Home ఆఫ్ బీట్ పొలాలన్నీ జలాల తడిపీ..!

పొలాలన్నీ జలాల తడిపీ..!

KCR-with-Irrigation-Project

సాగునీటి రంగంలో  దూసుకుపోతున్న తెలంగాణ సర్కార్

నాలుగేళ్లలో 8 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి
కొత్తగా పది లక్షల ఎకరాలకు నీరు
చెరువులకు జీవం పోసిన మిషన్ కాకతీయ
రాష్ట్రంలో తగ్గిన నీటి ఆందోళనల 

నీళ్లు, నిధులు, నియామకాలే ట్యాగ్‌లైన్‌గా ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రాథమిక లక్ష్యాలు నెరవేర్చే దిశలోనే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుండడం, నీటి రంగంలో కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు ఉన్న వాటాను పూర్తిగా సద్వినియోగం చేసే దిశగా ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్, రీ డిజైనింగ్ సాగునీటి రంగ నిపుణుల ప్రశంసలందుకుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాలుగేళ్ల హయాంలో ఎనిమిది పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తిచేయగా మరో 11 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయి. దీంతో కొత్తగా 10 లక్షల ఎకరాలకు నీరందడంతో పాటు, మరో 15.17 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. 201819లో మరో 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్షంగా ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి.

మిషన్ కాకతీయతో సాగునీరు

‘మిషన్ కాకతీయ’లో భాగంగా చెరువుల పునరుద్ధరణతో 8.10 టిఎంసిల మేర అదనంగా నీటిని నిల్వచేసుకోగలిగింది. చెరువుల్లో పూడిక తీయడం, కట్టలు బలోపేతం చేయడం, అవసరమైన చోట్ల గొలుసుకట్టు కాలువలు, ఫీడర్ చానళ్ళకు మరమ్మత్తులు చేయడంతో మొదటి దశలో 6.73 లక్షల ఎకరాలు, రెండో దశలో 4.29 లక్షల ఎకరాలు, మూడో దశలో 1.45 లక్షల ఎకరాలు, మొత్తంగా 12.47 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. కొత్తగా 1.05 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. మిషన్ కాకతీయ పథకం దేశానికే ఆదర్శంగా మారిందని మంత్రి హరీశ్‌రావు సంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు, దాని అమలుకు ముందుకు వచ్చాయని సంతోషం వ్యక్తంచేశారు.

పాలమూరు ఎత్తిపోతలతో వలసలు వాపస్

మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు ఎత్తిపోతల పథకాల కింద 201617లో ప్రభుత్వం నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరివ్వగా, 201718 రబీలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. దీనికి అదనంగా 700 వరకు చెరువులు నిండాయి. ఫలితంగా వలసలు ఆగిపోవడమే కాకుండా గతంలో ఉపాధి నిమిత్తం పట్టణాలకు వలస పోయినవారు తిరిగి వస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో 400కు పైగా చెరువులు ఇప్పటికే నిండగా, ఈ సీజన్ ఆగస్టులోనే జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలోకి దండిగా నీరు చేరింది. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు సరిపడా నీరు అందుబాటులో ఉంది. ఫలితంగా ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్‌కు కూడా ఢోకా లేని పరిస్థితి నెలకొంది.

పెండింగ్ ప్రాజెక్టుల పరుగులు

KCR

పాత సాగునీటి ప్రాజెక్టులను కూడా పునరుద్ధరించే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాగార్జునసాగర్, నిజాంసాగర్, ఘనపూర్ ఆనకట్ట కాలువల ఆధునీకరణ పనులు పూర్తిచేసి, మొత్తం ఆయకట్టుకు ప్రభుత్వం నీరు అందించింది. శ్రీరాంసాగర్ కాలువల ఆధునీకరణకు రూ.1000 కోట్లు మంజూరు చేసింది. పనులు జరుగుతూ ఉన్నాయి. 200414 మధ్య కాలంలో కాంగ్రెస్ హయాంలో పదేళ్ళ కాలంలో సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు 5.71 లక్షల ఎకరాలు కాగా, స్థిరీకరణ జరిగింది 93 వేల ఎకరాలే. ఇందులో ఎఎంఆర్‌పి, ఎస్‌ఆర్‌ఎస్‌పి 2 కింద 5.56 లక్షల ఎకరాలకు నీరిచ్చినట్లు చెప్పినా, నీరు పారింది 1.5 లక్షల ఎకరాల్లో మాత్రమే. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగున్నరేళ్ళలోనే 10 లక్షల ఎకరాలకు నీరివ్వడంతో పాటు, మరో 15.72 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది.

తగ్గిన రైతుల ఆందోళనలు..

నిజాంసాగర్, శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్‌ల కింద మొత్తంగా 18.6 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, 201718 రబీలో ఏకంగా 13 లక్షల ఎకరాలకు పైగా సాగునీటిని అందించింది ప్రభుత్వం. ‘గతంలో లాగా రైతాంగం ఎక్కడా నీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయడం లేదు. రైతులకు ఈ ఏడాది 13 లక్షల ఎకరాలకు నీరివ్వగలిగింది. “ఒకప్పుడు శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాలు తరచూ ఆయకట్టు చివరి భూములకు నీరు ఇవ్వాలన్న డిమాండ్‌తో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేవి. కానీ ఇప్పుడు అలాంటి డిమాండ్లే రావడం లేదంటే ఇంజనీర్లు, ఇరిగేషన్ శాఖ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు” అని ఓ సందర్భంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంజనీర్లను అభినందించారు.

