Home జాతీయ వార్తలు పార్లమెంట్‌ని రద్దు చేయాలని మోడీకి కాంగ్రెస్ సవాల్

పార్లమెంట్‌ని రద్దు చేయాలని మోడీకి కాంగ్రెస్ సవాల్

Congress challenge to Modi to cancel Parliament

న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలపై విస్తృతంగా దేశంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో, పార్లమెంట్‌ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించమని ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ సవాలు విసిరింది. కాల పరిమితి ఈ సంవత్సరం ముగుస్తున్న నాలుగు రాష్ట్రాలకు కూడా ఎన్నికలు నిర్వహించమని కోరింది. రాజ్యాంగం లేదా చట్టం  ప్రకారం ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల కాలాన్ని పొడిగించడం, 2019లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ అన్నారు. మిజోరాం, రాజస్తాన్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌ల అసెంబ్లీల కాలవ్యవధి ముగియక ముందే ఆ  రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అయితే జమిలి ఎన్నికలు నిర్వహించాలని నరేంద్ర మోడీ కోరుకుంటే, ఈ నాలుగు అసెంబ్లీలని రద్దు చేసి లోక్‌సభ ఎన్నికలతో పాటు  ఎన్నికలు నిర్వహించడం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ నరేంద్ర మోడీ ఈ చర్యకు పూనుకుంటే తాము ఆహ్వానిస్తామని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.  నాలుగు అసెంబ్లీలతో కలిపి 12 అసెంబ్లీలకు లోక్‌సభతో పాటు ఎన్నికలు నిర్వహించే అవకాశముందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించిన మరుసటి రోజే రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ సవాలు విసిరారు.  ప్రస్తుతం దేశంలో  అంతటా భయానక వాతావరణం, అసహనం, బెదిరింపులు నెలకొన్న పరిస్థితుల్లో  పార్లమెంట్‌ని వెంటనే రద్దు చేసి అసెంబ్లీలతో పాటు ఎన్నికలు నిర్వహించడం  దేశ ప్రయోజనాల దృష్టా అవసరమని  ఆయన చెప్పారు. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించడాన్ని తాము ఆహ్వానించడమే కాకుండా బిజెపితో తలపడటానికి, దానిని అధికారం నుంచి తొలగించడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నేత అశోక్ అన్నారు. ముందస్తు ఎన్నికల  ఆలోచన బిజెపికి ఉంటే అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.