Home ఎడిటోరియల్ పరిశ్రమల కోసం బలి

పరిశ్రమల కోసం బలి

Concerned against the factory of Sterlite Copper

తమిళనాడులోని తూత్తుకుడిలో మే 22న వేదాంతాకు చెందిన స్టెర్లైట్ కాపర్ కర్మాగారానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన వేలాది మందిపై పోలీసులు జర్పిన కాల్పుల్లో 13 మంది మరణించిన ఉదంతానికి అనేక కారణాలవల్ల ప్రాధాన్యత ఉంది. ఆందోళన చేస్తున్న వారిని అదుపు చేయడానికి పోలీసులు అనుసరించ వలసిన విధానాన్ని కాకుండా విచక్షణా రహితంగా కాల్పులు జరపడానికి నిష్ణాతులైన వారిని నియోగించింది. ఈ దృశ్యాలన్నీ టీవీల్లో ప్రసారమైనాయి. ఈ సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాని ఈ విచారణ సంఘాల పని తీరు చూస్తే ఆందోళనకారుల ఆగ్రహం తగ్గే సూచనలేమీ లేవు. పోలీసు కాల్పుల్లో మరణించిన వారి కుటుం బాలకు కలిగే ఉపశమనం కూడా ఏమీ లేదు.
ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు కలగకుండా పారిశ్రామీకకరణ ఎలాజరగాలో ఇప్పటికీ తేల్చుకోలేక పోతున్నాం. దీనికి సంబంధించిన చట్టాలు, నియమ నిబంధనలు అనేకం ఉన్నా పారిశ్రామికుల ప్రయోజనాలను కాపాడడానికి నియమాలను ఉల్లంఘించడాన్ని ఒక కళగా మార్చేశారు. ఈ నియమోల్లంఘన తూత్తుకుడిలోని స్తెర్లైట్ కాపర్ పరిశ్రమలో మరీ బాహాటంగా కనిపిస్తోంది. ప్రజల జ్ఞాపశక్తి తక్కువ అన్న అభిప్రాయం బలంగా ఉంది. మే 22న ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం, విధ్వంసానికి పాల్పడడం, పోలీసులు కిరాతకంగా కాల్పులు జరపడానికి సంబంధించి టీవీల్లో భయానక దృశ్యాలు ప్రసారం అయిన తర్వాతే దేశంలోని ఇతర ప్రాంతాల వారు పట్టించు కున్నారు. గుజరాత్, గోవా, మహారాష్ట్రలో స్టెర్లైట్ కాపర్ పరిశ్రమ నెలకొల్పడానికి అవకాశం ఇవ్వనందువల్లే 1994లో ఈ పరిశ్ర మను తమిళనాడులో ఏర్పాటు చేశారు. ఈ కర్మాగారంవల్ల తమ జీవనోపాధికి ముప్పు ఏర్పడుతుందని మహారాష్ట్రలోని రత్నగిరిలోని తోటల పెంపకందార్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆందోళనలకు మద్దతు ఇచ్చి మరో చోట ఈ కర్మాగారం ఏర్పాటు చేసుకోవాలని స్టెర్లైట్‌కు చెప్పక తప్పలేదు.
అయితే తమిళనాడులో కథ కాస్త భిన్నమైంది. స్థానిక సంస్థలు కొన్ని ముందునుంచే ఈ కర్మాగారంవల్ల కాలుష్యం పెరుగు తుందని ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ పారిశ్రమికీకరణకు, ఉపాధి కల్పనకు ఇలాంటి పరిశ్రమలు అవసరం అని వాదించి తమిళనాడు ప్రభుత్వం కర్మాగారం ఏర్పాటుకు అనుమతించింది. కాలుష్య నియంత్రణలో స్టెర్లైట్ కంపెనీ నిర్వాకం గత మూడు దశాబ్దాల నుంచీ బహిర్గతం అవుతూనే ఉంది. ఈ కర్మాగారం వల్ల ఆ పరిసర ప్రాంతాలలోని గాలి, నీరు, నేల కలుషితమైపోయాయి. అయినా ఆ కంపెనీ ఉత్పత్తి కొనసాగిస్తూనే ఉంది. సుప్రీంకోర్టు ఈ కంపెనీని తీవ్రంగా అభిశంసించి వంద కోట్ల రూపాయల జరిమానా విధిం చినా స్టెర్లైట్ ఉత్పత్తిని కొనసాగించడమేకాక విస్తరణ కార్యక్రమాలు చేపట్టింది.
