Home ఎడిటోరియల్ ఇవిఎం x బ్యాలెట్ పేపర్

ఇవిఎం x బ్యాలెట్ పేపర్

Congress urges EC to bring back ballot papers

భారత ఎన్నికల కమిషన్ (ఇసి) సోమవారం నాడు ఢిల్లీలో నిర్వహించిన జాతీయ, రాష్ట్ర గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల సమావేశంలో కాం గ్రెస్, శివసేన సహా 17 పార్టీలు బ్యాలెట్ పేపరు ఓటింగ్ పద్ధతికి తిరిగి వెళ్లాలని కోరటంలో ఆశ్చర్యం లేదు. ఆ పార్టీలు ఇంతకుమునుపే అటువంటి డిమాండ్ చేశాయి. ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటింగ్ నిర్వహించటం సాంకేతికంగా ఎంతో పురోగతి అయినప్పటికీ, ఏ బటన్ నొక్కినా ఒక పార్టీకే ఓటు నమోదు కావటం వంటి యాంత్రిక లోపాలు అడపాదడపా బయటపడటం, కొందరు యాంత్రిక వ్యవస్థలను తారుమారు చేస్తున్నారన్న అనుమానాలతోనే ఆ డిమాండ్ వచ్చింది. దీంతో ఓటు యంత్రంలో నిక్షిప్తమైనట్లే, తాను బటన్ నొక్కిన అభ్యర్థికే ఓటు నమోదైనట్లు ఓటరుకు భరోసా ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్, ఓటు వేసిన గుర్తు స్క్రీన్‌పై ఓటరుకు కనిపించే విధంగా వివిపాట్‌లను ఇవిఎంలకు జత చేసింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన వివిపాట్‌లు కొన్ని చోట్ల పనిచేయకపోవటం అపోహలు పెంచింది. అయితే యంత్రాల విషయంలో లేవనెత్తిన సమస్యలకు సంతృప్తికరమైన పరిష్కారాలు చూపుతామని ఎన్నికల కమిషన్ చెబుతోంది. పేపర్ బ్యాలెట్‌కు తిరిగి వెళ్లటం నిస్సందేహంగా తిరోగమనమే అవుతుంది. అయితే అనుమానాలను సంపూర్ణంగా తొలగించవలసిన బాధ్యత ఇసిది. విశ్వాస కల్పనకుగాను ప్రతి నియోజకవర్గంలో ఒకటి కాకుండా పెక్కు పోలింగ్ కేంద్రాల్లో ఇవిఎం ఓట్ల సంఖ్యలతో వివిపాట్‌లోని పేపర్ ఓట్లను సరిపోల్చిచూడాలని ఈ సమావేశంలో కొన్ని పార్టీలు చేసిన సూచనను ఇసి ఆమోదించవచ్చు.

ఈ సమావేశానికి ఇసి నిర్దేశించిన ఎజెండాలో ఈ అంశం లేకపోయినా అనేక రాజకీయ పార్టీల ప్రతినిధులు దాన్ని లేవనెత్తటం ఇవిఎంల పనితీరుపట్ల వారి ఆందోళనను ప్రతిబింబించింది. సంవత్సరాంతంలో అసెంబ్లీ ఎన్నికలు, ఆపై లోక్‌సభ ఎన్నికల దృష్టా ఇసి రాజకీయ పార్టీల సమావేశం పిలిచింది. పోలింగ్‌కు ముందు 48 గంటల ‘సైలెన్స్’ను సోషల్ మీడియాలో దశలవారీ ఎన్నికల్లో అమలు జరపటం, ఎన్నికల వ్యయాన్ని పరిమితం చేయటం, మహిళల భాగస్వామ్యాన్ని పెంచటం, శాసన మండలి ఎన్నికల్లో వ్యయ పరిమితిని ప్రవేశపెట్టటం, దేశంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, ఓటింగ్‌కు ప్రత్యక్షంగా హాజరు కాలేని ఓటర్లు ఓటు చేసే మార్గాలు వంటి అంశాలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరింది. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు మనకు తెలియవు. కొన్ని పార్టీలు బయట మీడియాతో మాట్లాడిన విషయాలను బట్టి వాటి అభిప్రాయాలు వెల్లడైనాయి. 48 గంటల సైలెన్స్‌లోకి ప్రింట్ మీడియాను తెచ్చే ప్రతిపాదనపై వారేమి చెప్పారో తెలియదు. అయితే అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై పరిమితి ఉన్నట్లు పార్టీలు చేసే వ్యయంపై అవి పోటీ చేసే సీట్ల సంఖ్యను బట్టి పరిమితి విధించాలని కాంగ్రెస్ తదితర పార్టీలు కోరాయి. కాని బిజెపి ఎటువంటి పరిమితినీ వ్యతిరేకించింది. మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదమే శరణ్యం. అందుకు చొరవ చేయాల్సింది ప్రభుత్వం. శాసన మండలి ఎన్నికల్లో కొన్ని సందర్భాల్లో అభ్యర్థులు విపరీతంగా డబ్బు వెచ్చిస్తున్నందున వ్యయంపై సీలింగ్‌కు అనుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తున్నది.

ఇవి ఎన్నికల నిర్వహణను మెరుగుపరచటానికి ఉద్దేశించిన చర్చలు. అయితే ఎన్నికల క్రమాన్ని వక్రీకరిస్తున్న చర్యలు ఖండించదగినవి. వాటిలో ఒకటి కంపెనీలు రాజకీయ పార్టీలకు యిచ్చే విరాళాలకు ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్లు, విదేశీ కంపెనీలు కూడా మన దేశంలోని కార్యాలయాల ద్వారా విరాళాలిచ్చేందుకు అనుమతి. కార్పొరేట్ రంగం ఏ పార్టీకి ఎంత ఇచ్చిందీ వెల్లడించాల్సిన పనిలేదు. అవి సహజంగా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందటానికి అధికారంలో ఉన్న పార్టీకి అత్యధికంగా విరాళాలిస్తాయి. ఇప్పుడు బిజెపి అత్యంత ధనవంతమైన పార్టీ కావటం గుర్తు చేసుకోదగింది. ఒక చోట ఓటరుగా ఉండి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారి ఓట్లను, ఏదోక కారణంతో ఓటు చేయటానికి హాజరుకాలేని వారి ఓట్లను పోస్టల్ బ్యాలెట్, ప్రాక్సీ విధానం (ఓటర్లు అభీష్టం ప్రకారం మరొకరు ఓటు చేయటం), ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా వేసేందుకు అనుమతించాలన్న ఇసి ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైంది. నిర్బంధ ఓటింగ్ లేనప్పుడు అటువంటి వారి ఓట్లు వేయించటమన్న ఆలోచనే ప్రజాస్వామ్యాన్ని వక్రీకరిస్తుంది. ఓటర్ల మనోభీష్టం చట్టసభల్లో ప్రతిబింబించే దామాషా ప్రాతినిథ్య ప్రక్రియల గూర్చి కనీస సూచన చేయని ఇసి, ప్రాక్సీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ గూర్చి ప్రతిపాదించటం సబబుగా లేదు. ఇది ఆచరణలో అనేక ‘ఎన్నికల అక్రమాలకు’ దారి తీస్తుంది.