Home తాజా వార్తలు మధుయాష్కీకి చేదు అనుభవం

మధుయాష్కీకి చేదు అనుభవం

MLA Komatireddy Ramulu

 

మెట్‌పల్లిలో అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
కారుపై కొమిరెడ్డి వర్గీయుల దాడి

మన తెలంగాణ/హైదరాబాద్/ జగిత్యాల : ఏఐసిసి కార్యదర్శి మధు యాష్కికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలో స్వంత పార్టీ వర్గీయుల నుంచే ప్రతిఘటన ఎదురైంది. ఒక వైద్యుని నివాసానికి వెళ్ళినట్లు సమాచారం అందుకున్న అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్‌ఎల్‌ఏ కొమిరెడ్డి రాములు వర్గీయులు ఆయనను ప్రశ్నలతో ముంచెత్తి కారుపై దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తమ నేతకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని విమర్శలు గుప్పించారు. దీంతో తగిన సమాధానం చెప్పలేకపోయిన మధు యాష్కీ చివరకు కారును అక్కడే వదిలి ద్విచక్ర వాహనాలపై వెళ్ళిపోయారు. పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయమే ఉన్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం.

జగిత్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌ను ఆశించిన తమ నేతకు పార్టీ అధిష్టానం సానుకూలంగానే స్పందించినా మధు యాష్కీ ఉద్దేశపూర్వంగా దాన్ని అడ్డుకున్నారని కొమిరెడ్డి వర్గీయులు నిలదీశారు. ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దాడికి పాల్పడిన కార్యకర్తలను చెదరగొట్టడంతో పాటు వారిపై కేసు నమోదు చేశారు. కొమిరెడ్డి రాములుకు టికెట్ రాకపోవడంతో అసంతృప్తి, అసమ్మతితో ఉండగా ‘బుజ్జగింపుల కమిటీ’ ప్రతినిధులు సర్ది చెప్పినా పరిష్కారం కాలేదు. చివరకు ఇది ఈ విధంగా హింసాత్మక రూపం తీసుకుంది. స్వంత పార్టీ నుంచే ఈ ప్రతిఘటన రావడంతో ఊహించని మధు యాష్కీ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ చర్య తదనంతరం పార్టీ క్రమ శిక్షణా కమిటీ నుంచి కొమిరెడ్డి రాములుకు శ్రీముఖం వచ్చే అవకాశం ఉంది.

Congress activists attacked on MLA Komatireddy car

Telanana Latest news