Home జాతీయ వార్తలు 21 ఏళ్లకు పూర్తయిన అతి పెద్ద వంతెన

21 ఏళ్లకు పూర్తయిన అతి పెద్ద వంతెన

Longest Railroad Bridge Ready After 21 Years

 

రోడ్డు, రైల్వే వంతెనను ప్రారంభించనున్న ప్రధాని

గౌహతి: 21 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన భారత దేశంలోనే అతి పెద్ద రోడ్డు, రైల్వే వంతెన ఇన్నాళ్లకు పూర్తయింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా మంగళవారం ఈ వంతెనను ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య బ్రహ్మపుత్ర నదిపై 4.94 కిలోమీటర్ల పొడవున ఈ వంతెనను నిర్మించారు. రూ.5,920 కోట్లతో నిర్మించిన ఈ డబుల్ డెక్కర్ వంతెన వల్ల అసోంలోని తిన్‌సుకియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని నహర్ల్‌గన్ పట్టణాల మధ్య దాదాపు 10 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. 500 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు దూరం తగ్గనుంది. ఇంజినీరింగ్ అద్భుతంగా పేర్కొనే ఈ బోగీబీల్ వంతెన రక్షణ పరమైన అవసరాలకూ, ఈశాన్య సరిహద్దు భద్రతా దళానికి చక్కని మౌలిక వసతిగా ఉపయోగపడనుంది. వంతెన కింది భాగంలో రెండు లైన్ల రైలు పట్టాలు, పై భాగంలో మూడు లైన్ల రహదారి ఉంటాయి. ఈశాన్య సరిహద్దుకు రక్షణ సామగ్రిని తరలించే అత్యంత భారీ వాహనాలు వెళ్లేందుకు అనువుగా దీన్ని నిర్మించారు.

“ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది. బ్రహ్మపుత్ర నదిపై వంతెన నిర్మించడం సవాలుతో కూడుకున్నది. ఈ వంతెన ప్రభావంతో అసోంలోని డిబ్రోగఢ్ నగరం బిజినెస్ హబ్‌గా అభివృద్ధి చెందుతుంది. విద్యా, వైద్య, ఇతర రంగాలకు మరింత ఊతమిచ్చినట్లు అవుతుంది.” అని ఓ అధికారి పేర్కొన్నారు.

ఈ బోగీబీల్ వంతెన నిర్మాణానికి 1997లొ అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ శంకుస్థాపన చేశారు. తర్వాత 2002లో ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ నిర్మాణ పనులను ప్రారంభించారు. వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చిన వంతెన నిర్మాణం.. శంకుస్థాపన చేసిన 21 ఏళ్లకు పూర్తయింది.

Completed Longest Railroad Bridge After 21 Years

Telangana Latest News