Search
Sunday 23 September 2018
  • :
  • :

యూనివర్శిటీలపై దృష్టిపెట్టాలి!

University1ఉన్నతవిద్యకు నిలయాలైన విశ్వవిద్యాలయాలకు అధిపతులే లేకపోతే, రెగ్యులర్ ఫాకల్టీ కొరవడితే వాటి పరిపాలన, బోధన రెండూ కుంటుపడతాయి. తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలన్నీ దాదాపు సంవత్సరకాలంగా ఉపకులపతులు (వైస్-ఛాన్సలర్) లేకుండా ఇన్‌ఛార్జిల పాలనలో ఉండటం వాంఛనీయ స్థితికాదు. ఒకవైపు స్కూలు విద్యలో వేలసంఖ్యలో టీచర్ పోస్టుల ఖాళీ, రెండోవైపు యూనివర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీ. అక్కడ విద్యావాలంటీర్లు, ఇక్కడేమో కాంట్రాక్టు ఫాకల్టీ. ఇతర పలు బృహత్ పథకాలపై దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం విద్యను అశ్రద్ధ చేస్తున్నదనే ఆరోపణలకు గురవుతున్నది. ఇటీవల రాష్ట్రానికి వచ్చి స్కూలు విద్యను సమీక్షించిన కేంద్రప్రభుత్వ అధికారికూడా టీచర్ల కొరతను ఆక్షేపించారు. మారుమూల స్కూళ్లలో టీచర్లు లేకపోవటాన్ని, రెగ్యులర్ టీచర్లకు బదులు తాత్కాలిక వలంటీర్ల నియామకాన్ని ఉన్నత న్యాయస్థానం కూడా తప్పుపట్టింది. అందువల్ల డిఎస్‌సి నిర్వహణకు తక్షణం చర్యలు తీసుకుని వచ్చే విద్యాసంవత్సరం ఆరంభంనాటికైనా టీచర్ల కొరతను తీర్చాలి. పదులవేల సంఖ్యలో నిరుద్యోగులు ఉపాధికోసం ఎదురుచూస్తున్నారు.

యూనివర్శిటీల్లో వైస్-ఛాన్సలర్‌ల నియామకానికి రాష్ట్రప్రభుత్వం ఇటీవల చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. సెర్చి కమిటీల్లో తమ సభ్యులను నామినేట్ చేయాల్సిందిగా ప్రభుత్వం యూనివర్శిటీలను కోరింది. త్రిసభ్య సెర్చి కమిటీల్లో రాష్ట్రప్రభుత్వం, యుజిసి ప్రతినిధులతో పాటు యూనివర్శిటీ ప్రతినిధి ఉంటారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని సెర్చి కమిటీల్లో ప్రభుత్వ ప్రతినిధిగా వుండగా, యుజిసి ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క సభ్యుణ్ణి నామినేట్ చేస్తుంది. యుజిసి ఇప్పటికే పేర్లిచ్చింది. ఇక యూనివర్శిటీలదే ఆలస్యం. ఈ క్రమాన్ని నెలాఖరుకు పూర్తిచేయాలని భావిస్తున్నట్లు టిఎస్‌సిహెచ్‌ఇ ఛైర్మన్ టి.పాపిరెడ్డి తెలిపారు. వారి సమాచారం ప్రకారం అన్ని యూనివర్శిటీల్లో సుమారు 1448 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు నియామకం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ బోధనా సిబ్బంది 795ఉండగా, కాంట్రాక్టు ఫాకల్టీ సభ్యులు 1261 ఉన్నారు. వైస్-ఛాన్సలర్‌ల నియామకం జరిగితేనేగాని టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది రిక్రూట్‌మెంట్ వీలుపడదు. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభంనాటికి ఈ రిక్రూట్‌మెంట్ జరిగి విశ్వవిద్యాలయాలు పూర్తి సామర్థంతో పనిచేయగలవని ఆశించుదాం.

Comments

comments