Home తాజా వార్తలు ప్రాజెక్టుల్లో రికార్డు

ప్రాజెక్టుల్లో రికార్డు

ktr

ప్రపంచంలో కనీవిని ఎరుగని రీతిలో నిర్మాణం : మంత్రి కెటిఆర్ 

మన తెలంగాణ / సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేలా శరవేగంగా సాగుతున్నాయని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం సిరిసిల్లలో రైతుబంధు పథకం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. కార్యక్రమానికి జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య అధ్యక్షత వహించారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉండేలా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతుందని కేంద్ర జలవనరుల సం ఘం వారే చూసి అబ్బుర పడ్డారని, దేశంలోని మిగిలిన రాష్ట్రాల వారిని మన ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరిశీలించడానికి పంపుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్షం తో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లోకి కూడా ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని అందించేందుకు ప్రణాళికాబద్దంగా ప్రాజెక్ట్‌లను నిర్మించిన విషయాన్ని ఆయన వివరించారు. బోర్‌వెల్స్ ద్వారా పంటలు పండేందుకు నిరంతర విద్యుత్‌ను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గతంలో కరెంట్ కోసం వేసవిలో విద్యుత్ సబ్‌స్టేషన్ల ముందు ఆందోళనలు జరిగేవని, ఎండిపోయిన పంటలు ప్రదర్శిస్తూ శాసనసభలో సభ్యులు ఆందోళన చేసే వారని ఇప్పుడవేవీ ఎక్కడా కనిపించడం లేదన్నారు. అసలు రైతులే 24 గంటల కరెంట్ వద్దని ఆందోళన చేస్తున్న దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయన్నారు. నిబద్దతతో, మంచి ఆలోచనతో రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా రైతు కావడం వల్ల రైతు ప్రయోజనకరమైన ఆలోచనలు జరుగుతున్నాయన్నారు. గతంలో గ్రామాల్లో బ్యాంకుల నుండి అప్పులు తీసుకున్న రైతులు సకాలంలో అప్పులు కట్టకపోతే బ్యాంక్ అధికారులు గ్రామాల్లోకి వచ్చి రైతుల ఇండ్ల తలుపులు తీసుకువెళ్లేవారని అటువంటి పరిస్థితి తిరిగి రావద్దని రైతులు రుణ విముక్తి పొందాలని దేశంలో ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఆలోచించని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచించి ఎకరానికి 4 వేల రూపాయలు అందిస్తున్నారన్నారు. రైతుల కష్టాలు తెలిసి రైతు ప్రయోజనకరమైన చర్యలు తీసుకుంటున్నారని ఓట్ల కోసం, సీట్ల కోసం రైతు సంక్షేమ చర్యలు చేపట్టడం లేదన్నారు. రైతులు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను విశ్వసిస్తున్నారని 2014 ఎన్నికల్లో తెరాస కేవలం లక్ష రూపాయల మాత్రమే పంట రుణం మాఫీ చేస్తామంటే రైతులు కెసిఆర్‌ను నమ్మి ఓటేశారని అదే సమయంలో ప్రతిపక్షాలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నా రైతులు నమ్మలేదన్నారు. రైతులను మభ్యపెట్టే ప్రకటనలు ఎవరు నమ్మరని ఆయన అన్నారు. అధికారం కోసం ప్రతిపక్షాలు ఇష్టారాజ్యంగా ప్రకటనలను చేస్తూ హామీ ఇస్తున్నా ఎవరూ నమ్మరని ఆయన అన్నారు. అధికారం కోసం తాపత్రయపడేవారి కథ సూదికథలా ఉందని మాట్లాడుతూ ఒక దర్జీ సూదిని పోగోట్టుకుని దేవుణ్ని ప్రార్థిస్తూ సూది దొరికితే రెండు కిలోల చక్కెర నైవేద్యంగా సమర్పిస్తానని మొక్కుకున్నాడని, 50 పైసల సూది కోసం రెండు కిలోల చక్కెర నైవేద్యంగా ఎలా ఇస్తారని దర్జీ భార్య ప్రశ్నిస్తే నైవేద్యం పెట్టేనాటికి కదా అన్న చందంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయన్నారు. చిత్తశుద్ది ఉన్న నేతలనే ప్రజలు విశ్వసిస్తారన్నారు. రైతుబంధు పథకం కింద రైతులకు ఏటా రూ 8 వేలు అందుతాయని ఐదేళ్లలో 40 వేల రూపాయలు ఉచితంగా పెట్టుబడి కింద అందుతాయని వివరించారు. బ్యాంకులు కూడా పరిమితులకు లోబడే రుణాలు అందిస్తాయన్నారు. తెలంగాణలో గతంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థం ఉన్న గోదాములుంటే తెరాస 20 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను నాలుగేళ్లలో నిర్మించిందని అన్నారు. ప్రతిపక్షాలు తెరాస పనితీరును తట్టుకోలేక పోతుందని కడుపునిండా విషం నింపుకుని ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి వ్యతిరేకంగా కేసులు వేశారని రైతు బంధు పథకం కింద పెట్టుబడులు ఇస్తే కెసిఆర్ ఇచ్చే లంచం అని వంకర ప్రచారం చేస్తున్నారని వెటకారపు మాటలు మాట్లాడే ప్రతిపక్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. రైతులు పండించిన పంటలకు అవసరమైతే మద్దతు ధర చెల్లించి కొనుగోలు ధర చెల్లించి బడ్జెట్‌లో 500 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 10 నుండి 17వ తేదీ వరకు రైతు బంధు పథకం కింద పట్టాదారు పాసు పుస్తకాలు 4000 రూపాయల చెక్కులను అందిస్తారన్నారు. రైతులు శాసించి మద్దతు ధర సాధించుకోవాలనే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్‌బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జెసి యాస్మిన్‌భాషా, జిల్లా వ్యవసాయాధికారి అనిల్‌కుమార్, డిఆర్‌వో శ్యాంప్రసాద్‌లాల్ తోపాటు జడ్పిటిసిలు, ఎంపిపిలు, మున్సిపల్ చైర్‌పర్సన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.