తూత్తుకుడిలో ఆందోళన హఠాత్పరిణామం కాదు. అనేక సంవత్సరాలుగా నిరసన ఎగుస్తూనే ఉంది. తాజా ఆందోళన ప్రారం భమై మే 22నాటికి వంద రోజులు పూర్తి అయినాయి. ఇతర ప్రాంతాలకు చెందిన పర్యావరణవేత్తలు స్థానిక ప్రజల సమీకరణకు తోడ్పడడంవల్లే పరిస్థితి విషమించిందన్న ఆరోపణలున్నాయి. అదేదో పెద్ద నేరమైనట్టు! పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రజలకు బోలెడు సమాచారం అందుబాటులో ఉంది. పీల్చే గాలి ఎలాంటి దో, వ్యాధిగ్రస్థత తీవ్రత ఏమిటో, కంపెనీ ఎలా బాహాటంగా కాలుష్య నివారణ నిబంధనలను ఉల్లంఘిస్తోందో తెలుసుకున్న ప్రజలు ప్రశ్నించక మానరు.
వారి ప్రశ్నలకు సమాధానం రాకపోతే, వారి వాదనలను నిర్లక్ష్యం చేస్తే ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన చేయడం సహజమే. తూత్తుకుడిలో జరిగింది ఇదే. 2011లో సునామీ వచ్చిన తర్వాత జపాన్‌లోని ఫుకుషిమా అణు రియాక్టర్‌లో ఘోర ప్రమాదం జరిగిన విషయాన్ని గ్రహించినం దువల్లే తమిళనాడులోని కూడాంకుళం లో అణు కేంద్ర నిర్మాణాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిం చారన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. అయినా తూత్తుకుడిలో ప్రజల భయాందోళనలను తోసిపుచ్చినట్టే కూడాంకుళంలో కూడా అణు కేంద్రం ఏర్పాటు తమిళనాడు విద్యుత్తు అవసరాలకు తప్పనిసరి అని ప్రభుత్వం వాదించింది.
పర్యావరణ అంశాల్ని ప్రజలు పట్టించుకుంటారని తెలిసినా ప్రజలకు అపాయం కలగని చోట ఇలాంటి కర్మాగారాలు ఏర్పాటు చేయాలని అనుకోనే లేదు. 1984లో జన సమ్మర్థం ఉండే చోట ఉన్న భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ కర్మాగారంలో పేలుడు జరిగి వేలాది మంది మరణించినా, అనేక వేల మంది అనారోగ్యం పాలైనా, మూడున్నర దశాబ్దాలుగా గ్యాస్ లీక్ కారణంగా అనేక బాధలు పడుతున్న వారు ఇప్పటికీ ఉన్నారని తెలిసినా, గాయపడిన వారి తర్వాతి తరాల ఆరోగ్యం మీద కూడా దుష్ప్రభావం ఉందని రుజువైనా ప్రమాదకరమైన పరిశ్రమలను ఎక్కడ నెలకొల్పాలనే విషయంలో సవ్యమైన విధానాలు ఇప్పటికీ లేవు. 1984లో భోపాల్ లోని యూనియన్ కార్బైడ్‌లో గ్యాస్‌లీక్ ప్రమాదం గురించి ప్రజలకు అంతగా తెలియదు. అంతకు ముందే కొన్ని హెచ్చరికలు వచ్చినా పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రజలకు సమాచారం అందుతోంది కనకే ప్రతిఘటిస్తున్నారు. అందువల్ల రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ముప్పు ఉండే పరిశ్రమలను ఎక్కడ నెలకొల్పాన్న విషయం ఆలోచించాలి. స్థానిక ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ఆరు నూరైనా పారిశ్రామికీకరణ జరిగి తీరవలసిందే అన్న మంకు పట్టు ఈ రోజుల్లో చెల్లదు.
ప్రస్తుతానికి తమిళనాడు కాలుష్య నియంత్రణా సంస్థ స్టెర్లైట్ కాపర్ లో ఉత్పత్తిని నిలిపి వేయించింది. (ఈ పరిశ్రమను మూసి వేస్తూ తమిళనాడు ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.) దీనివల్ల ఉద్రిక్తత కొంత తగ్గవచ్చు. కాని దీర్ఘకాలిక ప్రశ్నలు అలాగే ఉంటా యి. వీటికి పరిష్కారం కావాల్సిందే. శక్తివంతమైన వ్యాపార సంస్థలు పర్యావరణ నిబంధనలను ఇంత బాహాటంగా ఎలా ఉల్లంఘించ గలుగుతాయి? ప్రమాదకరమైన పరిశ్రమలను ఏర్పా టు చేసేటప్పుడు స్థానిక ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని, వారి భయాందోళనలను పట్టించుకోవాలని నియమాలున్నా అవి ఎందుకు అమలు కావు?