Home ఎడిటోరియల్ కర్ణాటక మాఫీ కాంగ్రెస్‌ది కాదు

కర్ణాటక మాఫీ కాంగ్రెస్‌ది కాదు

Congress in Karnataka Rs 31,000 crore debt mafi for farmers
తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదేపదే చెప్పిన మాటలలో ఒకటి, “కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే పెట్టున రూ. 31,000కోట్ల రూపాయల రుణ మాఫీని రైతుల కోసం చేసింది” అని. ఆ మాట ఆయన ఒకసారి అంటే పొరపాటున మాట దొర్లింది అనుకోవచ్చు. కాని పలుమార్లు అన్నందున దానిలోని నిజం ఏమిటో చెప్పుకోవటం అవసరం.

కర్ణాటక అసెంబ్లీకి గత మే నెలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపి, జెడి (ఎస్) పార్టీలు పూర్తి విడివిడిగా పోటీ చేశాయి. బద్ధ శత్రువులు అయినట్లు తీవ్రమైన పదజాలంతో ప్రచారాలు సాగించాయి. ఎవరి ఎన్నికల మేనిఫెస్టో వారు విడుదల చేశారు. వీటిలో రైతులకు రుణమాఫీ హామీని ఇచ్చింది బిజెపి, జెడి(ఎస్) కాగా, కాంగ్రెస్ అటువంటి హామీ ఏదీ ఇవ్వలేదు. బిజెపి కన్న జెడి (ఎస్) ఎక్కువ మాఫీకి హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అప్పటికి అధికారంలో ఉండినందున సిద్ధరామయ్య ప్రభుత్వం రూ. 8,165 కోట్ల సహకార బ్యాంకు రుణాలను అంతకుముందే ప్రకటించింది. వాణిజ్య బ్యాంకు రుణాల జోలికి వెళ్లలేదు. కాంగ్రెస్ ప్రత్యర్థి అయిన జెడి (ఎస్) అధ్యక్షుడు కుమార స్వామి వాణిజ్య బ్యాంకులను కూడా కలిపారు. ఆ విధంగా, ఒకవేళ జెడి (ఎస్) అధికారానికి వచ్చినట్లయితే మాఫీ చేయవలసిన రుణాల మొత్తం సొమ్ము రూ. 53,000 కోట్లు కాగలదని అపుడు అంచనా వేశారు. ఆ పార్టీ ఎట్లాగూ అధికారానికి రాదు గనుక అసాధ్యపు హామీలు ఇస్తున్నదని అపుడు కాంగ్రెస్, బిజెపి నాయకులు హేళన చేశారు.

ఎన్నికల తర్వాత జెడి (ఎస్) కు స్వంత ఆధిక్యత రాకపోయినా నాటకీయ పరిణామాలతో కుమార స్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఆర్థిక శాఖను తన వద్దనే ఉంచుకున్న ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, రుణ మాఫీని అసెంబ్లీలో ప్రకటించారు. కొత్త అంచనాల ప్రకారం మాఫీ లెక్కలు రూ. 31,000 కోట్లకు వచ్చాయి. ఈ మొత్తాన్ని విడతల వారీగా మాఫీ చేయనున్నారు. ఇక్కడ గమనించవలసింది మరొకటి ఉంది. మాఫీ ప్రశ్నపై ప్రభుత్వాన్ని ఇబ్బందిలో పెట్టేందుకు ప్రతిపక్షం బిజెపి కుమారస్వామిని గురి చేసుకుంది తప్ప కాంగ్రెస్‌ను కాదు. మాఫీ “వెంటనే” చేయనట్లయితే రాష్ట్ర బంద్ జరపగలమని హెచ్చరించింది. రుణ మాఫీ హామీ జెడి (ఎస్) దే తప్ప కాంగ్రెస్ ది కాకపోవటం అందుకు కారణం.

బిజెపితో పాటు కొన్ని రైతు సంఘాలు చేసిన హెచ్చరికలకు ముఖ్యమంత్రిగా కుమారస్వామితోపాటు ఆయన పార్టీ స్పందించగా, కాంగ్రెస్ పెద్దగా మాట్లాడకపోవటం గమనించదగ్గ విషయం. వివరాలు ఈ విధంగా ఉండగా రాహుల హైదరాబాద్‌లో, “కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం” మాఫీ చేసిందంటూ చాటుకున్నారు. మాఫీ అన్నది వారి మేనిఫెస్టోలో లేకున్నా, జెడి (ఎస్) మేనిఫెస్టో విషయమైనా, నాటకీయంగా ఏర్పడిన ప్రభుత్వంలో తమది నాయకత్వం కాకుండా భాగస్వామ్యం మాత్రమే అయినా, కనీసం ‘మా ఉమ్మడి ప్రభుత్వం” అని అయినా కాకుండా పలుమార్లు “మా కాంగ్రెస్ ప్రభుత్వం” అంటూ ఆయన ఆ విధంగా మాట్లాడటంలోని వాస్తవాలు, సహేతుకత ఏమిటో ఎవరైనా ఆలోచించవచ్చు. దీనిపై వేరే వ్యాఖ్యానించవలసిన అవసరం లేదు.

