Home జాతీయ వార్తలు ఎంపిలో కాంగ్రెస్‌కు అందని ఆ స్థానాలు

ఎంపిలో కాంగ్రెస్‌కు అందని ఆ స్థానాలు

Madya-Pradesh

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఆ 14 ఎంపి స్థానాలూ కొరకరాని కొయ్యలుగానే మారాయి. రాష్ట్రంలో గత 15 సంవత్సరాలుగా ఈ ఎంపి నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఓడిపోతూ వస్తోంది. గత ఏడాదే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అనుభవించిన 15 ఏండ్ల అధికార కరువు తీరింది. బిజెపిని ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే దశాబ్ధంన్నర కాలంగా 14 స్థానాలలో కాంగ్రెస్ చతికిలపడుతోంది. ఇక ఇదే కాలంలో బిజెపి రాష్ట్రంలో రెండు స్థానాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాగా వేయలేకపోతోంది. 2014 లోక్‌సభ ఎన్నికలలో మొత్తం 29 స్థానాలలో 27 స్థానాలను గెల్చుకుని బిజెపి అజేయంగా నిలిచింది. అయితే గుణ, చింద్వారా నియోజవర్గాలు బిజెపికి ససేమిరా దక్కలేదు. ఈ స్థానాల నుంచి కాంగ్రెస్ దిగ్గజాలు జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్‌లు గెలిచారు. కమలాన్ని ఇంతకు ముందటిలాగానే ఆమడ దూరంలో పెట్టారు. మధ్యప్రదేశ్ సిఎం కమల్‌నాథ్ చింద్వారా స్థానం నుంచి పది సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. 1997లో ఒక్కసారి ఈ సీనియర్ నాయకులు ఓటమి చెందారు. అప్పట్లో బిజెపి నేత, మాజీ సిఎం సుందర్ లాల్ పట్వా చేతిలో దెబ్బతిన్నారు.

అయితే అది ఉప ఎన్నిక. అయితే 1980 నుంచి కమల్ ఈ నియోజకవర్గాన్ని సొంతం చేసుకుంటూ రావడం కీలకంగా మారింది. అదే విధంగా గుణ కూడా బిజెపికి ఇన్నేళ్లుగా దక్కకుండా వస్తోంది. ఇక కాంగ్రెస్‌కు ఇన్నేళ్లుగా దూరంగా ఉంటూ ఉన్న స్థానాలలో కీలకమైనవి చాలానే ఉన్నాయి. భోపా ల్, ఇండోర్, విదిష, మోరినా, భిండ్, సాగర్, తికమ్‌ఘర్, డమోహ్, ఖజురాహో, సత్నా, జబల్పూరు, బాలాఘాట్, బెతూల్, రేవాలు ఇన్నేళ్లుగా చేజారిపోతూనే ఉన్నాయి. ఒక్క రేవాలో తప్ప మిగిలిన స్థానాలలో గత 15 ఏండ్లుగా బిజెపి విజయం సాధిస్తూ వస్తోంది.
రేవాలో బిఎస్‌పి నేత దియోరాజ్ సింగ్ పటేల్ 2009లో గెలిచారు. గతంలో కాంగ్రెస్‌కు మధ్యలో బిజెపికి తిరిగి ఇప్పుడు కాంగ్రెస్‌కు అనుకూలత ఉన్న మధ్యప్రదేశ్‌లో ఇప్పటికీ తిరుగులేకుండా విజయావకాశాలు ఉన్న స్థానాలు తొమ్మిది వరకూ ఉన్నాయి. భోపాల్‌లో 1989 నుంచి చూస్తే భోపాల్, ఇండోర్, విదిషా, భిండ్, దామోహ్‌లలో బిజెపి ఎప్పుడూ ఓడిపోలేదు. ఇతర ప్రాంతాలలో 1995 నుంచి గెలుస్తూ వస్తోంది. ఇప్పటివరకూ చాలా ఏళ్లుగా గెలుపు దక్కని స్థానాలపై తాము దృష్టి సారించినట్లు, విజయం కోసం తీవ్రస్థాయిలో యత్నిస్తున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర ప్రతినిధి పంకజ్ చతుర్వేది తెలిపారు.

Congress releases 9 candidates in Madhya Pradesh