Home నల్లగొండ నల్లగొండలో కలహాల కాంగ్రెస్ కాపురం

నల్లగొండలో కలహాల కాంగ్రెస్ కాపురం

Majority positions in the joint district

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి :  సాక్షాత్తూ టిపిసిసి అధ్యక్షుడు, సిఎల్‌పి నాయకుడు, ఉపనాయకుడు ఇలా ఒకరేమిటి యావత్ కాంగ్రెస్ పార్టీ కొలువుదీరింది నల్లగొండ జిల్లాలోనే. ఆధిపత్యపోరు, వర్గవిభేదాలు, గ్రూపు తగాదాలు అనేకానేక కలహాలతో కాపురం చేస్తూ సార్వత్రికం వేళ కాంగ్రెస్ మార్కు రాజకీయం ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో అసలే అంతంతమాత్రం ఉనికి, అదికూడా కాపాడుకోలేని దుస్థితిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉంది. అధిపత్యపోరు, టిక్కెట్ల ఆశావహుల ఆరాటంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ స్థానాల్లో లెక్కకు మించి టికెట్‌ల ఆశావహులు పోటీపడుతూ నియోజకవర్గాల్లో పోటాపోటీ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో పార్టీ శ్రేణులు నిశ్చేష్ఠులవుతున్నారు. పాత నల్లగొండ జిల్లా లో అసలే అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకునేందుకు ఇటీవల సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు విభేదాలు పక్కనపెట్టి కలిసికట్టుగా ఉండాలని పార్టీ అగ్రనాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఊదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు ఈసమింతైనా కనబడడం లేదు. సమీక్షా సమావేశాల్లోనే విబేధాలు బట్టబయలు..ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశా లు నిర్వహించారు. ఎఐసిసి కార్యదర్శి ఎండీ సలీం అహ్మద్ పరిశీలకునిగా హాజరుకాగా ఆయన సమక్షంలో జరిగిన వివాదాలు, విభేదాలే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. తొలుత నల్లగొండలో జరిగిన సమావేశంలో వివాదాలేమి చోటుచేసుకోకున్నా ఆధిపత్యపోరు, సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనబడింది.

