Search
Tuesday 20 November 2018
  • :
  • :

నత్త నడకన తుంగతుర్తి -నాగారం రోడ్డు పనులు

 Thungathurthy to Nagaram Road Works

తుంగతుర్తి: అసలే వర్షకాలం ఆపై రోడ్డు నిర్మాణంలో జాప్యం. దీంతో ప్రయాణికుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. తుంగతుర్తి నుండి నాగారం వెళ్లే సింగిల్ రోడ్డును డబుల్ రోడ్‌గా సుమారు సంవత్సరం క్రితమే మార్చుతూ ప్రభుత్వం టెండర్ పిలిచి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం జరిగింది. అధికారుల, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో తెలియదుగానీ గత సంవత్సర కాలంగా తుంగతుర్తి నాగారం రోడ్డు పనులు నత్త నడకన సాగుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా మట్టి తవ్వకాలు చేసి కొంతభాగం మట్టిని నింపి కొంత భాగం మట్టికుప్పలతో వదిలి వేయడం జరిగింది. గతంలో ఉన్న తారు రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారి అటు పక్కు వెళ్ళరాక, ఇటు తారు రోడ్డుపై వెళ్ళలేక నిత్యం ప్రయాణికులు ఆ రోడ్డుపై ప్రయాణంతో నరకాన్ని కళ్ల చూస్తున్నారు. తుంగతుర్తి నుండి నాగారం వెళ్ళాలంటే వాహన దారుల బాధలు ఇంతింత కాదనే మాట ప్రతి వాహన దారుడు చెప్తున్నారు. గతుకుల మయంగా ఉన్న రోడ్డును వెడల్పు చేస్తామని చెప్పిన అధికారులు కాంట్రాక్టర్‌తో పనులు చేయించడంతో పూర్తిగా విఫలం అయ్యారనడానికి ప్రస్తుతం కనిపిస్తున్న రోడ్డు తీరు చెప్పకనే చెప్తోంది.

ఒక వాహనం వెళ్తుంటే మరో వాహనం ఎటు వెళ్ళాలో తెలియక ఎదురెదురుగా నిలబడడం చివరికి ఎవరో ఒకరు బురదయమమైన రోడ్డులోకి దిగి మరో వాహనానికి దారి ఇవ్వాల్సి వస్తోంది. బురదలో ద్విచక్ర వాహన దారులు పలు మార్లు జారి పడిన సంఘటనలు చోటు చేసుకుంటున్నా, పనులలో మాత్రం చురుకుదనం కనిపించడంలేదని ప్రజలు అంటున్నారు. తుంగతుర్తి నుండి తిరుమలగిరికి వెళ్ళాలంటే ప్రధాన రహదారి తుంగతుర్తి-నాగారం రోడ్డే కావడంతో నిత్యం అనేక ద్విచక్రవాహనాలు, ఆటోలు ,బస్‌లు వెళ్తుంటాయి. గుంతల మయమైన రోడ్డుతో పాటు రోడ్డు పక్కన కుప్పలుగా పోసిన మట్టితో పాటు తవ్వి వదిలి వేసిన రోడ్డు గుంతలు తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు వాహన దారులు చెప్తున్నారు. ఈ ఏడాది సరియైన వర్షాలు కురియక పోవడం వలన ఇప్పటి వరకు గుంతల మయంగా ఉన్న రోడ్డుపైనే ఎలాగోలా ప్రయాణం చేస్తు కాలం గడుపుతున్న ప్రయాణికులకు ప్రస్తుతం రెండు రోజులుగా కురుస్తున్న వర్షపు జల్లులకు రోడ్ అంతా బురద మయంగా మారడంతో వాహన దారులకు ప్రమాదాలు జరిగే సంకేతాలు కానవస్తున్నాయి. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు, చొరవ తీసుకుని రోడ్డు పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.

Comments

comments