Home జాతీయ వార్తలు హైదరాబాద్‌కు చేరిన కన్నడ రాజకీయం

హైదరాబాద్‌కు చేరిన కన్నడ రాజకీయం

Congress - JD(S) MLAs Shifted to Hyderabad Hotel

హైదరాబాద్ : కర్నాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని విషయం తెలిసిందే. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్నాటకలో 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే బిజెపి 104, కాంగ్రెస్ 78, జెడిఎస్ 38 స్థానాలను గెలుచుకున్నాయి. రెండు స్థానాల్లో ఇతరులు గెలిచారు. ఈ క్రమంలో కాంగ్రెస్ – జెడిఎస్ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. కానీ కర్నాటక గవర్నర్ అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో బిజెపి నేత యడ్యూరప్ప గురువారం కర్నాటక సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ – జెడిఎస్ పార్టీలు గవర్నర్ తీరుపై మండిపడ్డాయి. యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అసెంబ్లీలో సంఖ్యాబలం ఉన్న తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలో తమ ఎంఎల్‌ఎలను బిజెపి ప్రలోభాలకు గురి చేస్తుందని, బెదిరింపులకు పాల్పడుతుందని కాంగ్రెస్ – జెడిఎస్ అగ్రనేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తమ ఎంఎల్‌ఎలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ – జెడిఎస్‌లు క్యాంపు రాజకీయాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీలు తమ ఎంఎల్‌ఎలను హైదరాబాద్‌కు తరలించాయి. రెండు ట్రావెల్ బస్సుల్లో వారు కర్నూలు మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. హైదరాబాద్‌లోని రెండు హోటళ్లలో వారు బస చేశారు. దీంతో ఆయా హోటళ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Congress – JD(S) MLAs Shifted to Hyderabad Hotel