ఈ సమావేశంలో ముఖ్యనేతల ప్రసంగాలు తప్ప ప్రకటించిన విధంగా నియోజకవర్గాల సమీక్షా సమావేశాల ఊసే లేకుండా పో యింది. ప్రసంగాలు ముగియగానే ఎవరిదారిన వారు వెళ్ళిపోవడం స్పష్టంగా కనిపించింది. మరుసటిరోజునే ఈనెల 16న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి పార్లమెంటు సమావేశంలో నేతలు ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి అధిపత్య పోరు, పరస్పర ఆరోపణలు, ప్ర త్యారోపణలతో బాహాబాహీకి దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వివాదాలు, గొడవలు సృష్టించడంతో పరిశీలకుని ఎదుటే కాం గ్రెస్ మార్కు రాజకీ యం సాక్షాత్కారమైం ది. ఏఐసిసి పరి శీల కుడు నచ్చజెప్పినా వినకపోవడంతో చేసే ది లేక సమావేశాన్ని అర్ధాంతరంగా ముగి ంచారు. పార్టీపెద్దల నియోజకవర్గాలు మినహా మిగిలినవాటన్నిం ట్లో.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్, ఆయన సతీమణి పద్మావతి కోదాడ, సిఎల్‌పి నేత జానారె డ్డి నాగార్జునసాగర్, సిఎల్‌పి ఉప నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి డిసీసీ అధ్యక్షుడు బూడిత భిక్షమయ్యగౌడ్ ఆలేరు నియోజకవర్గాలు తప్ప మిగిలిన అసెంబ్లీ ని యోకవర్గాలన్నింటిల్లో కాంగ్రెస్ ఆధిపత్య, వర్గపోరు, గ్రూ పు తగాదాలు వంటి రాజకీయం ప్రస్పుటంగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం యావత్తు నల్లగొండ జిల్లాలోనే ఉండడంతో పెద్ద తలనొప్పిగా మారింది. అసెంబ్లీ నియోకవర్గాల్లో పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసేందుకు పెద్ద నాయకులకు కత్తిమీదసాముగా తయారైంది.
నియోజకవర్గాల్లో నివురుకప్పిన నిప్పులా : నల్లగొండ, భు వనగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితి నివురుకప్పిన నిప్పులా ఉంది. నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన పటేల్ రమేష్‌రెడ్డిల అంతర్గత ఆధిపత్యపోరు, దేవరకొండ, మిర్యాలగూడల్లో స్వల్ప వర్గపోరు తప్ప మిగిలిన వాటిల్లో అంతగా ఏమి లేదు. ప్రధానంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడుకు ఏడింట్లో కోల్డ్‌వార్ కనిపిస్తోంది. భువనగిరి, ఆలేరు, జనగాం, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు, ఆధిపత్యపోరులు వెరసి ప్రచ్చన్నయుద్ధానికి దారితీసే పరిస్థితు లు కానవస్తున్నాయి.
భువనగిరి నియోజయవర్గంలో అసెంబ్లీలో పార్టీ ఇన్‌చార్జ్ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మె ల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వర్గాల మధ్య అధిపత్య పోరు పోటీపోటీగా నడుస్తుంది. తాజాగా జరిగిన సమీక్షా సమావేశంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా ఎఐసిసి కార్యదర్శి అర్దాంతరంగా సమావేశాన్ని ముగించిన విషయం విధితమే. వీరువురి వర్గాలు కాకుండా మరో ఐదారుగురు తాము టికెట్‌కు పోటీలో ఉన్నామంటూ ఇప్పటికే ప్ర చారం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇక జనగాం నియోజకవర్గానికి వస్తే మాజీ టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి మధ్య వర్గపోరాటాలు గత ఎన్నికలకు ముందు నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల భువనగిరి సమీక్షా సమావేశంలో జనగాం నాయకులు కొందరు లక్ష్మయ్య నియోజకవర్గానికి అందుబాటు లో ఉండడం లేదని నేరుగా ఎఐసిసి కార్యదర్శి సలీంకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య సమావేశంలో పాల్గొనకుండానే వెళ్ళిపోయారు. తుంగతుర్తి ని యోజవకర్గంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన అద్దంకి దయాకర్, అదే విధంగా అప్పట్లో భంగపడ్డ మామిడి సర్వయ్యలు ఎవరికి తోచిన విధంగా వారు కార్యక్రమాలు చేసుకుంటూ 2014 ఎన్నికల కోసం ముందుకు పోతున్నారు.

ఇక్కడ వీరిద్దరి విషయంలో ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి వర్గాల మధ్య పోటీ కొనసాగుతున్నది. నకిరేకల్‌కు సంబందించి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు నాలుగైదు గ్రూ పులు పనిచేసుకుంటూ వెళ్తున్నాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు ప్రసన్నకుమార్‌రాజు, కొండే టి మల్లయ్య తదితర నాయకుల మధ్య ఆధిపత్యపోరు సా గుతోంది. ఎవరికి వారు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూనే తాజాగా భువనగిరి సమావేశంలో వాదోపవాదా లు, తన్నులాటలతో వర్గపోరును చాటారు. మునుగోడు ని యో జవర్గం విషయానికొస్తే ఇప్పటికే ఇన్‌చార్జ్‌గా ఉన్న పా ల్వాయి స్రవంతి, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి వర్గాలు పోటాపోటీగా ముందుకు పోతున్నారు. తమకంటే తమకు టిక్కెట్ అంటూ ఎవరి అనచరులు వారివారి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్న సందర్బంగా ఇరువర్గాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమన్నట్టూ బేధాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. వీ రితో పాటు మరో నాయకుడు ఇరువరి మధ్య తనకు అవకా శం వస్తుందన నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో నల్లగొండలో స్వల్పంగా, భువనగిరి పార్లమెంటు పరిధిలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంతర్గత కలహాలు రానున్న ఎన్నికల నేపధ్యంలో సమస్యలుగా మారనున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఉద్దండుల ప్రాతినిధ్య ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కీచులాటలు, కుమ్ములాటలతో కుదేలవుతుంది.