Search
Sunday 18 November 2018
  • :
  • :

కడెం నీటి విడుదలపై గందరగోళం

water

*యాసంగి పంటకు నీటి విడుదలపై అనుమానాలు
*ఇప్పటి వరకు కానరాని స్పష్టత
*అయోమయంలో కడెం ఆయకట్టు రైతులు
*కంట కన్నీరు పెట్టించిన ఖరీఫ్
*యాసంగి పంటలపైనే రైతుల ఆశలు
*23 నుంచి ఎల్లంపల్లి నీటి విడుదల

మంచిర్యాల ప్రతినిధి : కడెం ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల చేసే విషయంపై గందరగోళం నెలకొంది. కడెం దిగువ ప్రాంతాల ఆయకట్టుకు నీరు అందే పరిస్థితులు లేకపోవడం వలన రైతులు అయోమయం చెందుతున్నారు. కడెం ఆయకట్టుకు నీరందించే విషయంలో అధికారుల నుంచి ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడంతో రైతులు పంటలు వేయాలా వద్దా అనే గందరగోళ పరిస్థితికి లోనవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో  యాసంగి పంటలను సాగు చేయాలంటే కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడం అనివార్యం కాగా 23 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేసినప్పటికీ కడెం ప్రాజెక్టు నీటి విడుదల విషయం ఎటూ తేలకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సీజన్‌లో దోమపోటు కారణంగా పంటలను నష్టపోయి యాసంగి పంటలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సంవత్సరం జిల్లాలో 60 వేల ఎకరాల్లో పంటలను సాగు చేయగా దోమపోటు కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. అదే విధంగా అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంటలు నీట మునిగాయి. ఖరీఫ్ కలసి రాకపోవడంతో రైతులు యాసంగి పంటలను లక్షంగా పెట్టుకున్నారు. అయితే యాసంగి పంటలకు కండెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తారననే విషయం అధికారులు ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో నష్టపోయిన పంటలను యాసంగి సీజన్‌లోనైనా పొందవచ్చునని రైతులు యాసంగిలో వరి పంటలవైపు మొగ్గు చూపుతుండగా నీటి విడుదలపై స్పష్టత కానరావడం లేదు. ఖరీఫ్ పంటల కోతలు పూర్తి కాగానే యాసంగి సీజన్ కోసం వరినారు అలుకుతారు. అధికారులు కడెం నీటి విషయంలో ఏదైనా స్పష్టమైన ప్రకటన విడుదల చేస్తే వరి నాట్లు వేసుకుంటామని అంటున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థం 148 మీటర్లు కాగా గత యాసంగి ప్రారంభంలో 147 మీటర్లు ఉంది. కాగా ప్రస్తుత నీటి మట్టం 147.07 మీటర్లు ఉంది. అదే విధంగా కడెం ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థం 700 అడుగులు కాగా గత యాసంగి ప్రారంభంలో 693 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం 687.06 అడుగులు ఉంది.  యాసంగి పంటలకు కడెం ప్రాజెక్టు నీరందించే అవకాశాలు ఉన్నప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. కనీసం కడెం ప్రాజెక్టు నుంచి నీటిని చెరువుల్లో నింపిన కొద్దిపాటి ప్రయోజనం ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఆర్‌ఎస్ ప్రాజెక్టు నుంచి కడెం ప్రాజెక్టుకు నీరు విడుదల చేసి, అక్కడి నుంచి ఆయకట్టు నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

Comments

comments