Search
Sunday 22 July 2018
  • :
  • :

నత్త నడకన‘డబుల్’ఇండ్లు

Contractors who did not go for construction of 49 villages

జిల్లాలో ఇప్పటికి పూర్తయినవి కేవలం 90ఇండ్లే                                                                                                          1980 ఇండ్ల పనులు ప్రారంభమే లేదు
49గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
లబ్దిదారుల కమిటీలతో ఇండ్లు నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు

ఇళ్లు లేని నిరుపేదలకు అన్ని వసతులతో కూడిన రెండు పడక గదులు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు జిల్లాలో నత్త నడకన సాగుతున్నాయి. జిల్లాలో వేల సంఖ్యలో ఇండ్లకు మంజూ రు పొందగా ఈ ఏడాదిలో పూర్తయిన ఇండ్లు కేవలం 90 మాత్రమే. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం సరిపోదంటూ ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో జిల్లాలోని 49 గ్రామాల్లో టెండర్ ప్రక్రియకు నోచుకోలేదు. మంజూరు పొందిన 7270 ఇండ్లలో 1980 ఇండ్ల పనులు ఇంత వరకు ప్రారంభం కాలేదంటే ఎంత నత్తనడకన సాగుతున్నాయో అవగతమవుతోంది.

మనతెలంగాణ/జగిత్యాల: జిల్లాకు ప్రధానమంత్రి అవాస్ యోజన పట్టణ పథకం కింద 5890 ఇండ్లు మంజూరు కాగా, డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం కింద 7270 ఇండ్లు మంజూరయ్యాయి. అయితే ప్రభుత్వం ఇచ్చే మొత్తం సరిపోదని పేర్కొంటూ డబుల్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు సుముఖత చూపకపోవడంతో ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత ప్రభుత్వం డబుల్ ఇండ్ల నిర్మాణాలను పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్ శాఖల వారీగా కేటాయించి కాంట్రాక్టులు ఇచ్చింది. అయితే నిర్మాణాలు చాల చోట్ల ప్రారంభం అయినా పనుల్లో వేగం కొరవడింది. నత్తలకే నడక నేర్పుతున్నట్లుగా పనులు సాగుతుండటంతో వేల సంఖ్యలో మంజూరైన ఇండ్లలో ఇప్పటికీ కేవలం పదుల సంఖ్యలో మాత్రమే పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్ శరత్ తరచుగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఈ డిసెంబర్ నెలాఖరు లోగా డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తి చేయాలని లక్షం నిర్దేశించినా గ్రామాల్లో పనులు మాత్రం అంతంత మాత్రంగానే సాగుతున్నాయి.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు పూర్తయ్యేనా…?
జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ 2016 17 పథకం కింద జగిత్యాల పట్టణానికి 160, కోరుట్లకు 480, మెట్‌పల్లి పట్టణానికి 1250 ఇండ్లు మంజూరు కాగా జగిత్యాల పట్టణానికి మరో 4000 ఇండ్లు ప్రత్యేకంగా మంజూరయ్యాయి. ఈ పథకం కింద నిర్మించే ఇంటికి కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ. 3.80 లక్షలు కలిపి రూ. 5.30లక్షలు మంజూరయ్యాయి. అయితే మొత్తం 5890 ఇండ్లకు గాను 4720 ఇండ్లకు మాత్రమే టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇందులో 4140 పునాది స్థాయిలో ఉండగా , 60 బెసిమెంట్ స్థాయిలో, 92 పైకప్పు స్థాయిలో ఉండగా 4 ఇండ్లు పూర్తి అయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అధికారుల లెక్కలను బట్టి చూస్తే మంజూరైన ఇండ్లలో 500 ఇండ్లు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని తెలుస్తోంది. వేల సంఖ్యలో మంజూరైన ఇండ్లలో 100 ఇండ్లు కూడా పూర్తి కాలేదంటే ఇండ్ల నిర్మాణాలు ఎంత అధ్వాన్నంగా సాగుతున్నాయో స్పష్టమవుతోంది. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టించి వారి కల నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా అధికారుల పట్టింపులేని తనంతో గృహ నిర్మాణ పథకంలో అనుకున్న ఫలితాలు రావడం లేదు.
నత్తకు నడక నేర్పుతున్న డబుల్ ఇండ్ల నిర్మాణాలు….
అలాగే జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం మొదటి, రెండవ విడతలో జగిత్యాల నియోజకవర్గానికి 4500 ఇండ్లు మంజూరు కాగా, కోరుట్ల నియోజకవర్గానికి 1400, ధర్మపురి నియోజకవర్గానికి 1075, వేములవాడ మండలంలోని కథలాపూర్, మేడిపల్లి మండలాలకు 165, చొప్పదండి మండలంలోని మల్యాల, కొడిమ్యాల మండలాలకు 130 ఇండ్లు మంజూరయ్యాయి. ఈ పథకం కింద పట్టణంలో నిర్మించే 5120 ఇండ్లకు రూ.5.30 లక్షల చొప్పున 271.36 కోట్లు మంజూరు కాగా, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే 3910 ఇండ్లకు రూ.5.40 లక్షల చొప్పున రూ. 197.06 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే జగిత్యాల నియోజకవర్గంలోని 4500 ఇండ్లలో 4235 ఇండ్లు వివిధ దశల్లో ఉండగా, 50 ఇండ్లకు పై కప్పులు పడ్డాయి. 20 ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా 195 గృహాల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అలాగే కోరుట్ల నియోజకవర్గానికి 1400 ఇండ్లు మంజూరైతే అందులో 955 ఇండ్ల నిర్మాణం పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. 287 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా, 88 ఇండ్లు స్లాబ్ స్థాయిలో, 70 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ధర్మపురి నియోజకవర్గానికి 1075 ఇండ్లు మంజూరు కాగా అందులో 770 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించబడలేదు. 275 ఇండ్లు వివిధ దశల్లో ఉండగా, 30 ఇండ్లకు స్లాబ్‌లు పడ్డాయి. ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది. చొప్పదండి నియోజకవర్గంలో 130 ఇండ్లకు గాను 23 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతుండగా, 107 ఇండ్లకు పై కప్పులు పడ్డాయి. వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్, మేడిపల్లి మండలాల్లోని 165 ఇండ్లకు గాను 60 ఇండ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు. 61 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా, 44 ఇండ్లకు పై కప్పులు పడ్డాయి. మొత్తం జిల్లాలో 7270 ఇండ్లకు గాను ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరిగిన ఇండ్లు కేవలం 90 మాత్రమేనని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఇండ్ల నిర్మాణాలను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయించి గృహ ప్రవేశాలు చేసుకునేలా చర్యలు చేపట్టాలని లబ్దిదారులు కోరుతున్నారు.

Comments

comments