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1953వ సంవత్సరం నుంచి సహకార సంఘంగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలు పొందుతూ, పన్నుల భారం నుంచి మినహాయింపు పొందుతున్నారు కళాకారులు. జీఎస్టీ నుంచి కూడా మినహాయింపు నివ్వాలని కళాకారులు, కళాభిమానులు కోరుతున్నారు. -టి. పవన్ కుమార్, మన తెలంగాణ / ఆదిలాబాద్ రిపోర్టర్

Comments

comments