Home రాష్ట్ర వార్తలు అన్నిచోట్ల ఒకేసారి ‘డబుల్’ నిర్మాణాలు

అన్నిచోట్ల ఒకేసారి ‘డబుల్’ నిర్మాణాలు

-మున్సిపల్ సమీక్షా సమావేశంలో సిఎం

cmహైదరాబాద్: హైదరా బాద్ నగరంలో నిరుపేదల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం అనువైన స్థలా లను గుర్తించాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నగరంలో ఏ నియోజకవర్గంలో ఎంత భూమి అందుబాటులో ఉంది, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎన్ని దరఖాస్తులు అం దాయి, పాత ఇళ్ళను తొలగించి కొత్త ఇళ్ళు కట్టుకునేందుకు ఎంత మంది సిద్ధంగా ఉన్నారనే విష యాలపై నివేదిక రూపొందించాలని సిఎం కోరారు. అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభం కావాలని ఆయన సూచించారు. మున్సిపల్ పరిపాలన, జిహెచ్ ఎంసిపై క్యాంప్ కార్యాలయంలో సోమవారం సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కె.శ్రీహరి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె.తారక రామారావు, నగర మంత్రులు తలసాని శ్రీనివాస్, నాయిని నర్సింహా రెడ్డి, టి.పద్మారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ వ్యవహారాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్, సిఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, మున్సిపల్ పరిపాలన సంచాలకులు దాన కిషోర్ పాల్గొన్నారు. నగరంలో మెరుగైన పాలన అందించేందుకు పోలీసు, రవాణ, జిల్లా కలెక్టర్ సహకారం తీసుకోవాలన్నారు. జిహెచ్‌ఎంసి సమావేశాలకు హైదరాబాద్,రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లను కూడా ఆహ్వానించాలన్నారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, మెట్రో వాటర్ సప్లయి బోర్డు సమన్వయంతో పనిచేయాలని, మంచినీరు, మురుగునీరు, వరదనీరు కలువకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో 3,800కు బస్సులు తిరుగుతున్నాయని, వాటి కోసం అవసరమైన బస్ బేలు నిర్మించాలని కోరారు.
విశ్వనగరంగా తీర్చిదిద్దాలి
హైదరాబాద్ నగరం స్థితిగతులు పూర్తిగా అవగతం చేసుకుని విశ్వనగరంగా తీర్చిదిద్దాల్సిన తక్షణ కర్తవ్యం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లపై ఉందని సిఎం ఉద్బోదించారు. కార్పొరేటర్లు చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయాలని సిఎం కోరారు. గత ప్రభుత్వాల విధానాల వల్ల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఆర్థిక పరిస్థితి దిగజారిందని సిఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగరం ఓ విషయ వలయంగా మారిందని, దీని నుంచి ప్రజలకు బయటపడేయాలని ఆయన సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 4,700 డబుల్ బెడ్ ఇళ్ళు నిర్మించి ఇస్తామని చెప్పామని, దానికి స్థలాల అన్వేషణ కూడా జరుగుతోందన్నారు. ఇది ఫలించాలంటే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కలిసి పనిచేయాలన్నారు.
కంటోన్మెంట్‌నూ అభివృద్ధి చేయాలి
ఇకనుంచి కంటోన్మెంట్ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడకుండా జిహెచ్‌ఎంసిలో భాగంగానే పరిగణించి అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. హైదరాబాద్ ఎలా ఉండేది, ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది ఎవరికి వారుగా బేరీజు వేసుకుని కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. కాంట్రాక్టర్లు ముఠాలుగా ఏర్పడి చేసే దోపిడికి అడ్డుకట్ట వేయాలని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్, ఇర్కాన్, ఎన్‌డిబి వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. కార్పొరేటర్లు ఇతర ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం పెరగాలని ఆయన అన్నారు. నగరాభివృద్ధి విషయంలో నాగపూర్, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో అమలయ్యే కార్యక్రమాలను అధ్యయనం చేయాలని ఆయన కోరారు. ఆ నగరాలకు చెందిన కార్పొరేషన్ మేయర్లు, కమిషనర్లను కూడా శిక్షణా తరగతులకు ఆహ్వానించి, వారి అనుభవాలు, సూచనలు తెలుసుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. ఇప్పటికే మంజూరు అయిన మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్, బస్ బేస్, మార్కెట్లు, పబ్లిక్ టాయ్‌లెట్లు, స్మశాన వాటికలు తదితర పనుల పురోగతిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్‌ను మురికివాడలు లేని మహానగరంగా మార్చేందుకు ప్రణాళికలు అమలు చేయాలని చెప్పారు. ప్రతి 5వేల మందికి ఒక ప్రజా కమిటీ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
టిఆర్‌ఎస్ కార్పొరేటర్‌లకు శిక్షణ
టిఆర్‌ఎస్ నుండి గెలుపొందిన జిహెచ్‌ఎంసి కార్పొరేటర్లకు ఈనెల 11,12 తేదీలలో, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేటర్లకు 13వ తేదీన శిక్షణ ఇవ్వనున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. నగర శివారులోని ప్రగతి రిసార్ట్‌లో ఈ ఉంటుందని తెలిపారు. శిక్షణ కోసం ప్రత్యేక సిలబస్‌ను రూపొందించాల్సిందిగా సిఎం కెసిఆర్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి)ని కోరారు. నగర ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక సంస్థలు, కార్పొరేటర్ల పాత్రపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. 3 రోజుల పాటు సాగే శిక్షణా తరగతుల్లో తాను కూడా హాజరవుతానని, అక్కడే బస చేస్తానని, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్కడే బస చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. 11, 12 తేదీల్లో జిహెచ్‌ఎంసి కార్పొరేటర్లు, 13న మిగతా కార్పొరేషన్ల కార్పొరేటర్లకు కూడా కలిపి శిక్షణ ఉంటుందని సిఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు కూడా పాల్గొనాలని సూచించారు.