Home వరంగల్ కలెక్టర్ ప్రోత్సాహం.. సర్పంచ్ ఉత్సాహం

కలెక్టర్ ప్రోత్సాహం.. సర్పంచ్ ఉత్సాహం

Farming-Ponds-construction

ఒకేరోజు 53 సేద్యపు కుంటల పనులు ప్రారంభం
నిర్మాణం పనులను ప్రారంభించిన డిఆర్‌డిఒ శేఖర్‌రెడి

గీసుకొండ: కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రోత్సాహానికి సర్పంచ్ ఉత్సాహం తోడైంది. ఇంకేముంది మండలంలోని ఎలుకుర్తి హవేలి గ్రామంలో ఒకే రోజు 53 సేద్యపు కుంటల నిర్మాణం పనులకు అంకురార్పణ జరిగింది. కలెక్టర్ మే 5వ తేదీన గ్రామాన్ని సందర్శించి పెద్ద మొత్తంలో ఐఎస్‌ఎల్ నిర్మాణాలను చేపట్టి ఓడిఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దిన సర్పంచ్ బీమగాని సౌజన్యను అభినందించారు. ఇలాంటి డైనమిక్ మహిళా సర్పంచ్‌ను రూరల్ జిల్లాలో ఎక్కడా చూడలేదని కితాబిచ్చారు. అయితే గ్రామంలో ఇంటింటికి ఇంకుడు గుంతలు, రైతుల భూముల్లో సేద్యపు గుంతలను అధికంగా నిర్మించాలని ఆయన ఈ సందర్భంగా సర్పంచ్‌కు సూచించారు.

కలెక్టర్ గ్రామానికి వచ్చినప్పుడు కేవలం నాలుగు సేద్యపు గుంతలే ఉండగా.. సర్పంచ్ చొరవ తీసుకొని రైతులను సమాయత్తం చేసి ఒకే రోజు ఏకంగా 53 సేద్యపు కుంటల పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం డిఆర్‌డిఒ వై.శేఖర్ రెడ్డి, ఎంపిపి ముంత కళాంతి, సర్పంచ్ బీమగాని సౌజన్య పనులను ప్రారంభించారు. ఎంపిడిఒ వీరమల్ల సాయిచరణ్, ఈఒపిఆర్‌డి భీంరెడ్డి రవీంద్రారెడ్డి, వైస్ ఎంపిపి కామని భాస్కర్, ఎపిఒ మోహన్‌రావు, ఎంసిఒ సురేష్ యాదవ్, ఉపాధిహామీ ఈసి శ్రీలత, టిఎ ప్రెసిల్లా, ఎఫ్‌ఎ రణమ్మ, టిఆర్‌ఎస్ నాయకులు ముంత రాజయ్య, రైతులు పాల్గొన్నారు.

సేద్యపుకుంట పదిఇంకుడు గుంతలకు సమానం డిఆర్‌డిఒ శేఖర్‌రెడ్డి ఉపాధి హీమీ పనులతో చేపట్టే సేద్యపు గుంతలను నల్లరేగడి నేలల్లో ఏర్పాటు చేసుకుంటే మంచిదని డిఆర్‌డిఒ వై.శేఖర్‌రెడ్డి అన్నారు. ఒక్కో సేద్యపు కుంట పది ఇంకుడు గుంతలతో సమానమని పేర్కొన్నారు. ఎలుకుర్తి హవేలిలో సేద్యపు గుంతల పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి సేద్యపు గుంత తవ్వకానికి రూ.27 వేలు అవుతుందని, ఉపాధి కూలీలే వీటిని నిర్మిస్తారన్నారు. కుంటల్లో నీరు నిల్వ కారణంగా భూగర్భ జల మట్టం పెరుగుతుందని, గట్టు వెంబడి సుబాబుల్ మొక్కలను నాటితే జీవాలకు గ్రాసంగా వాడుకోవచ్చన్నారు. నీటిలో చేపలను పెంచుకుంటే రైతుకు ఆదాయం వస్తుందన్నారు.