దానినట్లుంచి ఇందుకు సంబంధించిన కొన్ని ఇతర విషయాలు మాట్లాడుకోవలసి ఉంది. రాహుల్ గాంధీకి ఇక్కడి విషయాలు తెలియకపోవటం సహజం గనుక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆయనకు వాటని చెప్పటంలో ఆక్షేపించవలసింది లేదు. వారు ఆయనకు రుణ మాఫీ గురించి ఎందువల్ల అంతగా చెప్పి మాట్లాడించి ఉంటారు? ఊహించటం కష్టం కాదు. ఇక్కడి కాంగ్రెస్‌ను అన్నింటికి మించి భయపెడుతున్న ఓటు సమస్య రైతులది, గ్రామీణ వృత్తుల వారిది. ఈ రెండు వర్గాలకు సంబంధించి టిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస చర్యల ప్రభావం గణనీయంగా ఉంది. రాహుల్ గాంధీ పర్యటన చివరి రోజైన 14వ తేదీ నుంచే అమలుకు వచ్చిన రైతు బీమా పథకం ఆ చర్యలలో ఒకటి. ఇటువంటి స్థితిలో రైతులను ఆకర్షించటం ఎట్లా గన్నది కాంగ్రెస్‌కు బృహత్ ప్రశ్నగా మారింది. దానితో కెసిఆర్ ప్రభుత్వానికి మించిపోయి రెండు లక్షల మాఫీ అని, ఒకే విడతలో మాఫీ అని మాట్లాడటం మొదలుపెట్టారు.

ఇందులోని సాధ్యాసాధ్యాలపై కాంగ్రెస్ యోచనాపరులు ఒక వివరణ పత్రం తయారు చేసి విడుదల చేస్తే రైతులు నమ్మటానికి వీలుగా ఉంటుంది. అధ్యయనం చేశామంటున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పత్రాలను విడుదల చేయాలి.
కెసిఆర్ ప్రభుత్వం రూ. 17,000 కోట్లను నాలుగు విడతలలో మాఫీ చేసింది. అది రూ. ఒక లక్ష వరకు గల రుణాల మాఫీ. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం రెండు లక్షల వరకు అంటున్నది గనుక ఆ మొత్తం రూ. 34,000 కోట్లు అవుతాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్న లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చే నెలసరి రాబడి సుమారు రూ. 10,500 కోట్లు. అందులోంచి తప్పని సరి చెల్లింపులు అయిన ఉద్యోగుల జీతభత్యాలు,ఇ పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, కొన్ని పరిపాలనా వ్యయాలు ఉంటాయి. రకరకాల పథకాల బిల్లులు ఆపివేస్తారనుకున్నా ఈ స్థితిలో ఒకే విడతగా రూ. 34,000 కోట్ల మాఫీ ఎట్లా వీలవుతుందో కాంగ్రెస్ నాయకత్వం నిజాయితీగా, లెక్కలతోపాటు చెప్పగలగాలి.

ఆ పని చేస్తేనే వారిని నమ్మటం వీలవుతుంది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి మరొక మాట చెప్పారు. రుణ మాఫీల కోసం బ్యాంకులు, బ్యాంకింగ్ సంస్థలు అప్పలు ఇవ్వవని, నిర్దిష్టమైన పథకాల కోసం మాత్రమే ఇస్తాయని. దీనిపై కూడా కాంగ్రెస్ వివరణ కావాలి. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో, రైతు రుణ మాఫీ విషయమై రిజర్వ్ బ్యాంక్ ప్రతికూల వైఖరి తీసుకోవటం తెలిసిందే. ఇపుడు మాత్రం అటువంటి వైఖరిలో సడలింపు ఉంటుందని కాంగ్రెస్ భావించగలదా? వారికి ఒక విషయం తెలుసో తెలియదో కర్ణాటకలో జెడి(ఎస్) కాంగ్రెస్ సంకీర్ణం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, రుణ మాఫీలో సగం సొమ్ము సర్దుబాటు చేయవలసిందిగా కోరారు. అందుకు స్పందన రాలేదు. ఒకవేళ రేపు రాహుల్ గాంధీ ప్రధాని అయితే వివిధ రాష్ట్రాలు ఈ విధమైన అభ్యర్థనలతో కొన్ని లక్షల కోట్ల రూపాయల భారాన్ని మోసేందుకు ఆయన సిద్ధమవుతారా? కనుక ఇవన్నీ ఓట్ల కోసం మోసపుచ్చే తాత్కాలికమైన మాటలు తప్ప, కాస్త పరిశీలించినట్లయితే వాటిలో విశ్వసనీయత ఏమీ కన్పించదు.