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి

Kcr speech at husnabad

ఉద్దేశపూర్వకంగా సమైక్య రాష్ట్రంలో పెండింగ్‌లో పెట్టిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, మిడ్ మానేరు, సింగూరు, కిన్నెరసాని, పాలెం వాగు, కుమ్రం భీం, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాధపూర్ వంటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. కొత్తగా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం మరో రెండు నెలల్లో సిద్ధంగా ఉంది. గట్టు ఎత్తిపోతలకు ఇటీవలే శంకుస్థాపన చేశారు. చనాకా కొరటా బ్యారేజి, మల్కాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వరద కాలువపై రివర్స్‌లో నీటిని తీసుకెళ్లేలా పునరుజ్జీవ పథకం చేపట్టింది. అసంపూర్తిగా ఉన్న దేవాదులను పూర్తిచేయడంతో పాటు 365 రోజుల పాటు ఈ ప్రాజెక్టుకు నీరు అందుబాటులో ఉంచేందుకు తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై బ్యారేజి ప్రభుత్వం నిర్మిస్తోంది.

పాలమూరు రంగారెడ్డి

కృష్ణా జలాల్లో పూర్తి వాటా వాడుకునేందుకు వీలుగా పాలమూరు రంగారెడ్డి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.3 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు వీలుగా పథకాన్ని రీడిజైన్ చేశారు. దీనికి తోడు డిండి ఎత్తిపోతల ద్వారా ఫ్లోరైడ్ పీడిత దేవరకొండ, మునుగోడు ప్రజలను సాగు, తాగునీరివ్వాలని నిర్ణయించారు. డిండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు కోర్టు కేసుల కారణంగా మధ్యలో కొంత వేగం తగ్గినా, ఇప్పుడు పనులు పుంజుకున్నాయి. పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీరిచ్చి, కరవు జిల్లా పేరును శాశ్వతంగా చెరిపేసి, పచ్చని పంటల జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కంకణబద్ధంగా పనిచేస్తోంది.

భక్త రామదాసు, సీతారామ ప్రాజెక్టు

రికార్డు సమయంలోనే భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రభు త్వం పూర్తిచేసి, కరవు పీడిత పాలేరు నియోజకవర్గం ఆయకట్టుకు తడులు అందిస్తున్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టును రీడిజైన్ చేసి సీతారామ ఎత్తిపోతల పథకంగా మార్చారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకు నీరిచ్చేలా పనులు వేగంగా జరుగుతున్నాయి.

రికార్డుల కాళేశ్వరం..

కోర్టుల్లో కేసులతో ప్రతిపక్ష పార్టీలు ప్రాజెక్టులు అడ్డుకుంటున్న తీరుతో కేంద్ర జలసంఘం అనుమతులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఫలితంగా రికార్డు స్థాయిలో కాళేశ్వరంకు త్వరితగతిన అన్ని అనుమతులు వచ్చాయి. గోదావరి జలాల సంపూర్ణ వినియోగానికి వీలుగా రీడిజైన్ చేసిన కాళేశ్వరంలో 19 పంపుహౌజ్‌లు ఉన్నాయి. ఒక్కో పంపు హౌజ్ ఒక్కో ప్రాజెక్టుతో సమానం. ఈ ప్రాజెక్టు పూర్తయితే 18 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు, మరో 18 లక్షల ఎకరాల స్థిరీకరణకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో కొత్త పర్యాటక ప్రాంతాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు సైట్లు తయారయ్యాయి. ఇక్కడ విఐపిల తాకిడి ఎక్కువగా ఉండగా, సామాన్య ప్రజల డిమాండ్ మేరకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా ప్యాకేజి టూర్‌నే కాళేశ్వరం కోసం రూపొందించింది.

మహారాష్ట్రతో ఒప్పందం

గోదావరి జలాల సమగ్ర వినియోగం కోసం తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో సుహృద్భావ వాతావరణంతో చర్చలు జరిపి, చారిత్రక ఒప్పందం చేసుకుంది. గత ఏడు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందాన్ని సాధించలేదు. తెలంగాణ ప్రజల సువిశాల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ పరిణతితో వ్యవహరించి, ప్రాజెక్టుల నిర్మాణానికి కీలకమైన అంతర్రాష్ట్ర ఒప్పందాలను సాధించగలిగారు. నదీ జలాల వినియోగానికి సంబంధించి చేసుకున్న ఒప్పందాలను కేంద్ర జలసంఘం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాయి. దీంతో గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతి సారీ ఎన్నికల అంశంగా వాడుకునే స్థితి నుంచి చనాఖా కొరాటా బ్యారేజి నిర్మాణం వరకు పురోగతి కనిపిస్తూనే ఉంది. గోదావరి, కృష్ణా నదుల మీద 23 భారీ ప్రాజెక్టులు, 13 మధ్య తరహా ప్రాజెక్టుల్లో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, నీటి లభ్యతల ఆధారంగా అవసరమైన మేరకు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసే యత్నంలో మంత్రి హరీశ్‌రావు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. గత మూడేళ్ల నుంచి రూ.25 వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించి, నిధులు విడుదల చేస్తున్నారు.

– అశ్వధ్‌కుమార్‌రెడ్డి, మన తెలంగాణ ప్రతినిధి