Home జాతీయ వార్తలు ఈద్ రోజూ కశ్మీర్‌లో ఘర్షణలు

ఈద్ రోజూ కశ్మీర్‌లో ఘర్షణలు

kashmir

శ్రీనగర్ : కశ్మీర్‌లో పవిత్ర రంజాన్ పండుగ రోజునే ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలలో ఒక వ్యక్తి మృతి చెం దారు. మరో వ్యక్తి గాయపడ్డారు. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. రంజాన్ వేడుకలకు కశ్మీర్ లోయ శనివారం తెల్లవారు జామునే అప్రమత్తాల నడుమ సమాయత్తం అయింది. ప్రజలు కొత్త దుస్తులలో మసీదులు, ఈద్గాలకు తరలివచ్చారు. అయితే అనంత్‌నాగ్ జిల్లాలోని బ్రాక్‌పోరాలో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో షీరాజ్ అహ్మద్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి తరువాత మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సఫాకాదల్‌లో జరిగిన ఘర్షణలలో ఒక వ్యక్తి గాయపడ్డారు. నెలరోజుల ఉపవాస దీక్షల తరువాత ఈదుల్ ఫితర్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు అత్యంత ఉత్సాహంతో వేడుకలకు దిగారు. హజరత్‌బల్ ప్రార్థనాస్థలి వద్ద అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరయి, ఈద్ ప్రార్థనలు నిర్వహించారు. ఓ వైపు ఎప్పుడేమి జరుగుతుందో తెలియని అభద్రతా భావన. మరో వైపు వేడుకలను మనసారా ఆస్వాదించాలనే తపన మధ్య కశ్మీర్ లోయ అంతా రంజాన్ సాగింది. సోనావార్, సౌరా దర్గాల వద్ద కూడా భారీ స్థాయిలో ప్రజలు ఈద్ నమాజ్‌లు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లా పట్టణ కేంద్రాల్లో కూడా రంజాన్ వేడుకలు జరిగాయి. ఉత్తర కశ్మీర్‌లోని సోపోరే, కుప్వారాలలో నిరసనకారులు భద్రతా బలగాలతో తలపడటంతో వాతావరణం వేడెక్కిందని ఇతర ప్రాంతాలో పరిస్థితి శాంతియుతంగానే ఉందని అధికారులు తెలిపారు.
సాంబలో పాక్ జాతీయుల పట్టివేత
రంజాన్ నేపథ్యంలోనే కశ్మీర్‌లోని సాంబ సెక్టార్‌లో ఇద్దరు పాకిస్థానీయులను బిఎస్‌ఎఫ్ వారు అదుపులోకి తీసుకున్నారు. వీరు భారతీయ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించినట్లుగా గుర్తించి పట్టుకున్నట్లు అధికారులు నిర్థారించారు. ఈ ఇద్దరు యువకులలో సొహైల్ కుమార్ నర్వాల్ జిల్లాకు చెందిన వ్యక్తి. కాగా అహ్మద్ పాకిస్థాన్‌లని సియాల్‌కోట్ ప్రాంతంలోని జఫర్‌వాల్ తెహసీల్ పరిధిలోని వ్యక్తిగా వెల్లడైంది. వీరిని ఇంటలిజెన్స్ వర్గాలు విచారిస్తున్నాయి. కాల్పుల విరమణ ఉల్లంఘన, శ్రీనగర్‌లో ఎడిటర్ కాల్చివేత, ఆర్మీ రైఫిల్‌మెన్ ఔరంగజీబును ఉగ్రవాదులు చంపివేసిన ఘటనల క్రమంలోనే ఈ ఇద్దరు పాకిస్థానీయులు దేశంలోకి చొరబడటంతో వీరి పూర్వాపరాల గురించి తీవ్రస్థాయిలో ఆరాతీస్తున్నారు.

ఔరంగజేబును విచారించిన మిలిటెంట్లు

ind1
44 రాష్ట్రీయ రైఫిల్స్ దళంలో రైఫిల్‌మెన్‌గా పనిచేసే ఔరంగాజేబు ఛిద్ర మృతదేహం, అంతకు ముందు ఆయనను ఉగ్రవాదులు ఇంటరాగేషన్ చేసిన వైనంతో కూడిన వీడియో వెలుగులోకి వచ్చింది. సైనిక కుటుంబం నుంచి వచ్చిన ఔరంగాజేబు రంజాన్ సెలవుపై ఉన్నప్పుడు మిలిటెంట్లు అపహరించుకు వెళ్లారు. ఆయనను అనేక రకాలుగా వేధించిన ఉగ్రవాదులు ఆ తరువాత కొద్ది సేపు ఇంటరాగేట్ చేసినట్లు తెలిపే దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. ఉగ్రవాదుల ఏరివేతల ఆపరేషన్లలో ఔరంగజేబు అనేక సార్లు పాల్గొన్నారు. ఏయే ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నదీ? ఎవరి ఆదేశాలతో ఎన్‌కౌంటర్‌కు దిగిందీ? వంటి వివరాలను ఆయన నుంచి రాబట్టేందుకు ఉగ్రవాదులు యత్నించారు. మిలిటెంట్లు ఈ సైనికుడిని అపహరించుకుని వెళ్లి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంచారు. తరువాత చంపివేశారు.