Home రంగారెడ్డి ఫలించిన బుజ్జగింపులు

ఫలించిన బుజ్జగింపులు

అధిష్టానంతో ఫోన్‌లో మాట్లాడించిన నాయకులు
మండలి అభ్యర్థి విషయంలో నారాజ్ : మాజీ కేంద్ర మంతి సర్వే సత్యనారాయణ
తాత్కాలికంగా వెనక్కి తగ్గిన మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్

CONGRESSమన తెలంగాణ/రంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన విబేధాలను సర్ధుబాటు చేయడానికి పార్టీ బడా నాయకులు రంగ ప్రవేశం చేయడంతో తాత్కాలికంగా సద్దుమణిగినట్టు కనిపించినా, అంతర్గతంగా తమదారి తాము చూసుకోవడం వైపే నాయకులు మొగ్గుచూపుతున్నారు. గురువారంనాడు కాంగ్రెస్ వదిలి టిఆర్‌ఎస్‌లో చేరుతానని వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌తో శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌లోని పెద్దలంతా కలసి సమావేశమయ్యారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, మాజీ శాసనసభ్యులు కిచ్చనగారి లకా్ష్మరెడ్డి, సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, నేతలు  బండారు లకా్ష్మరెడ్డి, శ్రీధర్ తదితరులు ఆయన నివాసంలో చర్చలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాము అండగా ఉంటామని వారు అధిష్టానం నాయకులతో ఫోన్‌లో మాట్లాడించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్పీ నాయకుడు జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో పాటు పలువురు ప్రముఖులతో ఆయనను ఫోన్‌లో మాట్లాడించి కావాల్సిన భరోసా ఇప్పించడానికి నేతలు ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ, రాహూల్‌లతో సైతం త్వరలోనే కలసి నీకు కావాల్సిన న్యాయం చేయిస్తామని వారు ఆయనను సముదాయించారు. దాదాపు మూడు గంటల పాటు నేతలంతా ఆయన నివాసంలోనే గడిపారు. మాజీ ఎంపి వివేక్ సైతం ప్రసాద్‌కుమార్‌ను ఫోన్‌లో సముదాయించడంతో ఆయన కొంత వరకు మెత్తబడినట్టు కనిపిస్తుంది.
మండలి అభ్యర్థి విషయంలో నారాజ్: సర్వే
జిల్లా స్థానిక సంస్థల మండలి అభ్యర్థి ఎంపిక విషయంలో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ను కనీసం సంప్రదించకుండా ముందుకు పోవడంపై ప్రసాద్‌కుమార్ నారాజ్ అయ్యారని ఇది అధిష్టానం చేసిన తప్పు అని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ప్రసాద్ కుమార్ ఇంటివద్ద ఆయన మాట్లాడుతూ అధిష్టానం నేతలను కొంత మంది తప్పుదోవ పట్టించడం వలన ఇది జరిగిందని తాము అంతా కలసి ఉండి సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. త్వరలోనే తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వదలిపెడుతానని తాను చెప్పలేదని మండలి అభ్యర్ది ఎంపిక విషయంలో మాత్రమే భాదపడ్డానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోనే కోనసాగితే తనకు మంచి భవిష్యత్ ఉంటుందని మిత్రులు సూచన మేరకు కొనసాగుతానని అన్నారు.
తాత్కలికమేనా….
కాంగ్రెస్ పార్టీని వదిలి టిఆర్‌ఎస్‌లో చేరడానికి నిర్ణయించిన మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ను పార్టీ అగ్రనాయకులు బుజ్జగించిన అది తాత్కలికమేనని ప్రచారం సాగుతుంది. రెండు మూడు రోజులలో ఆయన కాంగ్రెస్ పార్టీ వదలి టిఆర్‌యస్‌లో చేరడం ఖాయమని తెలిసింది.