నిజం చెప్పాంటే రైతులు, వ్యవసాయం, వృత్తులు, గ్రామీణులకు సంబంధించి ఆలోచించదగిన మాట రాహుల్ గాంధీ ఒక్కటైనా చెప్పలేదు. అవన్నీ ఇక్కడ చర్చించేము. అవన్నీ రుణ మాఫీ అంశంవలెనే తేలగలవని ఒక మాట మాత్రం అనుకుంటే సరిపోతుంది. ఇంకొక మాట కూడా అనుకుని ఈ విషయాన్ని ముగిద్దాము. తెలంగాణ వచ్చి, టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు మాత్రమే అయింది. దేశంలో వ్యవసాయ సంక్షోభం కాంగ్రెస్ పాలన సాగినంత కాలం సాగుతూనే వచ్చింది.

రైతులు అప్పులపాలు కావటం, దేశ వ్యాప్తంగా ఆత్మహత్యలు, వ్యవసాయ విధానాల గందరగోళం, విధానపరమైన శూన్యతలు, బ్యాంకింగ్ రంగపు సహాయ నిరాకరణ, పారిశ్రామిక రంగంపట్ల పక్షపాతం, వ్యవసాయ ముడి వనరుల సంక్లిష్టతలు ఇట్లా చెప్పుకుంటూపోతే అంతు ఉండదు. రాహుల్ గాంధీ 2004 లో క్రియాశీల రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి ఈ 14 సంవత్సరాల కాలంలో దీని గురించి ఏమైనా చదివారో లేదో తెలియదు. కనీసం తెలంగాణ గురించి మాత్రం గతం ఏమిటి, ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి అనే పరిజ్ఞానం మాత్రం ఆయనకు కనీస స్థాయిలో అయినా లేదన్నది తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా స్పష్టమైంది.

ఆయన గత డిసెంబర్‌లో పూర్తిస్థాయిలో పార్టీ అధ్యక్షుడు అయినందున కనీసం ఇప్పటినుంచైనా కొద్ది సమయం వాస్తవాల అధ్యయనానికి కేటాయించటం మంచిది. పర్యటన సమయంలో ఆయన మాట్లాడిన ఇతర విషయాలు కూడా ఇదే విధంగా లోపభూయిష్టంగా ఉన్నాయని తనకు ఎవరైనా చెప్తే బాగుండును. ఈ కొత్త నేతపై దేశం ఎట్లా నమ్మకం పెట్టుకోవాలో అర్థంకావటం లేదు. పోతే, రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనను చేసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ వాదులు ఇక 2019లో తమదే అధికారమని భావిస్తున్నట్లున్నారు. రాహుల్ ఎన్నికల రికార్డును గమనించినపుడు అది అత్యాశగా తోస్తుంది.

తెలంగాణలో టిఆర్‌ఎస్ ఆదరణ చర్చను పక్కన ఉంచి చూసినా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన ఏప్రిల్ మే మాసాల్లో కొన్ని వారాలపాటు రాష్ట్రమంతటా కలియ దిరిగారు. చివరన ఇక అధికారం మాదేనని ఘంటాపథంగా ప్రకటించారు. తీరా ఫలితాలు వెలువడినపుడు సిద్ధరామయ్య ప్రభుత్వం చిత్తుగా ఓడింది. కాంగ్రెస్ సీట్లు 122 నుంచి 78కి పడిపోయాయి. కేవలం 37 సీట్లు గెలిచిన చిరకాల ప్రత్యర్థి జెడి (ఎస్) శరణు జొచ్చి జూనియర్ భాగస్వామిగా ప్రభుత్వంలో చేరవలసి వచ్చింది. అంతకు ముందటి వివిధ ఎన్నికల రికార్డులు కూడా ఒకటీ అరా మినాహాయిస్తే ఈ విధంగానే ఉన్నాయి. అందువల్ల, కాంగ్రెస్ నేతలు, శ్రేణులు నేల విడిచి సాము చేయటం తగదు.