Home తాజా వార్తలు నిర్మాణాత్మక డిజిటల్ విద్య

నిర్మాణాత్మక డిజిటల్ విద్య

Digital Education

 

చాక్‌పీసులు పట్టుకుని బోధించే రోజుల నుంచి మౌస్‌తో ప్రొజెక్టర్‌పై పాఠాలను చెప్పే తీరును ’నిర్మాణ్’ స్వచ్ఛంద సంస్ధ ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తోంది. ఇందుకు తొలివిడతగా తెలంగాణాలో 30 పాఠశాలలను ఎంపిక చేసింది. డిజిటల్ విద్యకు సంబంధించి అన్ని పరికరాలను సమకూర్చింది. డిజిటల్ బోర్డులపై చిత్రాల ద్వారా ప్రదర్శిస్తూ సవివరంగా బోధన చేయనున్నారు. ఆయా సబ్జెక్ట్‌లోని అంశాలను విద్యా శాఖ అధికారులు తయారుచేసిన హార్డ్‌డిస్క్‌ల సహాయంతో ఉన్నత ప్రమాణాలు పెంచేందుకు దోహదపడనున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని కొత్తగూడ, మణికొండ జడ్‌పీ హైస్కూల్స్‌లో నిర్మాణ్ ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాసురూమ్‌లలో కంప్యూటర్ లాబ్స్‌లో విద్యావికాసం ఇది. 

ప్రైవేట్ పాఠశాలలు డిజిటల్ విద్య వైపు ఆలోచించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వపాఠశాలల్లో డిజిటల్ విద్యను అమలుపరిచి ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిలబడే విధంగా ’నిర్మాణ్’ తోడ్పడుతోంది.

బేసిక్స్‌పై అవగాహన పెరిగింది
ఈ రెండు ప్రభుత్వ బడుల్లో 50 కంప్యూటర్లు ఏర్పాటు చేశారు.వారానికి నాలుగు రోజలు పాటు అన్ని తరగతుల విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన కలిగిస్తున్నారు. కంప్యూటర్ క్లాసులనగానే ఎంతో ఉత్సాహంగా విద్యార్థులు కంప్యూటర్ల ముందుకు చేరుతున్నారు. మా హైస్కూల్‌లో 928 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆగస్టు 8,2018న డిజిటల్ క్లాసు రూం ప్రారంభమైంది. రోజురోజుకు విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న క్రమంలో చిన్న వయస్సులోనే కంప్యూటర్ పరిజ్ఞానం పెంచడం వల్ల వారిలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది. డిజిటల్ క్లాసు రూంతో పాటు ఇద్దరు విద్యావాలంటీర్లను, ఒక వాచ్‌మెన్, మరొక పారిశుద్ధ్య కార్యికురాలికి కూడా ఉపాధి కల్పించింది నిర్మాణ్ సంస్థ. దీని వల్ల ప్రభుత్వ విద్యపై నమ్మకం కలిగి, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరేందుకు పిల్లలు క్యూకడుతున్నారని” కొత్తగూడ జిల్లాపరిషత్ హైస్కూల్ హెడ్‌మాస్టర్ జె.గోవింద్ అంటున్నారు.

చిన్నారుల్లో ఆసక్తి గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల్లో, ముఖ్యంగా ఉన్నత, మాధ్యమిక బడులో, కంప్యూటర్ల వినియోగాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించడానికి, కంప్యూటర్ పరికరాలు, ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయాలు, అందుబాటులో వుండేలా చూసి, విద్యార్థ్దులకు కంప్యూటర్ పైకనీస అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నారు కంప్యూటర్ ల్యాబ్‌లో పిల్లలకు పాఠాలు నేర్పుతున్న శాలిని,శశికళ.

ప్రభుత్వ బడికి సాంకేతికత అండ
మా స్కూల్‌లో 910మంది విద్యార్థులు చదువుతున్నారు. సంవత్సరం క్రితం నిర్మాణ్ సంస్థ మాకు డిజటల్ క్లాసు రూం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎంతో మేలు చేసింది. కంప్యూటర్ విద్యా విధానం వల్ల తెలివైన విద్యార్థితో పాటు సాధారణ విద్యార్థికి కూడా సులువుగా బోధించే అంశాలు అర్థం అవ్వడంతో పాటు తరగతిలోని విద్యార్థులందరూ సమాన ప్రతిభ కనబర్చడంతో ఆరోగ్యకర పోటీ వాతావరణం ఏర్పడనుంది. ఇటువంటి సమయాల్లో విద్యార్థులకు కూడా ఒత్తిడి లేని బోధన సాధ్యమవుతుంది. బోధించే అంశాలను స్క్రీన్‌పై చూపించడం ద్వారా విద్యార్థి ఎక్కువ ఉత్సాహంగా చదివే ఆస్కారం ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు మణికొండ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్ వి.నిరంజన్.

విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామాల నుంచి పట్టణాల్లోని స్కూల్స్‌కు మార్పించేందుకు ఆలోచన చేస్తున్న సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశ పెట్టి రోల్‌మోడల్‌గా నిలవాలనే ఆలోచనతో డిజిటల్ క్లాసురూమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తరగతి గదులను మార్పు చేస్తూ ప్రొజెక్టర్‌లు, కంప్యూటర్‌లు, టీవీలతో భోదించడంతో విద్యార్థులు కొంగొత్త అనుభూతి పొందనున్నారు. ప్రస్తుతం వేగంగా సాప్ట్‌వేర్‌లో చోటుచేసుకుంటున్న మార్పులను విద్యార్థులకు అందిపుచ్చే క్రమంలో భాగమే డిజిటల్ బోధన. ఈ మహత్తర కార్యక్రమానికి సాఫ్ట్‌వేర్ కంపెనీలు చేయూతనివ్వడంతో ’నిర్మాణ్ టీం’ అమలు చేస్తోందని తెలిపారు నిర్మాణ్ సంస్థ వ్యవస్థాపకులు మయూర్ పట్నాల.

                                                                                             – శ్యాంమోహన్

Constructive Digital Education Run In Government School

Telangana Latest News