Home ఎడిటోరియల్ ఒబిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదా

ఒబిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదా

Constitutional status to the OBC Commission

ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి) జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే రాజ్యాంగ 123వ సవరణ బిల్లుకు గురువారం నాడు లోక్‌సభ ఏకగ్రీవామోదం లభించటం ఈ అంశంపై రాజకీయ పార్టీల స్థూల అంగీకారాన్ని ప్రతిబింబించింది. అయితే రాజ్యసభ ప్రతిపాదించిన సవరణలను అధికార తీర్మానం ద్వారా ప్రభుత్వం నిరాకరించినందున అది తిరిగి రాజ్యసభకు వెళుతుంది. దాని ఆమోదం ఇక లాంఛనమే. ప్రతిపాదిత ఒబిసి కమిషన్‌లో సభ్యులందరూ వెనుకబడిన తరగతుల నుంచే ఉండాలని, మైనారిటీ సముదాయ సభ్యుడొకరు తప్పనిసరిగా ఉండాలని రాజ్యసభ సవరణ ఆదేశించింది. లోక్‌సభలో చర్చ సందర్భంలో, కమిషన్ సభ్యుల్లో ఒక మహిళ ఉండాలని బిజెడి సభ్యుడు భర్తృహరి మెహతాబ్ సూచన చేయగా, రూల్సు తయారీ సమయంలో దాన్ని నెరవేర్చుతామని మంత్రి హామీ యిచ్చారు. అలాగే తమతమ ప్రాంతాల్లో వెనుకబడిన తరగతులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు గల హక్కు యథాతథంగా ఉంటుంది. రిజర్వేషన్‌ను నిర్ణయించే హక్కు రాష్ట్రాలకు ఉండాలని టిఆర్‌ఎస్ సహా కొన్ని ప్రాంతీయ పార్టీలు చేసిన డిమాండ్ తిరస్కరణకు గురైంది. యుపిఎ ప్రభుత్వ కాలంలో రూ. 5 వేల కోట్లు వెచ్చించి నిర్వహించిన ఒబిసిల సామాజిక ఆర్థిక స్థితి, కుల గణాంకాల నివేదికను విడుదల చేయాలని కొందరు డిమాండ్ చేశారు. జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించటం (ఆర్టికల్ 338 బి) వల్ల దానికి ఎస్‌సి ఎస్‌టి జాతీయ కమిషన్‌వలె అన్ని హక్కులు, విధులు, బాధ్యతలతోపాటు సివిల్ కోర్టుకుండే అధికారాలుంటాయి.
లోక్‌సభ గత సంవత్సరం ఏప్రిల్ 10న ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించి రాజ్యసభకు పంపగా, సుమారు 40 సవరణలతో ఆగస్టు 31న తిరిగి లోక్‌సభకు వచ్చింది. లోక్‌సభ తిరిగి ఆ బిల్లును ఆమోదించటానికి దాదాపు సంవత్సర కాలం పట్టటానికి రాజకీయాలే మూలమనవచ్చు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు మండల్ కమిషన్ సిఫారసు ప్రకారం ప్రభుత్వోద్యోగాల్లో, ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్స్‌లో 27 శాతం రిజర్వేషన్ అమలవుతోంది. ఇది దేశ రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్‌ల్లో రాజ్యాధికారం బిసి పార్టీల వశమైంది. అయితే రిజర్వేషన్ ఫలాలను బిసిల్లోని ఆధిపత్య కులాలే అనుభవిస్తున్నాయని, అందువల్ల వర్గీకరణ అవసరమన్న డిమాండ్ బిసిల్లో అత్యంత వెనుకబడిన కులాల నుంచి వచ్చింది. ఒబిసిల రాష్ట్ర జాబితా వేరు, కేంద్ర జాబితా వేరు. అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ కొరకు ఒబిసిల్లో ఎ,బి,సి, డి, ఇ వర్గీకరణ ఉందిగాని కేంద్ర జాబితాలో లేదు. కేంద్ర జాబితాలోని కులాల వర్గీకరణ కొరకు మోడీ ప్రభుత్వం జస్టిస్ రోహిణి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ త్వరలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు నివేదిక అందజేయనుంది.
ఒబిసిల్లో అత్యంత వెనుకబడిన తరగతులను తమ ఓటు బ్యాంక్‌గా మార్చుకునేందుకు బిజెపి కొద్ది సంవత్సరాలుగా గట్టి ప్రయత్నం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రయత్నం ఫలితాలిచ్చింది. అలాగే బీహార్‌లో అత్యంత వెనుకబడిన తరగతులకు నాయకుడైన ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను మహాకూటమి నుంచి బయటకు తెచ్చి ఎన్‌డిఎలో చేర్చుకుంది. లోక్‌సభ ఎన్నికల దృష్టి నుంచి అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో ఒబిసిల్లో ఆధిక్యం వహిస్తున్న యాదవ్‌లను దెబ్బతీసేందుకు, అలాగే దేశ వ్యాప్తంగా ఆ కులాల్లో పలుకుబడి సంపాదించేందుకుగాను బిజెపి, జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వటాన్ని, ఒబిసిల వర్గీకరణను రాజకీయ ఆయుధంగా ప్రయోగించింది. రాజ్యాం గ సవరణ బిల్లు ఆమోదం పొందకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయంటూ మొన్నటిదాకా నిందించిన బిజెపి, ప్రతిపక్ష పార్టీల ఏకగ్రీవ తోడ్పాటుకు ఆశ్చర్యపడి ఉండవచ్చు.
జాతీయ వెనుకబడిన తరగతుల చట్టం, 1993 ప్రకారం 1993 ఆగస్టు 14న కమిషన్ ఏర్పాటైంది. కేంద్ర ఒబిసి జాబితాలో 5 వేలకుపైగా కులాలున్నాయి. వెనుకబడిన, ఎక్కువ వెనుకబడిన, అత్యంత వెనుకబడిన అనే మూడు వర్గాలుగా ఒబిసిల వర్గీకరణ కొరకు కమిషన్ ఇది వరకే సిఫారసు చేసింది. జస్టిస్ రోహిణి కమిటీ ఆ వర్గీకరణ చేస్తుంది.
ఎస్‌సి, ఎస్‌టి (అత్యాచారాల నిరోధక) చట్టం యథాపూర్వ స్థితి పునరుద్ధరణ, జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదా బిల్లు ఆమోదంలో రాజకీయ పార్టీలకు ప్రయోజనాలున్నప్పటికీ సమాజంలోని అట్టడుగు, బడుగు బలహీన తరగతులకు ఎంతోకొంత అండదండనిచ్చే ఈ చర్యలు స్వాగతించదగినవి.