Home వరంగల్ రైల్వే ఫూట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగేనా.?

రైల్వే ఫూట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగేనా.?

 Construction of railway foot over bridge in Warangal

మన తెలంగాణ/కార్పొరేషన్ : నగరంలోని వరంగల్ రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని గత ఏడేళ్లుగా ప్రజాప్రతినిధులు, పాలకవర్గాలు ఇస్తున్న హామీలు ఆచారణలో అమలు కాకపోవడంతో కలగానే మిగిలిపోయింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి పార్లమెంట్ సభ్యుడు రవిందర్ నాయక్ ఏకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఇప్పటి వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదు. శివనగర్ ప్రాంతం నుంచి రైల్వేస్టేషన్ ముందు వరకు నిత్యం వేలాధిమంది ప్రజలు వివిధ పనుల కోసం వస్తుంటారు. రైల్వేస్టేషన్‌కు రావాలంటే అండర్ బ్రిడ్జి, పోస్ట్ ఆఫీస్ మీదుగా సుమారు రెండు కిలో మీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాల్సి రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మూడవ నెంబర్ ఫ్లాట్ ఫాం మీదుగా రైల్వేస్టేషన్ నుంచి బయటికి వెళ్తు రైల్వే టిసిలకు పట్టుపడుతూ వందలాధి రూపాయలు జరిమానా రూపంలో చెల్లిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టేషన్ వరకు వెళ్ళే బాటసారుల కోసం శివనగరం నుంచి రైల్వేస్టేషన్ పై నుంచి ప్రధాన రహదారి వరకు రైల్వే ఫూట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాస్తామని రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు హామీలు ఇవ్వడమే కాక కార్పొరేషన్‌లోని కౌన్సిల్ హాల్ సమావేశంలో సైతం మాజీ ఎంపి రవిందర్‌నాయక్ ఆధ్వర్యంలో ఫూట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చారు. దాని అమలుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల శివనగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ రైలును వరంగల్ నుంచి డోర్నకల్ వరకు పొడగింపు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎంపి శివనగర్ నుంచి రైల్వే ఫూట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బ్రిడ్జి నిర్మాణానికి నిధులు సైతం విడుదలయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పడం పట్ల శివనగర్ ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూడగా ఫూట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం జరుగకపోవడంతో పాలకులు, అధికారుల తీరుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మారినా పాలకులు మారినప్పటికి శివనగర్ ప్రాంత వాసుల రైల్వే ఫూట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం తీరని కలగానే మిగిలింది. పాలకులు, అధికారులు వరంగల్ రైల్వేస్టేషన్ సందర్శించిన సమయంలో ఫూట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం చేస్తామని హామీలు ఇవ్వడంతోనే సరిపెడుతున్నారు. ఇప్పటికైనా రైల్వేశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ వహించి తక్షణం శివనగర్ నుండి వరంగల్ రైల్వేస్టేషన్ రోడ్డు వరకు రైల్వే ఫూట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.