Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కోమటిరెడ్డి, సంపత్‌ల కేసులో తీర్పు నిలిపివేత

 Congress MLA Komatireddy Venkatreddi Boycott

సభా బహిష్కరణ చెల్లదన్న సింగిల్ జడ్జి తీర్పు అమలును 2 నెలలపాటు నిలిపివేసిన హైకోర్టు డివిజన్ బెంచ్  స్పీకర్‌కు జారీ చేసిన షోకాజ్‌పై,  అసెంబ్లీ న్యాయశాఖ కార్యదర్శులపై ధిక్కరణ వ్యాజ్యంపై కూడా స్టే

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్‌ల సభా బహిష్కరణ చెల్లదని సింగిల్ జడ్జి తీర్పును రెండు మాసాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరినీ ఎమ్మెల్యేలుగా పరిగణించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రెండు నెలలపాటు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు కాంగ్రెస్ నాయకుల్ని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలను ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేసింది. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు నరసింహాచార్యులు, వి.నిరంజన్‌రావులపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యంతో పాటు… స్పీకర్‌కు జారీ చేసిన షోకాజ్ నోటీసుల అమలును కూడా డివిజన్ బెంచ్ నిలిపివేసింది. అసెంబ్లీ/న్యాయ శాఖ కార్యదర్శుల అప్పీల్ వ్యాజ్యాలను విచారణకు స్వీకరించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ అసెంబ్లీ, ప్రభుత్వ న్యాయ శాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీల్‌పై సమగ్ర విచారణ నిమిత్తం తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు డివిజన్ బెంచ్ ప్రకటించింది. ఈలోగా ప్రతివాదులు తమ వాదనలతో కౌంటర్ వ్యాజ్యాలు దాఖలు చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది.
సింగిల్ జడ్జి పరిధి దాటారు…
అసెంబ్లీ కార్యదర్శి తరఫున మాజీ అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదన ఇలా కొనసాగింది… జడ్జి తీర్పు ఇచ్చిన 61 రోజులు ఆలస్యంగా అప్పీల్ దాఖలు చేయడం వెనుక సాంకేతికపర కారణాలు ఉన్నాయేగానీ వేరే ఉద్ధేశం లేదు. సింగిల్ జడ్జి తీర్పు రాజ్యాంగ వ్యతిరేకం. స్పీకర్‌కు న్యాయమూర్తి సుమోటోగా షోకాజ్ నోటీసు ఇవ్వడం చెల్లదు. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలి.. సింగిల్ జడ్జి తీర్పు సహేతుకంగా లేదు. కేసులో ప్రతివాది కూడా కాని స్పీకర్‌కు సుమోటోగా షోకాజ్ నోటీసు ఇవ్వడం చట్ట వ్యతిరేకం. గవర్నర్ ప్రసంగ సమయంలో జరిగిన ఘటనకు చెందిన వీడియో పుటేజీ ఇవ్వలేదన్న కారణంగా అసెంబ్లీ ఉత్తర్వులను సింగిల్ జడ్జి కొట్టివేయడం సరికాదు. శాసనసభ్యులు హుందాగా ఉన్నారో లేదో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయిస్తారు. సభ నిర్ణయమే అంతిమం. అసెంబ్లీలో మార్చి 12న ఘటన జరిగింది. ఇద్దరు సభ్యులను బహిష్కరిస్తూ 13న సభ తీర్మానం చేసింది. అప్పుడు వారిద్దరూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. 14వ తేదీన తూతూమంత్రంగా వినతిపత్రం ఇచ్చారు. గవర్నర్ ప్రసంగ సమయంలో హెడ్‌ఫోన్ విసరలేదని వారు చెప్పడం లేదు. హెడ్‌ఫోన్ తగిలి కౌన్సిల్ చైర్మన్ కంటికి గాయం అయింది. ఇది పూర్తిగా సభ పరిధిలోని అంశం. పూర్తిగా సభ విషయమని భావించే ఇద్దరు కార్యదర్శులు న్యాయ సమీక్షలో జోక్యం చేసుకోలేదు. అందుకే అప్పీల్ దాఖలు చేయలేదు.

సింగిల్ జడ్జి చెప్పిన తర్వాత 61 రోజులకు అప్పీల్ దాఖలు చేయాల్సివచ్చింది… అని చెప్పారు. ఇంతకీ ఇది కోర్టు పరిధిలోని అంశమో కాదో చెప్పాలని బెంచ్ ప్రశ్నించగా, సభలో జరిగిన వ్యవహారం కాబట్టి జోక్యం సబబుకాదని న్యాయవాది బదులిచ్చారు. సింగిల్ జడ్జి తన హద్దు దాటారు. సభ తీర్మానంపై న్యాయ సమీక్ష ఏమిటో తేల్చాలి.. అని చెప్పారు. వెంటనే బెంచ్ కల్పించుకుని.. రాజారాంపాల్ కేసును ప్రస్తావించింది. వెంటనే న్యాయవాది కల్పించుకుని.. సభ తీర్మానం చేశాకే ఇద్దరూ అభ్యంతరం చెబుతున్నారని అన్నారు. సభ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు వైసిపి ఎమ్మెల్యే రోజా కేసులో హైకోర్టు నిరాకరించింది. సుధీర్‌కుమార్ (కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండేవారు) కేసులో అసెంబ్లీ ధిక్కార చర్యల్లో భాగంగా ఒక నెల రోజులు జైలు శిక్ష విధించింది. సింగిల్ జడ్జి ఆదేశాల్ని కొట్టేయాలి.. అని వాదించారు. న్యాయ శాఖ కార్యదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీన్ రావెల్ వాదిస్తూ.. అసెంబ్లీ నిర్వహణ పూర్తిగా స్పీకర్ పరిధిలో ఉంటుందని, న్యాయ శాఖ కార్యదర్శికి ఏమాత్రం సంబంధం లేదన్నారు. అసెంబ్లీలో జరిగే ఏ ఘటనపైన అయినా సర్వాధికారం స్పీకర్‌దేనని, ఈ ఘటనలో కూడా స్పీకర్‌కే అధికారం ఉంటుందన్నారు.

కావాలనే జాప్యం…
రోజా కేసు ఇక్కడ అమలు కాదని కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ప్రతివాదన చే శారు. న్యాయ సమీక్ష చేయవచ్చునని, పలు సుప్రీంకోర్టు కేసులే అందుకు ఉదాహరణ అని ఆయన వాటిని ఉదహరించారు. బహిష్కరణ చేశాక మార్చి 14న మాట్లాడేందు కు ప్రయత్నిస్తే ఇద్దరికీ అనుమతి ఇవ్వలేదన్నారు. తమకు సంబంధమే లేదని చెప్పిన ఇద్దరు కార్యదర్శులు కోర్టు ధి క్కార నోటీసులు అందుకోగానే అప్పీల్ చేశారని చెప్పారు. సింగిల్ జడ్జి తీర్పును ఉద్ధేపూర్వకంగానే అమలు చేయలేదని, తీర్పును వ్యతిరేకించదలిస్తే వెంటనే అప్పీల్ దాఖలు చేయకుండా ఒక పథకం ప్రకారం జాప్యం చేసిందని జం ధ్యాల అన్నారు. వాదనల అనంతరం బెంచ్ స్పందిస్తూ.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును రెండు నెలలపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అప్పీల్ వ్యాజ్యాలను విచారణకు స్వీకరిస్తూ.. విచారణను వచ్చే నెల 25కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Comments

comments