Home తాజా వార్తలు శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రద్దు

శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా రద్దు

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా రద్దయింది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మహ్మద్ షబ్బీర్ అలీకి ప్రతిపక్ష హోదా రద్దు చేస్తూ మండలి కార్యదర్శి నరసింహాచార్యులు‌ శనివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.  మండలిలో కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉండటంతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, ప్రభాకర్‌, సంతోష్‌ కుమార్‌, దామోదర్‌రెడ్డిలు తమను టిఆర్ఎస్ లో విలీనం చేయాలని మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కు వినతి పత్రం అందజేశారు. వారి విజ్ఞప్తి మేరకు నలుగురు సభ్యులను టిఆర్ఎస్ లో విలీనం చేస్తూ మండలి ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదా చేజారిపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనమండలిలో ఆరుగురు సభ్యులుండగా అందులో ప్రతిపక్ష నేతగా షబ్బీర్ ఆలీ కొనసాగుతున్నారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన ఆకుల లలిత, ప్రభాకర్‌, సంతోష్‌ కుమార్‌, దామోదర్‌రెడ్డిలు లెజిస్లేటివ్ సమావేశాన్ని నిర్వహించుకుని తెరాసలో విలీనం చేయాలని మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కు వినతి పత్రం అందజేశారు. వారి విజ్ఞప్తి మేరకు  టిఆర్ఎస్ లో విలీనం చేస్తూ మండలి ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. దీంతో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న షబ్బీర్ ఆలీ సైతం ఇక ఎంతమాత్రం ఆ హోదాను కొనసాగించలేరని, రద్దు చేస్తున్నామని నర్సింహాచార్యులు ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు.

40 మంది శాసనసభ్యులున్న మండలిలో ప్రతిపక్ష నాయకుడి హోదా పొందాలంటే కనీసం ఒకే పార్టీకి చెందిన 4 సభ్యుల మద్దతు అనివార్యం. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు సభ్యుల మద్దతు కోల్పోవడంతో షబ్బీర్ అలీ ఆ గుర్తింపును కోల్పోయారు. శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి తొలుత ఏడుగురు సభ్యులుండగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానం నుంచి గెలుపొందడంతో ఎంఎల్‌సి సభ్యత్వానికి రాజీనామా చేశారు. చైర్మన్ దాన్ని ఆమోదించారు. దీంతో మండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఆరుకు తగ్గింది. కాంగ్రెస్ సభ్యులైన ఎంఎస్ ప్రభాకర్ రావు, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కొద్ది కాలం క్రితం టిఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా ఆకుల లలిత, టి. సంతోష్ కుమార్ టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళారు. షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గం నుంచి 1982లో మొదటిసారి ఎంఎల్‌ఏగా గెలుపొందారు. ఆ తర్వాత 2004లో మరోసారి గెలిచారు. రెండు పర్యాయాలు ఎంఎల్‌ఏగా గెలవడంతో చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఎంఎల్‌సిగా ఉన్నప్పటికీ ప్రతిపక్ష హోదా గుర్తింపు కోల్పోయారు. వచ్చే ఏడాది మార్చి 29న ఆయన పదవీకాలం పూర్తికానుంది.
కొండా మురళి రాజీనామా ఆమోదం
వరంగల్ జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎంఎల్‌సిగా ఎన్నికైన కొండా మురళి ఇటీవల రాజీనామా చేయడంతో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ శనివారం ఆమోదించారు. తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మురళి తన ఎంఎల్‌సి సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ మారినందున కొండా మురళిపై పార్టీ ఫిరాయింపుల చట్టం మేరకు చర్యలు తీసుకోవాలని టిఆర్‌ఎస్ ఇటీవల శాసన మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో మురళి స్వచ్ఛందంగా తన ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం 2021 వరకు ఉంది. కొండా మురళి రాజీనామాను ఆమోదిస్తూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఉత్తర్వలు జారీచేశారు. ఇప్పటివరకు శాసనమండలిలో ఖాళీ అయిన స్థానాల సంఖ్య నాలుగుకు చేరింది. వచ్చే ఏడాది మార్చి చివరకు మరో ఎనిమిది మంది పదవీకాలం ముగియనుంది. వీటన్నింటికి కలిపి ఎన్నికలు జరగనున్నాయి.

Congress Lose Opposition status in TS legislative council