Home తాజా వార్తలు ముందే ముసలం

ముందే ముసలం

Congress decision on seat adjustment as soon as possible

మహాకూటమిలో ఎడతెగని సంక్షోభం

మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ రద్దుకంటే ముందు నుంచే చర్చల్లో నలిగిన ‘మహాకూటమి’ ఏర్పాటు వ్యవహారం నెలలు గడుస్తున్నా ఒక కొలిక్కి రాలేదు. కూటమి ఉనికిలోకి రావడం అనుమానమే ననే అభిప్రాయాలు భాగస్వామ్య పార్టీల నుంచే వ్యక్తమవుతున్నాయి. సిపిఐ, తెలంగాణ జన సమితి పార్టీలు ఎవరి దారి వారిదే అనే తీరులో అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోకపోతే స్వంతంగా తమ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని ఈ రెండు పార్టీలూ వ్యాఖ్యా నించాయి. సీట్ల సర్దుబాటుపై, పొత్తులపై కాంగ్రెస్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకో కుండా నాన్చివేత ధోరణి అవలంబిస్తుం డడంతో భాగస్వామ్య పార్టీల్లో అసహనం రోజురోజుకూ పెరుగుతోంది. ఒక దశలో రెండు రోజుల డెడ్‌లైన్‌ను విధించిన తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం స్వంత నిర్ణయం తీసుకోడానికి సిద్ధమవుతున్న గంటల వ్యవధిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన సంకేతం ఆధారంగా మరో రెండు రోజులు వేచి చూస్తానని ప్రకటన చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సైతం ఇదే తీరులో త్వరలో పన్నెండు మంది అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు.

ఎన్ని భేటీలు జరిగినా, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో ఎన్ని సమావేశాలు జరిగినా మహా కూటమి ఏర్పాటులో ఇంకా ఒక స్పష్టతే రాలేదని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడొకరు తెలిపారు. అసలు కూటమి ఏర్పాటవుతుందా అనే అనుమానం కూడా లేకపోలేదని వ్యాఖ్యానించారు. తొలుత అనుకున్నట్లుగా నాలుగు పార్టీల కూటమి అవుతుందా లేక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో కలిపి రెండు పార్టీల కూటమిగానే ఉంటుందా అనే అనుమానం కూడా ఉందన్నారు. ఈ అనుమానం గురించి ఆ నాయకులు వివరణ ఇస్తూ, తెలంగాణ జనసమితి కనీసంగా 18 సీట్లను కోరుతోందని, సిపిఐ కూడా 11 సీట్ల జాబితాను ఇచ్చి కనీసంగా ఏడు స్థానాలను డిమాండ్ చేస్తోందని, ఇక తెలుగుదేశం ఎలాగూ ఇరవైకు తగ్గకుండా స్థానాలను కోరుకుంటోందని తెలిపారు. కాంగ్రెస్ వంద స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నప్పుడు 19 సీట్లను మాత్రమే మూడు పార్టీలకూ సర్దాలనుకుంటోందని, కానీ ఆ పార్టీలు 40కుపైగా సీట్లను కోరుతున్నందున ప్రతిష్టంభన తొలగడంలేదని తెలిపారు. అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీచేసి గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్‌లు ఇవ్వాలని, తప్పనిసరిగా గెలుపు ఖాయమనుకునే సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం ఇప్పటికే సూచించింది. ఇందులో భాగమే తొలి జాబితాలో 34 మంది పేర్లను ఖరారు చేసి ఢిల్లీకి పంపడం.

రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు పొత్తు కుదుర్చుకోవాలని చాలా కాలం కిందటే ఒక పరస్పర అవగాహనకు వచ్చినా మరికొన్ని పార్టీలను కలుపుకుపోవడం ద్వారా కూటమి బలంగా ఉంటుందని భావించాయి. తెలుగుదేశం పార్టీ చొరవతో సిపిఐ, తెలంగాణ జన సమితి కూడా భాగస్వామ్య పార్టీలుగా ముందుకొచ్చాయి. కానీ చివరకు సీట్ల సర్దుబాటు దగ్గరకు వచ్చేసరికి సిపిఐ, టిజెస్ పార్టీలకు కు మూడు లేదా నాలుగుకంటే ఎక్కువ సీట్లు ఇవ్వడం సమంజసం కాదని భావించిన కాంగ్రెస్ అదే విషయాన్ని సమావేశాల్లో వ్యక్తం చేసింది. అయితే ఆ రెండు పార్టీలూ తీవ్ర అసమ్మతి తెలియజేయడంతో సీట్ల సంఖ్య, సర్దుబాటు దగ్గర ప్రతిష్టంభన నెలకొనింది. ఇప్పటికీ అది కొలిక్కి రాలేదు. వేరు కుంపటి పెట్టుకోక తప్పదని ఈ రెండు పార్టీల నేతలూ మీడియా ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చివరకు ఈ రెండు పార్టీలు కూటమిలో భాగస్వాములు అవుతాయా అనే సందేహం కూడా లేకపోలేదు.

తెలుగుదేం, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒంటరిగా పోటీచేస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయోననే భయాందోళనలు సిపిఐ, టిజెఎస్‌లను వెంటాడుతున్నాయి. టిజెఎస్‌కు బిజెపి నుంచి ఎలాగూ పొత్తు ఆఫర్ ఉండనే ఉంది. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది టిజెఎస్ నేత కోదండరామే. దసరా పండుగకల్లా కూటమి ఒక కొలిక్కి రాకపోతే సిపిఐ, టిజెఎస్‌లు వేరుకుంపటి పెట్టుకోక తప్పేలా లేదు. కోదండరాం విధించిన రెండు రోజుల గడువు శుక్రవారంకల్లా ముగియనుంది. శనివారంనాటికి కాంగ్రెస్ నుంచి కూటమిపై స్పష్టత రానిపక్షంలో సిపిఐ, టిజెఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి.

Congress decision on seat adjustment as soon as possible