Home రాష్ట్ర వార్తలు సచివాలయ ముట్టడి

సచివాలయ ముట్టడి

తరలింపుకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన, నేతల అరెస్టు 

congressహైదరాబాద్: సచివాలయం తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులు గురువారం సచివాలయాన్ని ముట్టడిం చారు. లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించిన టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, జి.చిన్నారెడ్డి, డి.కె.అరుణ, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, ఎంఎల్‌ఎ వంశీచంద్‌రెడ్డి, సంపత్ కుమార్, రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎంపిలు అంజన్‌కుమార్ యాదవ్, సర్వే సత్యనారాయణ, మల్లు రవి, మాజీ ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో పాల్గొన్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అబిడ్స్, గాంధీనగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయం తరలింపుతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. వాస్తు, మూడ నమ్మకాల పేరుతో ఆమోదయోగ్యం కాని నిర్ణయాలు అమలు చేయాలని సిఎం కెసిఆర్ చూస్తున్నారన్నారు. సచివాలయం తరలింపు అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే, నిధులు లేవంటూ సంక్షేమాన్ని పక్కనబెడుతున్న ప్రభు త్వం సెంటిమెంట్లతో సచివాలయాన్ని కూల్చివే యాలని, తరలించాలని నిర్ణయించడం దారుణమ ని అన్నారు. సచివాలయం కూల్చివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచే పరిపాలించి, అత్యున్నతస్థాయికి చేరారని గుర్తుచేశారు. అగ్నిమాపక కేంద్రం ప్రత్యేకంగా ఉండగా, కోర్టులో లేవని తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లా డుతూ రైతుల ఆత్మహత్యల జరుగుతున్నాయని, రైతు రుణమాఫీ, విద్యార్ధుల ఫీజు రీయింబర్స్ మెంటు బకాయిలు చెల్లించకుండా కొత్త భవనా లెందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను సచివాల యంలోకి రాకుండా అడ్డుకోవడమేంటని పోలీసు లపై ఆగ్రహం ప్రదర్శించారు. మాజీ మంత్రి డికె అరుణ మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి సిఎంగా ఉన్నప్పుడే కొత్త క్యాంపు కార్యాలయాన్ని నిర్మించా రని, పదేళ్లు కూడా కాకముందే కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించడమెందుకని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు సిఎం ఎన్నుకున్నది తన కోసం కొత్త భవనాలు కట్టుకునేందుకా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక్కడ పనిచేసిన వారు దేశాధినేతలు అయ్యారు: మల్లు రవి
ఈ సచివాలయం నుంచి సిఎంగా పరిపాలించిన వారు పొడుగు కాలేదని సెంటిమెంటు మాటలు చెబుతూ తరలించేయత్నం చేస్తున్నారని మాజీ ఎంపి మల్లు రవి విమర్శించారు. సచివాలయ ముట్టడి అనంతరం గాంధీభవన్‌లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. ఇక్కడ పనిచేసిన వారు గొప్ప గొప్ప పనులు చేశారని, గొప్ప పదవులు పొందారని అన్నారు. ఇక్కడ సిఎంగా ఉన్న నీలం సంజీవరెడ్డి దేశానికి రాష్ట్రపతి కాగా, పివి నరసింహారావు ప్రధాని అయ్యారని గుర్తుచేశారు.